వాన నిలిచి కురస్తా వుండాది.యాపచెట్టు ముద్దగా తడిసిపొయింది. గడగడా వణకతా వుండాది. రాతి కూసాల సందుల్లో నుంచి వాననీళ్ళు కారతా వుండాయి.తడవకుండా మెట్లమింద కుర్చోని కాళ్ళని నీళ్ళల్లో పెట్టింది చిలకముక్కు దీపం. నీళ్ళు పరుగులు పెడతా కాళ్ళని గిలిగింతలు పెడతా వుండాయి.కాళ్ళని నీళ్ళల్లోనుంచి పైకి తీస్తుంది. మల్లా ముంచుతుంది. తపతపమనినీళ్ళని ఎగరకొడుతుంది. పసిపిలగాడి మాదిరి నీళ్ళతో ఆడుకుంటా వుండాది.‘‘ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందమంటే ఇదే!’’ అనింది చిలకముక్కు దాన్ని చూసి రాశింటిదీపం.‘‘నిజమే గదా! కొందరికి డబ్బు పిచ్చి. కొందరికి కీర్తి కిరీటాల పిచ్చి, కొందరికి మందు పిచ్చి, కొందరికి మదపిచ్చి. గోపినోళ్ళ ఇంట్లో గిలకోడని ఒక పిచ్చోడు వుండేవాడు. పిచ్చోడేగాని వాడు మహత్యాలు, మాయలు చేసేటోడు’’ అనింది గుడిసింటి దీపం.‘‘పిచ్చోడు గదా! పిచ్చిపనులు చేసినా మహత్యాలూ, మాయలూ చేసినట్టే వుంటుంది’’ అనింది మిద్దింటి దీపం.‘‘నేను చెప్పింది అపద్దంగాదు. పిచ్చోడి కత చెప్తేనేగాని నీకు అర్తం గాదు’’ అనింది గుడిసింటి దీపం.‘‘నువ్వు చెప్పేది పిచ్చికతై వుంటుంది’’ అని ఎగతాళి చేసింది మిద్దింటి దీపం.‘‘పిచ్చి కతో, మంచి కతో చెప్పితేగదా తెలిసేది. ఒసేయ్‌ గుడిసింటిదానా! ముందు నువ్వు కత చెప?’’ అనింది పెద్దింటి దీపం.ఆ మాటతో తలాడిస్తా గిలకోడి కత నెత్తుకునింది గుడిసింటి దీపం.

తిరపతి దగ్గరుండే ఆరేపల్లిరంగంపేటలో గోపిని కిష్ణయ్య పెదనాయన, ఆదెమ్మ పెదమ్మ వుండారు గదా! వాళ్ల పెద్దకొడుకే గిలకోడు. రెండోది అనసూయక్క, మూడు హరెన్న, కడగుట్టిది విజయ.గిలకోడి అసలు పేరు సుబ్రమన్నెం. గోపినోళ్ళ ఇంట్లో పుట్టిన తొలి మగబిడ్డకి సుబ్రమన్నెస్వామి పేరునే పెడతారు. పుట్టినప్పట్నుంచి అందరి బిడ్డల్లా కాకుండా మతాచారంగా పెరిగినాడు. ఏం చెప్పినా అర్తం చేసుకునేవాడు గాదు. మాటలు గూడా సరిగా తిరిగేవి గాదు.దానికితోడు వాయిరోగం (మూర్చ) వున్నింది. వాయివస్తే ఎక్కడంటే అక్కడ పడిపొయ్యి కాళ్ళూ చేతులూ కొట్టుకునేవాడు. మెళ్ళో వాయిరోగం వుందని చెప్పి పలకగూడా కట్టినారు.ఎపడు చూసినా గిలకమాదిరి ‘గీ’ పెట్టుకుంటా తిరగతా వుండేవాడు. నోటికి ఒగపక్క ఎపడుచూసినా జొల్లు కారతా వుండేది. ఏం పని చేసినా చొక్కాయి గుడ్డ మాత్తరం నోట్లో పెట్టుకుని నమలతా వుండేవాడు.