ఉదయం ఏడయినా మంచం మీద నుంచి దిగాలనిపించటం లేదు. ఒళ్ళంతా సుత్తితో చితక్కొట్టినట్టు నొప్పులు. జ్వరం వచ్చిందేమో. తలనొప్పిగా కూడా ఉంది. కళ్ళు మండుతున్నాయి. హాల్లోంచి వస్తున్న శబ్దాలకి కళ్ళు బలవంతంగా విప్పి చూశాను. ఆయన లేచి, బ్రష్‌ చేసుకుని పేపర్‌ చదువుతున్నట్టున్నారు. పేజీ తిరగేస్తున్న శబ్దం, మధ్యమధ్యలో కోరస్‌గా ఆయన దగ్గు వినిపిస్తున్నాయి. ఆయనకు డయాబెటీస్‌ ఉన్న విషయం గుర్తొచ్చి లేని ఓపిక తెచ్చుకుని లేచి కూచున్నాను.బాత్రూంకెళ్ళి వేడినీళ్ళతో మొహం కడుక్కు న్నాను. వంట గదిలోకి దూరి ఒక పొయ్యి మీద పాలు పెట్టి మరో దానిమీద ఉప్మా చేశాను. ప్లేట్‌లో ఉప్మాతో పాటు ధనియాల కారప్పొడి వేసి ఆయన ముందు పెట్టాను. ఆయన తినడం మొదలెట్టాక వంట గదిలోకెళ్ళి కాఫీ కలిపి రెండు కప్పుల్లో పోసి ఆయన ముందున్న టీపాయ్‌ మీద ఒక కప్పు పెట్టి దానిమీద సాసర్‌తో మూతపెట్టాను. ఆయన పక్కనున్న సోఫాలో కూలబడి మెల్లగా కాఫీ తాగడం మొదలెట్టాను. వేడివేడి కాఫీ గొంతులోకి దిగుతుంటే ప్రాణానికి హాయిగా అనిపించింది.టిఫిన్‌ తిని ప్లేట్‌లో చేయి కడుక్కున్నాక ఆయన కాఫీ కప్పు అందుకుని తాగబోతూ పెద్దగా దగ్గారు.‘‘ఈ దగ్గు చంపేస్తోంది కస్తూరీ.... రాత్రంతా దీని వల్ల కలత నిద్రే. గుండెల నిండా కఫం పేరుకు పోయినట్టుంది’’ అన్నారాయన.‘‘డాక్టర్‌ రాసిచ్చిన దగ్గు మందు రాత్రి పడుకునే ముందు ఇచ్చానుగా’’ అన్నాను.‘‘ఏ మందులూ పని చేయడం లేదు. ఈ దగ్గు మందు ఇప్పటికే రెండు సీసాలు తాగేశాను.

 ఇది మూడో సీసా. ఇది ఎప్పటికీ తగ్గదేమోనని భయమేస్తోంది’’.‘‘తగ్గుతుందండీ. యాంటీ బయాటిక్స్‌ వాడేస్తే ఓ వారంలో తగ్గిపోయి ఉండేది. ఈ వయసులో వీలైనంతవరకు యాంటీ బయాటిక్స్‌ వాడకూడదని కదా సిరప్‌లు తాగుతున్నారు. సమయం పడుతుంది. దేనికయినా ఓపిక అవసరం’’.‘‘తగ్గుతుందంటావా?’’‘‘తప్పకుండా తగ్గుతుంది’’.‘‘ఏంటో ఈ రోగాలు... ముసలితనం నాలాంటి వాడికి శాపమేనేమో. ఇన్నిన్ని మందులు మింగాలన్నా కూడా విసుగనిపిస్తోంది. షుగర్‌కో మాత్ర, కొలెస్ట్రాల్‌ తగ్గడానికో మాత్ర, రక్తపోటుకో మాత్ర, రక్తం పలచబడడానికో మాత్ర, వీటన్నిటివల్ల ఎసిడిటీ రాకుండా మరో మాత్ర... ఉదయం టిఫిన్‌ ఎలా తింటానో అలానే మాత్రలు కూడా తింటున్నాననిపి స్తోంది’’.‘‘వయసు పైబడే కొద్దీ ఇలాంటి జబ్బులు సహజమండీ. ఇంకా మీరు నయం. రిటైర్మెంట్‌కి ఇంకా రెండేళ్లు ఉందనగా మీకు డయాబెటీస్‌ వచ్చింది. ఈ రోజుల్లో పాతికేళ్ళ కుర్రాళ్ళకి కూడా షుగర్‌, బీపీ వస్తున్నాయి కదండీ. ఆ రకంగా ఆలోచిస్తే మనం చాలా అదృష్టవంతులమనుకోవాలి’’.‘‘ఏం అదృష్టంలే కస్తూరీ. ఈ జబ్బుల గురించి ఆలోచించే కొద్ది డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నాను’’.