తళతళ మెరుస్తున్న తన స్కూటర్ని తనివి తీరా మరొక్కసారి చూసుకుని జేబురుమాలు తీసి సున్నితంగా వ్యూ మిర్రర్‌ తుడిచి, స్టాండు తీసి స్టార్ట్‌ చేసి రెండుసార్లు హారన్‌ మోగించాడు మోహన్‌. ఆ రోజు ఫిబ్రవరి 24వ తేదీ. మోహన్‌ కొత్త స్కూటర్‌ మీద మొదటిసారి బయలుదేర బోతున్నాడు.తార ఇంట్లోంచి కాలు బయటికి పెట్టబోయి, చటుక్కున ఆగిపోయింది. ఒక్కసారి భూమి కంపించినట్టు, నేల చీలుకుపోతున్నట్టుగా, ఇంటి కప్పు పెళ్ళలు పెళ్ళలుగా కూలి మీదపడుతున్నట్టుగా - ఆమె బాధతో మెలికలు తిరిగింది. కళ్లు గిర్రుమని తిరిగాయి. కాళ్ళు, దడదడలాడిపోయాయి. పొద్దుట నుంచీ సన్నగా బాధిస్తున్న పొత్తి కడుపులో నొప్పి, ఒక్కసారి వికృతరూపం దాల్చి, కొండ చిలువ కదిలినట్టయి, కడుపు చీల్చుకుని ఏదో ఏలియన్‌ బయటకొస్తున్నట్లనిపించింది. బాధతో వొళ్ళంతా చెమట ముద్దవడమే కాకుండా వెచ్చగా బట్టలన్నీ భళ్ళున తడిసిపోయాయి.‘‘అమ్మా..’’ అంటూ పెద్ద కేక పెట్టి అక్కడే కూలబడబోయి తలుపు సాయంతో నిలదొక్కుకుంది. వెనుకనుండి తలుపేసుకోవడానికి వచ్చిన అత్తగారు చటుక్కున పట్టుకుని ‘‘ఏమమ్మాయ్‌! ఏమైందీ’ అంది కంగారుగా - అంతలో ఆమె పరిస్థితి గ్రహించి ‘అదేమిటంటూ’ గుట్టుగా పొదివి పట్టుకుని లోపలికి నడిపించుకెళ్ళింది.

ఈ హడావిడి చూసి మోహన్‌ స్కూటర్‌ స్టాండ్‌ వేసి లోపలికొచ్చాడు.తార హాస్పటల్‌ బెడ్‌ మీద నీరసంగా పడుకుని ఆలోచిస్తోంది. ఆమెకి బ్లీడింగ్‌ అవుతున్నా బాధ తగ్గింది. గర్భం పోయినట్టేనని లేడీ డాక్టర్‌ ధ్రువపరిచింది. ఆ విధంగా డాక్టర్‌ సర్టిఫికెట్‌ తీసుకుని, దీనికి సెలవు కాగితం జత చేసి పంపింది ఆఫీసుకి. అబార్షన్‌కి ఇచ్చే ఆరు వారాల స్పెషల్‌ లీవుకోసం వివరించి భారతి ఎప్పుడొచ్చి ఆఫీసు విశేషాలు చెప్తుందా అని చూపులు గుమ్మానికి తగిలించి పడుకుంది.రకరకాల ఆలోచనలు మనసులో సాగుతున్నాయి. జీతం డ్రా చేశారా?తను భారతికి పే ఆథరైజేషన్‌ ఇచ్చింది కనుక ఆమె తప్పకుండా ఆ డబ్బు ఇవ్వడానికి వస్తుంది.తార నీరసంగా కళ్ళు మూసుకుంది. కళ్ళ ముందు ఏవేవో రూపాలు, చెవుల్లో ఏవేవో సంభాషణలు, ఆఫీసులో కూర్మారావు, రామనాథం, రంగారావు, ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడే టొంపుమాటలు - వాళ్ళు విసిరే కామెంట్లు గుర్తుకొచ్చి బాధగా నవ్వుకుంది.