‘‘సరిగ్గా రెండు గంటలకి బయలుదేరితే చీకటి పడేలోగా కీకారణ్యం దాటి మారేడుమిల్లి పొలిమేరల్లోకి వచ్చెయ్యవచ్చు’’ అని ఉదయం నుంచీ తొందరపెడుతూనే ఉన్నాను.కాలం ప్రవహిస్తూనే ఉంటుంది. మనం అప్రమత్తంగా ఉండకపోతే మాయచేసి పరిగెడుతూనే ఉంటుంది.చూస్తుండగానే నాలుగయి పోయింది. సాయంత్రం నాలుగయినా గ్రీష్మకాలపు ఎండ రెండు చెంపలూ వాయిస్తూనే ఉంది. ఉరుకులూ, పరుగులూగా లగేజీ డిక్కీలో పడేసి కారెక్కాం. నేనూ, శ్రీనివాసూ కాకుండా మా పెద్ద తమ్ముడు రామచంద్రమునూ. అందరం వాడిని చంద్రం అంటాం.దార్లో చల్లటి మంచినీళ్ల సీసాలు కొనుక్కుని డ్రైవర్‌కి ‘టీ’ పట్టించాడు చంద్రం. ఆ తర్వాత కారెక్కి అతని పక్కన కూచుని నెమ్మదిగా కబుర్లు చెప్తూ అతన్ని మూడ్‌లోకి తెస్తున్నాడు.రాత్రి డ్రైవర్‌ చాలా చిరాకయిన విషయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అతని మూడ్‌ అంతటినీ చిందరవందర చేసేలాంటి విషయం అది.దగ్గర బంధువు ఒకాయిన పోతే నిన్న ఉదయమే వెంటనే బయల్దేరవలసి వచ్చింది. ఎకాయెకీ టాక్సీలో బయల్దేరాం. యానాం నుంచి భద్రాచలం మీదుగా కొత్తగూడెం. నిన్న రాత్రికి వచ్చిన పని పూర్తి అయింది. డ్రైవర్‌కి కొంచెం సెంటిమెంటు. మృత్యువాత పడిన ఇంటికి కాస్త దూరంగా ఉండాలని కొంచెం దూరంలో మెయిన్‌ రోడ్‌ పక్కగా చెట్టుకింద కారు పెట్టుకుని పడుకుంటానన్నాడు.ఎవరి సెంటిమెంట్లు వాళ్లవి. గౌరవించడం చాతకాకపోతే మాట్లాడకుండా ఊరుకున్నా చాలు. అదీ ఒక రకమైన సంస్కారమే. ఆ పని చేసాం.

సరిగ్గా అర్థరాత్రి నా ఫోన్‌ మోగింది. నిద్దట్లోంచి ఉలిక్కిపడి లేచి ఆన్‌ చేస్తే అవతలి నుంచి గద్దింపు స్వరం మీ ఇల్లెక్కడ? ఇంటి అడ్రస్‌ చెప్పండి. ఏ ఊరి నుంచి వచ్చారూ... అంటూ ‘‘మీరెవరూ’’ అంటే ‘‘మేం పోలీసులం’’ అని జవాబు. ఈ లోగా మీ మగవాళ్లకి ఇవ్వండి ఫోన్‌ అని ఆదేశం.ఆ రాత్రి పోలీసు వారు అతన్ని నిద్రలేపి గొడవ చేసారు. ఎక్కడ నుంచి వచ్చావు? అని ఊరి పేరు చెప్పగానే ఆంధ్రా నుంచా! అని అడిగి ఇక్కడ నీకేం పని? అంటూ నానా యాగీ చేసారు. మా నెంబరు ఇస్తే మాకు ఫోన్‌చేసి మళ్లీ అదే గొడవ. మీకిక్కడ ఏం పని? మా రాష్ట్రంలోకి ఎందుకొచ్చారు అంటూ శ్రీనివాస్‌ ఫోన్‌ తీసుకుని మా బంధువుల ఇంటి అడ్రస్‌ చెప్పి వివరం అంతా చెప్పాక ఫోన్‌ పెట్టేసారు. అయినా డ్రైవర్‌ని మళ్లీ తిట్టి కేసు రాస్తామని బెదిరించి అతని దగ్గర్నించి ఎంతో కొంత డబ్బు లాక్కుని వదిలేసి వెళ్లారు. ఇతను ఇంకా ఆ షాక్‌లో ఉన్నాడు.