మేనేజర్‌ ఛాంబర్లోకి వెళ్ళాడు ముకుందం. ఏదో ఫైల్‌ చూస్తున్న మేనేజర్‌ అతని రాకని పట్టించుకోలేదు. ముకుందం అలాగే నుంచున్నాడు. కొద్దిసేపటికి మేనేజర్‌ తలె త్తి అతని కేసి చూశాడు.‘‘సాగర్‌ ఎంటర్‌ప్రైజస్‌ వాళ్ళ ఫైల్‌ తీసుకురమ్మన్నారు కద సార్‌’’అని చేతిలో ఉన్న ఫైల్‌ని మేనేజర్‌ గారి ముందు పెట్టాడు ముకుందం దగ్గుతూ. మేనేజర్‌ ముకుందంకేసి చిరాకుగా చూసి ఫైలుని చేతుల్లోకి తీసుకున్నాడు.‘‘వెరీగుడ్‌...నెల రోజులుగా ఈ ఫైల్‌ని రేక్‌లో భద్రంగా ఉంచారన్నమాట’’ వ్యంగ్యంగా అన్నాడు మేనేజర్‌.‘‘ఫోన్‌లో అడిగాను సార్‌. డి.డి. పంపించేస్తాం అన్నారు’’ వినయంగా అన్నాడు ముకుందం.‘‘వాళ్ళు చెప్పారు..మీరు నమ్మేసారు. ఇంతకాల మైనా డి.డి. రాకపోతే లెటర్‌ రాయక్కరలేదా? ఎందుకండీ మీ సీనియార్టీ’’‘‘వాళ్ళు పేమెంట్స్‌లో చాలా ప్రాంప్ట్‌గా ఉంటారు సార్‌. ఈసారెందుకనో లేటైంది’’ నసిగాడు ముకుందం.‘‘నాకు కావలిసింది పని. మీ అభిప్రాయం కాదు. ఎమ్‌.డి.గారు అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్పమంటారు?’’ కోపంగా అన్నాడు మేనేజర్‌.‘‘సారీ సార్‌..ఇప్పుడే లెటర్‌ పంపిస్తాను’’‘‘ఆ... చైతన్య వాళ్ళకి పంపిన స్టాక్‌లో ఏదో తేడావచ్చిందన్నారని చెప్పాను కదా... చూశారా?’’‘‘ఈరోజు చూస్తాన్సార్‌’’‘‘ఏం చూస్తారో ఏమో. ప్రతిపనికి పిలిచి గుర్తుచేస్తేనే కానీ మీ సీట్లో ఫైల్స్‌ కదలవు.

 మీ పనులు గుర్తు చేయడానికా నేనున్నది?’’‘‘సారీ సార్‌...రెండు రోజులు లీవ్‌లో ఉండటం వలన కొద్దిగా వర్క్‌ పెండింగ్‌లో పడింది’’‘‘ఈ మధ్యనే ఒంట్లో బాగాలేదని నాలుగురోజులు లీవ్‌ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు రెండురోజులు. ఇంక పనేం అవుతుంది?’’‘‘పెద్ద వయసు కద సార్‌.. ఏదో అనారోగ్యం’’‘‘అయితే మీలాంటివాళ్ళు నలుగురు ఆఫీసులో ఉంటే ఇంక అన్ని పనులు మేమే చేసుకోవాలన్న మాట. ఏజ్‌తో పాటు శాలరీ కూడా పెరుగుతోంది కదా... మరి పనెందుకు తగ్గాలి. ఇంకెప్పుడూ ఇలాంటి కారణాలు చెప్పకండి. వర్క్‌ పెండింగ్‌ పెడితే నేను టోలరేట్‌ చెయ్యను. పెద్దవాళ్ళు... మాటిమాటికి నా చేత చెప్పించుకోకండి.. వెళ్ళండి’’ చిరాకుగా అన్నాడు మేనేజర్‌.-----------------‘‘ఏమంటున్నాడు?’’ లంచవర్లో అడిగాడు విశ్వనాథం‘‘ఆయనకి నా పొడ అస్సలు గిట్టడం లేదు. నన్ను చూడగానే మొహం చిట్లించేస్తున్నాడు’’మీరు శలవలు ఎక్కువగా పెడుతున్నారని, వర్క్‌ స్లోగా చేస్తారని, మీ సీట్లో ఫైళ్ళు ఒక పట్టాన కదలవని అందరి దగ్గరా అంటున్నాడు’’‘‘ఊరికినే ఎందుకు పెడతాను శలవలు. ఒకపడు నేను కూడా రెగ్యులర్‌గానే ఉండేవాడిని, స్పీడ్‌గా వర్క్‌ చేసేవాడిని. ఎపడూ ఒకేలా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు.’’‘‘గతంలో మీరు పడ్డ కష్టం గురించి ఈయనకి తెలుసా ఏమన్నానా? ఒకవేళ తెలిసినా బాస్‌లకి వర్తమానమే ముఖ్యం’’.‘‘ఈయన వ్యవహారం చూస్తుంటే పొమ్మన లేక పొగబెట్టినట్లుంది’’అసలా అవకాశం ఆయనకెందుకివ్వాలి? అమ్మాయి పెళ్ళి చేసేసారు. అబ్బాయి చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. స్వంత ఇల్లుంది. పెన్షన్‌ కూడా బాగానే వస్తూంది. హాయిగా రిజైన్‌ చేసి రెస్ట్‌ తీసుకోవచ్చుగా. మీ ఆరోగ్యం కూడా అంతగా బాగుండటం లేదు.’’