నేను మా ఊరిడ్సి నలపైఏండ్లు అయ్యింది. కొల్వు మీద ఊర్లపొంటి దిర్గెబట్టె. నడ్మలమా ఊరికి బోలేదు. ఊరికి బోకున్నా మా ఊరు కండ్లల్ల మెస్లేది. మా దోస్తుగాల్లతోని బెట్టిన ముచ్చట్లు, ఆడిన ఆటలు యాదికొచ్చి బేచైన్‌ అయ్యేది.ఒకపారి మా ఊరికి బోయెస్తె బాగుంటుందనిపిచ్చింది. పట్నంల మాతోని గల్సిపనిచేస్తున్న మణిభూషణ్‌జెయ్యబట్కె బోన్గిరి బోయేమోక దొర్కింది.‘‘మీ బోన్గిరి ఖిల్లా ఎక్కుదామని ఎప్పటిసందో అనకుంటున్న’’ అని హోటల్ల చాయ్‌ దాగుతున్నపడు గాయిన నాతోని అన్నడు.‘‘నేను గూడ మా ఊరికి బోక శానొద్దులైంది. అయితారం బోదాం. గాదినం తెలంగాన జాత్ర గూడ వున్నది’’ అని అంటె-‘‘పొద్దుగాల్ల పది పదిన్నరకు తార్నాలక చౌరస్తల నిలబడుండ్రి. నేను ఆడ్కి ఒస్త. మీరు వొచ్చె ముంగట ఒకపారి నాకు పోన్‌గొట్టుండ్రి’’ అని మణిభూషణ్‌ అన్నడు.గా రాత్రి ఎంతకు నాకు నిద్రబట్టలేదు. నేను సదువుకున్న దినాలు యాదికొచ్చినయి.

గిపడు సుగుణ యాడున్నదో? వకీల్‌ సత్యనారాయనోల్ల గీత ఏం జేస్తున్నదో? సాతనోల్ల వసంతకు పిల్లలు ఎంతమందో? శంకరయ్య హోటల్‌ ఉన్నదో లేదో? గుండుగాడు ఏం జేస్తున్నడో? గున్నాలోడు యాడున్నడో? మాకు పాటాలు జెప్పిన పంతుల్లు ఉన్నరో లేదో? భారత్‌ టాకీస్‌ ముంగట నాగమల్లె చెట్టు ఉన్నదో లేదో? ఉడ్త చెంద్రమ్మ తిట్లకు మా వాడకట్టు ఒన్కుతున్నదో లేదో? అన్కుంట ఆలోచనల్ల నిండి మున్గి నాలుగ్గొట్టంగ బండుకున్న.‘‘ ఊరికి బోయేదున్నదని జెప్పి మంచిగ బన్నవేంది?’’ అన్కుంట నా పెండ్లాం లెవ్వగొట్టింది.లేసి జల్ది జల్ది తయ్యారై మణిభూషణ్‌కు పోన్‌ గొట్టిన.‘‘నేను గూడ రడీ అయితున్న’’ అని గాయిన జెప్పిండు.చెప్పిన తీర్గ పదిగొట్టంగ తార్నాక చౌరస్తకాడి నిలబడి మాదోస్తు కోసం ఎదురుసూడబట్టిన. బోన్గిరి దిక్కు బోయే బస్సులు బోతున్నయి. గని మణిభూషణ్‌ రాలేదు. పదకొండుం బావుకు స్కూటర్‌ మీద వొచ్చి-‘‘స్కూటర్‌ మీదే మీ ఊరికి బోదాం’’ అని అన్నడు.స్కూటర్‌ ఎక్కి గూసున్న. ఉప్పల్‌ల ఆగినం. మణిభూషణ్‌ హోటల్ల నాస్తజేసిండు. ఇంటి కాడ నాస్తజెయ్యబట్కె చాయ్‌ దాగి ఊకున్న చాయ్‌దాగినంక గాయిన సిగరెట్‌ ముట్టిస్తె నేను జర్దపాన్‌ ఏస్కున్న. గా ముచ్చట గీ ముచ్చట జెపకుంట మేము బోన్గిరి బోయెతల్కె పన్నెండున్నర గొట్టింది. పగిడిపల్లి కాడి నుంచే మా బోన్గిరి ఖిల్ల గండ్ల బడ్డది. చెరువు కట్టకాడి రేణుక ఎల్లమ్మ గుడికాడ తెగిన యాటలు గండ్లబడ్డయి. గవ్విట్ల కెల్లి నెత్తురు గారుతున్నది. రాకరాక ఊరికి వొస్తె నెత్తురు గండ్లబడ్డదేంది దేవుడా అని అనుకున్న. మా వాడకట్టు మీదికెల్లి బస్టాండు కాడ్కి బోయినం. మా ఊరు గుర్తుబట్టరాకుంట మారింది. శంకరయ్య హోటల్‌ లేదు. కిస్టయ్య మామ డబ్బ దుక్నం లేదు. భారత్‌ టాకీస్‌ ముంగట మడికట్టు మాయమై గవ్విటి జాగల ఇండ్లు బడ్డయి. బస్టాండల స్కూటర్‌ బెట్టి ఒక నీల్లసీస, గుల్కోజుపుడ గొన్నం. గుల్కోజును సీస నీలల్ల గల్పి ఖిల్ల దిక్కుబోయినం. ఖిల్ల మీదికి బోయెటోల్ల కోసం టికిట్టు బెట్టిండ్రు. టికిట్లు గొన్నంక ఖిల్ల ఎక్కబట్టినం. ఎండు సుర్రుమంటున్నది. జెర దూరం బోంగనే మాకు దమ్మొచ్చింది. జెరన్ని నీల్లు దాగినం. తంతెలు షువయ్యే ముంగట నన్ను నిలబెట్టి మణిభూషణ్‌ పొట్వ గుంజిండు. జెర సేపు గూసుందాం అన్కుంట నీడు గూసుండు. ఎదురుంగ మొండిగొడలల్ల ఒక పోరి ఒక పోరని ఒడిల పండుకోని వున్నది. మెట్లెక్కి జెర దూరం బోంగనే-