ఉన్నది ఉన్నట్లు చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను.నాపేరు ధరణి. నిశ్చల అని ఇంకో పేరూ వుంది. ధరా, ధరిత్రి...వగైరా ఇంకా ఇతర పేర్లు చెప్తారు. అమరకోశంలో అయినా నా కిష్టమైన పేరు మాత్రం నేల!్‌్‌్‌ఈ ఇల్లు చూడండి. నిండా మూడు వందల గజాలు లేదు. పాత మిద్దె. విశ్వనాథం అని ఓ పంతులుది. ఎలిమెంటరీ స్కూల్లో-పాతకాలంలో-టీచరు. ఊరు పల్లెగా వున్నప్పటి మాట. ఆయన చెమటోడ్చి కట్టుకున్నాడు ఈ ఇంటినీ, ఇంటి చుట్టు అనుబంధాన్నీ. అవును- ఆయన గుండె ఈ ఇంటితో పెనవేసుకుపోయిన మమత్వం. ఈ ఇంటి పేరు అపడూ ఇపడూ కూడా టీచరిల్లే!ఇపడు విశ్వనాథం లేడు.

పోయి చాలా ఏళ్లయింది. ఆయన భార్య సరోజినీ, కూతురు పంకజం, పెద్ద కొడుకు రంగనాథం, కోడలు స్వరాజ్యం ఇద్దరు పిల్లలు, రెండో కొడుకు రవీంద్ర, కోడలు రాణి, ఒక పిల్ల చరాస్థిగా మిగిలారు. ఇంకో ప్రాణి చిట్టితల్లి- ఆమెని స్థిరాస్థి అనలేము. చరాస్థీ అనలేము!ఇంట్లో ఎపడూ షష్టాష్టకమే. వీళ్ల గోల వింటుంటే గుండెలో కెలికినట్లుంటుంది. ఆ కాలంలో గుమ్మటంలా ఎదిగిన నందివర్థనంలా కనువిందు చేసిన ఇల్లు, ఇపడీ మనుషుల రాద్ధాంతాలతో పడిలేచిన పిచ్చిమొక్కలా తయారయింది. కళా కాంతీ లేవు. దేవుడు లేని ఆలయంలా వెలితి వెలితిగా మిగిలింది.రంగనాథం లాయరీ చేసి ఏదో కంపెనీలో ఉద్యోగంలో కుదురుకున్నాడు. ఆయన భార్య స్వరాజ్యం కూడా కాలేజీలో క్లర్క్‌. వాళ్ల కూతురు చంద్రిక తొమ్మిది, కొడుకు రాజు నాలుగు చదువుతున్నారు. 

రవీంద్ర మునిసిపాలిటీలో ఇంజనీరింగ్‌ సూపర్‌వైజర్‌. రాణి గృహిణి. వాళ్ల కూతురు రజని ఎనిమిదో తరగతి. పంకజంకి ఆరేళ్ల క్రితం పెళ్లి చేస్తే ఆర్నెల్లల్లో పుట్టింటికి తిరిగొచ్చేసింది. నా మొగుడు శాడిస్ట్‌ అని ఈమె, నా పెళ్లాం కరోడా, గయ్యాళి అని ఆ మొగుడూ వాదప్రతివాదనల్ని తెగలాక్కుని తెంపుక్కూర్చున్నారు. దీనికి రంగనాథం లాయరీ బుర్ర కూడా కారణమేనని అపడపడు అతని పరోక్షంగా కళ్లొత్తుకుంటూ వుంటుంది వాళ్లమ్మ సరోజిని. పంకజం బియ్యే అయిందనిపించింది. కానీ, తన అర్హతకి తగిన ఉద్యోగం రాలేదని ఖాళీగా కూచుంది. బుద్ధిపుట్టినపడు క్లాసిఫైడ్స్‌ చూసి వో అప్లికేషన్‌ రాయి వేస్తూ వుంటుంది ఆ కంపెనీకి, ఈ కంపెనీకీ! అదింకా ఏ పండుకీ తగల్లేదు!