‘‘డాడీ! కాలేజీకి వెళుతున్నాను! బై!’’ శివ పిలుపుతో తన ఆలోచనా లోకం నుండి బయటపడ్డాడు ప్రభాకర్‌.‘‘బై! నాన్నా! జాగ్రత్తగా వెళ్ళు! ఆల్‌ ద బెస్ట్‌! హావ్‌ ఎ గుడ్‌ డే!’’ అంటూ నవ్వుతూ చేయూపాడు.‘ఓకె!’ ‘‘బై! మమ్మీ!’’ అంటూ ఫ్లాట్‌ మెయిన్‌డోర్‌ దగ్గరకు వేసి టకటకా మెట్లు దిగుతూ వెళ్ళిపోయాడు. వెనకాలే శ్యామల ‘‘ఆగు నాన్నా!’’ అంటూ ఏదో చెప్పుకుంటూ పరుగెత్తింది. హాలులో వున్న ప్రభాకరంకు ఇద్దరి సంభాషణ వినబడుతుండగానే వెళ్ళిపోయారు.తన కళ్ళముందే ఒక నవతేజం వెళ్ళిపోయినట్లుగా ఏదో నిస్సత్తువ, నిస్పృహ శరీరాన్ని, మనస్సును ఆవరించినట్లుగా అనిపించింది.ఇంటర్‌మీడియట్‌ మొదటిరోజు, తాను కాలేజీలో దింపుతానన్నా వినకుండా, తానొక్కడినే వెళతానని పట్టుపట్టాడు. కాలేజీకోసం కొత్తసైకిల్‌ కొనిపించుకున్నాడు. స్కూటీనో, లూనానో కొనిస్తా నన్నాడు.‘‘ఎందుకు డాడి! పెట్రోలు ఖర్చు. నేనేమయినా సంపాదిస్తున్నానా? సైకిల్‌ అయితే నాకు ఎక్సర్‌సైజు కూడా అవుతుంది’’ అని నిరాకరించాడు. తనకు ఎంతో సంతోషం అనిపించింది.ఆ వయసులో వాస్తవికంగా ఆలోచించడం వాడి మానసిక పరిణతి సూచిస్తుంది. తమ పెంపకంలో వాడికోసం పడ్డకష్టం ఇక ఫలించినట్లే అనిపించింది. సమాజంలో నేడున్న కాలుష్య వాతావరణంలో పిల్లలను కాపాడుకోవడం వాళ్ళను సరయిన దారిలో పెట్టడం ఎంత కష్టభరితమో ప్రభాకరంకు బాగా తెలుసు. ఏ మాత్రం దారితప్పినా వాళ్ళు తాగుబోతులుగానో, తిరుగుబోతులుగానో జులాయిలుగానో కావడానికి నిమిషం పట్టదు. శివ తన దగ్గరకొచ్చినప్పటి నుంచి కూడా......ఒకసారి ఆలోచన అక్కడ ఆగిపోయింది. 

శివ తమ కన్నకొడుకు కాదు. ఒక్కసారిగా మెలిపెట్టినట్లు గుండెలో బాధ... మసక మసకగా శివతల్లిదండ్రుల రూపం మనోఫలకం మీద... చిన్నా, సారికలు తమ ఆరేళ్ళ పిల్లాడితో ఇంటికి వచ్చిన రోజు... ఇంకా నిన్నామొన్న అన్నట్లే వుంది! కాలం ఎంత వేగంగా సాగిపోతుంది. అప్పుడే పదమూడేళ్లు దాటిపోయింది. ఆరోజు కళ్ళవెంట నీళ్ళురాబోయి ఆగిపోయాయి. బహుశా బాధపడటానికి, ఏడ్వటానికి అర్హతలేదేమో!?తాను ఒకనాడు రాసిన కవితలోని పంక్తులు గుర్తొచ్చాయి.కడివెడు కన్నీళ్ళుగుండెల్లో ఇంకిమహానదులయి ప్రవహిస్తున్నాయి.కంటతడి కనబడటం ఏనాడో మానేసింది.కనబడకుండాఏడ్వడం నేర్పిందీ నాగరికత!అందుకేనేమో గుండెలు పిండేస్తున్నా కళ్ళలో నీటిపొర కూడా కనబడకుండా అంతా మామూలే అన్నట్లు...ఆ రోజు... పదిహేనేళ్ళ క్రితం.ఉదయం 10 గం.లు అవుతోంది. తలుపు చప్పుడవడంతోబాటు, కాలింగ్‌ బెల్‌ కూడా మోగింది. బెడ్‌రూంలో తన టేబుల్‌ వద్ద కూర్చొని ఏదో రాసుకుంటున్నాడు తను. వెంటనే ఎలర్టయినప్పటికీ, తలుపులు తీయడం ఎవరొచ్చారో చూడటం శ్యామల పనికాబట్టి, కలం ఒక్కసారి ఆపి, పిలుపుకోసం చూశాడు. ఈ సమయంలో వచ్చేది వాచ్‌మెన్‌ లేదా ఇస్త్రీవాడో అయుంటాడు అని అనుకున్నాడు. తనకోసం ఎవరూ ఎక్కువగా రారు. తన కొలీగ్స్‌ ముందుగా అపాయింట్‌మెంట్‌ తీసుకోనిదే రానేరారు. ఎంతో ముఖ్యమైన వాళ్ళు మాత్రమే హఠాత్తుగా ఊడిపడతారు. ఎవరయినా సరే ముందు శ్యామల మాట్లాడాకే తనకు పిలుపు వస్తుంది.