కాన్ఫరెన్స్‌ హాలు దాదాపుగా నిండి ఉంది. కొంతమంది అటు ఇటు తిరుగుతూ కూచున్న వాళ్లను పలకరిస్తున్నారు. నవ్వులతో, మాటలతో హాలంతా సందడిగా ఉంది. అందరూ శ్రద్ధగా రెడీ అయ్యి వచ్చినట్టు కనిపిస్తోంది. వాళ్ల డ్రస్సులలో హుందాతనం, ఆధునికత రెండూ సమపాళ్లలో తొంగిచూస్తున్నాయి. కంపెనీ చైర్మన్‌తో మీటింగ్‌ ఆ రోజు. వాళ్లల్లో ఇంత వరకు చైర్మన్‌ను నేరుగా చూడని వాళ్లు చాలామంది ఉన్నారు. టీవీలలో, ఫోటోలల్లో మాత్రమే చూసారు. ఒక వైపు ఉత్సాహం...ఇంకొక వైపు ఉత్కంఠ...సాధారణంగా పైస్థాయి ఉద్యోగులకు మాత్రమే చైర్మన్‌ను నేరుగా చూసే అవకాశం వుంటుంది. అది కూడా సంవత్సరానికి ఒకసారి ఒక అరగంట పాటు. అప్పుడు కూడా ఆయన చెప్పింది విని రావటమే తప్ప చర్చలు, సలహాలు సంప్రదింపులులాంటివి ఏవీ ఉండవు.ఆరింటికి అన్న మీటింగ్‌ ఆరున్నర అయినా మొదలు కాలేదు. పేస్ట్రీ, కర్రీపఫ్‌, జీడిపప్పు పకోడి పింగాణి ప్లేట్లలో పెట్టి అందరికీ ఇచ్చారు. తింటుండగానే బాదం మిల్కు షేక్‌ చల్లగా అందించారు. చల్లటి ఏ.సి.హాల్లో కడుపులు కూడా చల్లబడటంతో ప్రశాంతంగా చైర్మన్‌ కోసం ఎదురుచూస్తున్నారు.దీప్తి అయితే కుర్చీలో అసహనంగా కదులుతోంది. ఐదు నిమిషాలకొకసారి వాచ్‌ చూసుకుంటోంది. 

ఇంటికి వెళ్లే టైమ్‌లో ఇలా ఎదురుచూస్తూ కూచోవటం ఆమెకు చెప్పలేనంత విసుగ్గా ఉంది. సాకేత్‌ కోసం చూసింది. ప్యాంట్‌ జేబులో చేతులు పెట్టుకుని వాకిలి దగ్గర నవ్వుతూ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. దీప్తి అసహనాన్ని గమనించి ‘దిస్‌ ఈజ్‌ నాట్‌ ద టైమ్‌ ఫర్‌ అన్‌రెస్ట్‌. బి కూల్‌’ అని మెసేజ్‌ పెట్టాడు. ‘ఐ విల్‌ ట్రై’ లోలోపల వుడుక్కుంటూనే తిరిగి మెసేజ్‌ ఇచ్చింది. మెల్లిగా పక్కనున్న నందినితో మాటల్లో పడింది.‘‘బాగా లేట్‌ చేస్తున్నారు... త్వరగా మొదలు పెట్టొచ్చు కదా! మనల్ని ఇబ్బంది పెట్టాలని కాకపోతే ఆఫీస్‌ టైమింగ్స్‌ అయిపోయాక ఈ మీటింగ్‌ ఎందుకు పెట్టాలి? ఆఫీసు అవర్స్‌లోనే పెట్టింటే వీళ్లసొమ్ము ఏం పోతుందో? ఎప్పుడు అయిపోతుందో ఏమో? ఊరికే టైమ్‌ వేస్ట్‌...’’ నందినికి మాత్రమే వినిపించేటట్టు అంది.‘‘ష్‌... మెల్లిగా... కావాలని చేయటం లేదులే... బోర్డు మీటింగ్‌ తర్వాత ప్రెస్‌మీట్‌ అరేంజ్‌ చేసారంట, అందుకే లేట్‌ అయ్యుండొచ్చు...’’ఇంతలో కొంతమంది అట్టపెట్టెలను మోసుకుని వచ్చి కాన్ఫరెన్స్‌ హాల్లో పెడుతున్నారు. అందరి దృష్టి వాటిపై పడింది.‘‘మళ్లీ ఈ బాక్సెస్‌ ఏమిటో?’’‘‘చైర్మన్‌తో మీటింగ్‌ కదా బహుశ గిప్టు అయ్యుండొచ్చేమో’’‘‘ఓ... దీవాళికేమో...’’ కొంచెం ఉత్సాహంగా అనిపించింది దీప్తికి. అంతలోనే అనుమానం కూడా వచ్చింది. ‘‘ఎప్పుడూ లేనిది ఇప్పుడు కొత్తగా ఏంటీ’’.‘‘ఏమో మరి! అది నా గెస్‌ అంతే.... లెటజ్‌ సీ...! హే...! ఇట్‌ సీమ్స్‌ చైర్మన్‌ ఈజ్‌ కమింగ్‌...’’ అలర్ట్‌ అయ్యింది నందిని. చైర్మన్‌ ఇంకా లోపలికి అడుగు పెట్టకముందే అందరూ లేచి నిలబడ్డారు. లోపలికి వస్తూనే విష్‌ చేసి అందరినీ కూచోమన్నట్టుగా సైగ చేసాడు. ఏ.సి. చప్పుడు తప్ప కాన్ఫరెన్స్‌ హాలంతా నిశ్శబ్దంగా వుంది.