అది అంత హంగామా చెయ్యదగిన సంఘటనేమీ కాదు. ఊళ్ళోని ఆవారా కుర్రాళ్ళు స్కూలునుంచి వస్తున్న ఇద్దరు అమ్మాయిల్ని రోజూ వెంటపడి ఏడిపించేవాళ్లు. ఆ ఆడపిల్లలకి మగదిక్కు లేకపోవటం ఒక సమస్య. తండ్రి ఉద్యోగం ఇచ్చారు. ఇంట్లో ఉండేది తల్లీ, ఇద్దరు కూతుళ్ళూ. ఆ ఇద్దరమ్మాయిలూ, మాట్లాడకుండా తలవంచుకుని, ఆ కుర్రాళ్ళు పెట్టే బాధని సహిస్తూ ఇంటికి చేరేవాళ్లు.ఒకసారి స్కూలు ప్రిన్సిపల్‌కి రిపోర్టు చేశారు. ఆ ప్రిన్సిపల్‌ ఈ విషయం పోలీసులకి చెప్పి, కంప్లెయింట్‌ నమోదు చేయించింది. కానీ ఆ పోలీసులు వచ్చి ఈ పిల్లల్ని అడిగిన ప్రశ్నలు విన్నాక, ఇక మళ్ళీ పోలీసులకి చెప్పటానికి వాళ్ళకి ధైర్యం సరిపోలేదు. ఈ విషయం తెలిశాక ఆ కుర్రవాళ్ళు చేసే అల్లరి బాగా మితిమీరిపోయింది. ఆ పిల్లలు పక్కనించి వేగంగా బైక్‌ నడపటం, చున్నీలు లాగటం లాంటివి మొదలు పెట్టారు.ఇక జరిగిన సంఘటన కొద్దాం. ఈ ఆడపిల్లల్ని అల్లరి పెట్టింది ఎవరో ఒక కుర్రాడు కాదు, వాళ్ళు గుంపుగా వచ్చి వీళ్ళ వెంట పడేవాళ్లు. కానీ వాళ్ళల్లో హత్య గావింపబడ్డ కుర్రాడు కొంచెం హద్దు మీరి ప్రవర్తించాడు. ఒక ఆదివారం పొద్దున్నే వాడు ఆ పిల్లల ఇంటి ముందునించి బైక్‌మీద పోతూ, పెద్దపిల్ల ఇంటిముందున్న దండెంమీద బట్టలు ఆరవెయ్యటం చూశాడు. ఇంక వాడు ఏమీ ఆలోచించకుండా బైక్‌ ఆపి, ఆ పిల్లవేపు పరిగెత్తాడు. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపల వాడు ఆ పిల్లని వాటేసుకుని అందినచోటల్లా ముద్దులు పెట్టేసుకున్నాడు. ఆ తరవాత బైకెక్కి పారిపోయాడు.

 ఆ పిల్ల ఏడుస్తూ ఇంట్లోకెళ్ళి తల్లికి జరిగినదంతా చెప్పింది. ఆమె కూడా ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నట్టుంది. అల్లరిచేసే కుర్రాళ్ళలో సగం మంది ముస్లిములూ, మిగతా సగం హిందువులు, అందు వల్ల ఆమె వాళ్ళని ఏవిధంగానూ ఎదుర్కోలేకపోయింది. కానీ ఈ రోజు ఈ సాహసం చేసినవాడు ముస్లిమ్‌, ఆ పిల్ల హిందువు. వాళ్ళు ఉంటున్న ఊరి చరిత్ర చూస్తే, ఈ సంఘటన మందుగుండు ఉన్న కొట్లో చిన్న అగరువత్తి వెలిగించినట్టు, విపరీతమైన పరిణామాలని సృష్టించగలదు!ఆ పిల్ల తల్లి వీధిలోకొచ్చి గుండెలు బాదుకుంటూ శోకాలు పెట్టసాగింది. చూస్తూండగానే జనం పోగయారు. వాళ్ళకి ఆమె అందించిన సమాచారంలో పనిలేని కుర్రాడెవరోవచ్చి నా కూతుర్ని అల్లరిపెట్టి వెళ్ళాడన్న నిజం లేదు. ఒక ముస్లిమ్‌ కుర్రవాడు హిందువులుండే పేటలోకి వచ్చి హిందువుల అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించి పారిపోయాడని ఆమె వాళ్లకి చెప్పింది. చేసిన పనికన్నా, వాడు ముస్లిమ్‌ అనే విషయాన్ని నొక్కి చెప్పకపోతే వాళ్ళు ఏమీ చెయరని ఆమెకి తెలుసు.