‘‘బాబయ్యగారూ! వీణ్ణెందుకండీ వెంటబెట్టు కొచ్చేరూ.. తోడా?’’‘‘కాదమ్మా.. వేసవి సెలవులకి ఎక్కడికేనా తీసుకెళ్ళమని మారాం చేసేడు.. వాడి మంకుపట్టు నువ్వెరగంది కాదు’’‘‘అయితే కాంగ్రెసు మీటింగులకా. వీణ్ణి దేశభక్తుణ్ణి చేసేస్తున్నారా? బాగుంది బాగుంది వరస’’అంటూ నవ్వుతూ వినయంగా అదమాయించింది మేజరు గంగావతి.ఆర్మీలో ఎన్నో చక్కర్లు కొట్టి వడగడితే గాని ఉత్తరాలందవు.అందగానే చూసుకుని ‘నాన్నా, బాబయ్యగారూ వస్తున్నారు’ అని సంబరపడి పోతూ బయల్దేరి అమృత్‌సర్‌ వచ్చింది.‘‘అయినా వీడెందుకండీ ఇక్కడ.. తలనెప్పి.. బోధపడాలా ఏడవాలా..?’’‘‘నీతో బాటు తీసుకెళ్లే.. మేఁవేఁ ఎలాగో వస్తాంలే’’ అన్నారు నాన్న.‘‘ఇంకేం.. పదరా తమ్మూ.. పద’’ అంటూ రెక్కపట్టుకుని లాక్కుపోయి తన కార్లో కూర్చో బెట్టుకుంది గంగావతి.కార్లో కూర్చుని మనసు చెంగుమని గెంతులేస్తుంటే పొంగిపోతున్నాడు రఘు.. రఘురాం.డాక్టరు నారాయణమూర్తిగారి యిష్టసఖి కూతురు గంగావతి. రఘురాం తండ్రి రామచంద్రాచార్యులు గారు పేరూ, ప్రతిష్ఠా, పలుకుబడీ వున్న లాయరు. డాక్టరు గారూ, లాయరు గారూ స్వాతంత్ర్యోద్యమంలో లాఠీ దెబ్బలు రుచి చూసి అప్పుడప్పుడు జైళ్ళ పాలయిన వాళ్ళు. గాంధీ టోపీలు జరీ అంచు ఖద్దరు పంచెలూ పాట్నూలు కళ్ళ లాల్చీలూ.. వృత్తులు పక్కన బెట్టి వూళ్ళూ పూళ్ళూ తిరిగారు.

అమృత్‌సరొచ్చేరు.మేజరు గారి కారు అటారే దాటింది. దార్లో చిన్న తోటలో వేడివేడి కచోడిలమ్ముతుంటే.. వాటితో బాటు టీలు తెమ్మని డ్రైవర్ని పంపించేరు. రఘు చేత తినిపించి టీ తాగి బయల్దేరేరు. లాహోరు చేరుకునేసరికి పొద్దుకూకుతోంది.అదో పెద్ద కోట. ఏనుగు మీద గుర్రాన్నెక్కించి దానిమీద మనిషి మీద మనిషెక్కినా అందనంత కోటద్వారం. దాదాపు మైలు దూరం వుంటుంది ఆర్మికేంపు. క్వార్టర్సు చేరుకునేసరికి దీపాలు పెట్టేరు.అదొక పెద్ద మహలు. చలవరాళ్ళమయం. షేండ్లియర్లూ.. గోడలకి గాజుదీపాల గుత్తులూ.. చూస్తూ నిశ్చేష్టుడైపోయేడు రఘురాం.‘‘ఏవిట్రా.. ఒంటిమీద తెలివి లేకుండా చూస్తన్నావూ?’’‘‘గంగక్కా! ఏ మహరాజులదీ కోటా?’’‘‘రాణా రంజిత్‌ సింగుది.. సిక్కు సామ్రాజ్య చక్రవర్తి’’హిస్టరీ పాఠాలు జ్ఞప్తికొచ్చేయి.‘‘దార్లో ‘లవ్‌ హూర్‌’ అని బోర్డులున్నాయేఁవిటి? లాహోరు గదా?’’‘‘రాములవారి కొడుకు లవమహారాజు నిర్మించిన ఊరట.. అలాంటి బోర్డులు ఎక్కడ పడితే అక్కడ చాలా వున్నాయి’’ అని చెప్పింది.యూనిఫారం తీసి కోటు స్టేండుకి తగిలించి, స్నానం చేసి చీర కట్టుకుని కుచ్చెళ్లు సవరించుకుంటోంది. రవిక తొడుక్కుని వచ్చిందేమో చీర మరుగున దాచినా దాగడం లేదు వుబికిన చనుకట్టు బిగువు. నిలువుటద్దం ముందు నించుని కుంకం బొట్టు దిద్దుకుంటోంది. సోఫామీద కూర్చుని రఘురాం అద్దంలో పదేపదే చూస్తూ మైకంలో పడిపోతున్నాడు. వాడి చూపులు వీపు మీద చురుక్కుమనిపించి వెనుదిరిగి చూసింది గంగావతి పైట సర్దుకుంటూ.‘‘ఏం ఉవ్విళ్ళూరుతూ తేపకారుస్తున్నావ్‌.. కొంటి వెధవా.. నీకన్న ఎంత పెద్దదాన్నో తెలుసా.. అక్కన్రా.. చాల్చాలు.. బాత్‌రూంలో వేణ్ణీళ్లు పట్టి ఉంచేను.. ముందు స్నానం చేసి బట్టలు మార్చుకో.. తాపఁవేనా చల్లారుతుంది’’