‘‘మామిడికాయలో... మామిడి కొమ్మలో... అమ్మా... వేప పువ్వమ్మా... ఓ సార్‌!... ఓ అమ్మా...’’ మామిడి కొమ్మలు కాయలు వేపపువ్వు తీసుకోండమ్మా’’ వీధిలో ఉగాది సందర్భంగా అరుస్తూ బండి మీద బస్తాలతో అమ్ముతున్నాడు వ్యాపారి.‘‘ఇదేంటి నాన్నా? మన వీధిలో ఉగాదికి కావల్సిన మామిడి కాయలు, ఆకులు, వేప పువ్వు అమ్ము తున్నాడు. అసలు ఇది మన వీధేనా?’’ ఆశ్చర్యంగా అడిగింది. వారం రోజుల క్రితమే స్టేట్స్‌ నుండి వచ్చిన శ్రావణి. పేపరు చదువుతున్న రంగనాయకులు గారు చిన్నగా నవ్వేసి, పేపరు చూట్టంలో నిమగ్న మైపోయారు.‘‘ఇదిగో శ్రావణీ ఆ మామిడి కాయల వాణ్ణి కాస్తా పిలు’’ వంట గదిలో పనిచేస్తున్న సావి త్రమ్మ కేకేసింది.‘‘ఉగాది పచ్చడి.... మేడమ్‌... రడీ మేడ్‌ ఉగాది పచ్చడి... కేజీ హండ్రడ్‌ రూపీస్‌ మాత్రమే. రెడీమేడ్‌ ప్యాకెట్స్‌ ప్లీజ్‌ కమ్‌’’ స్కూటీపై చిన్న పైజు బ్యాగుతో తిరుగుతున్నాడు మరో వ్యాపారి.శ్రావణి షాక్‌ నుండి తేరుకోకముందే మరో షాకు ఇచ్చాడు ఆ సేల్స్‌బాయ్‌.

‘‘అమ్మా ఇందాకవాడు రామెటీ రియల్స్‌ అమ్ముతుంటే వీడు రెడీమేడ్‌ పచ్చడే అమ్ముతున్నాడు. ఇదేమైనా ఆవ కాయ పచ్చడా ఇలా అమ్మటానికి’’ మరింత ఆశ్చర్యంతో అడిగింది ఆమె.శ్రావణి భారతదేశం విడిచి రెండు దశా బ్దాలు గడిచిపోయాయి. తను చిన్నప్పుడు ఇదే వీధిలో అందరింట్లో మామిడి చెట్లు, ఇంటి ముందు వేప చెట్లు ఉండేవి. ఏ పండగైనా మామిడాకులు తీసి తోరణాలు కట్టేసే వారు శ్రావణి ఆమె తమ్ముడు మురళి. వాడైతే వేపపూలు తేరా అంటే కొమ్మలే నరుక్కొచ్చేవాడు. వీధిలో అందరికి పంచిపెట్టే వాడు. మామిడి పిందెలుగా ఉన్నప్పుడే తుంచి ఉప్పుకారం అద్ది మరీ తినేసేవాడు. ‘‘ఓరేయ్‌ వెధవా ఉగాదిరోజున పచ్చడి చేసి తినాలి, ఇలా తినకూడదు’’ అంటూ మందలించేది తల్లి. ఇప్పుడు ఎటుచూసినా భవన సముదాయాలే! పెంకుటిల్లు గాని, డాబా ఇల్లుగాని కనిపించటం లేదు. వీధులన్నీ పూర్తిగా మారిపోయాయి. పెరడు నిండా చెట్లతో ఉండవలసిన ఇళ్ళు కనీసం కరివేపాకు మొక్కలకి కూడా నోచుకోలేదు.