‘‘అంతకు తక్కువైతే కుదర్దు’’ తెగేసి చెప్పాడు కోటేశ్వరరావు.‘‘లక్షే?’’ చౌదరయ్య నోరెళ్ళబెట్టాడు.‘‘ఆఁ లచ్చే!’’ నొక్కి చెప్పాడు.‘‘మరీ కొండెక్కుతున్నావు!’’ చౌదరయ్య గొంతులో నిష్ఠూరం ధ్వనించింది.‘‘వస్తువు బట్టే ఇలువ గందా?’’‘‘ఇంతకుముందు ఎవరికీ అంత పెద్దమొత్తం ఇచ్చింది లేదు’’.‘‘ఎవరి సంగతో నాకెందుకు? నాకు గిట్టుబాటయ్యే ధర నేను సెప్పాను’’.‘‘బాగా ఆలోచించు... ఎనభై వేలిప్పిస్తాను. అప్పటికే పదివేలు ఎక్కువొచ్చినట్టు’’.‘‘పైసా తక్కువైనా మాట్టాడొద్దు’’ - జేబులో నుండి బీడితీసి అగ్గిపెట్టె కోసం వెదుక్కుంటూ చెప్పాడు.‘‘ఇంకోమాట లేదా?’’ బెదిరింపుగా అడిగాడు చౌదరయ్య.‘‘ఉండదు. ఇట్టమైతే రాండి! కట్టమైతేపొండి’’ - అగ్గిపెట్టె కోసం లేచాడు.ఆ ఇద్దరి మధ్య పంచలో జరుగుతున్న సంభాషణ బాణమ్మ చెవిన బడుతూనే వున్నది. మనస్సు పని మీద లగ్నం కావటం లేదు. భర్త పొలం బేరం పెట్టినట్లుగా అనిపించింది.రైతులు పండించిన పంటలమ్మి రోజులు గడుపుకోవాల్సింది పోయి పొలాలమ్మి బ్రతకాల్సిన గడ్డు రోజులు వచ్చినందుకు తనలో తాను కుమిలి పోసాగింది బాణమ్మ.ఒకేడు గాకుంటే ఒకేడన్నా పంటలు బాగుండవా, ఆదాయం రాదా, అప్పులు దీరవా, ఒడ్డున పడకపోతామా అన్న ఆశ పెట్టుబడి పెట్టిస్తుంది. ఏయేటికాయేడు ఇంకా ఇంకా ఊబిలోకి దిగబడడమే గాని ఒడ్డున పడ్డది లేదు.రైతులు గొర్రెదాటుగా ప్రత్తికి రేటొస్తుందని ప్రత్తేసి, కాదు మిరపకు ఇంకా రేటొస్తుందని మిరపేసి, కందులకు రేటుంటుందని కందేసి... అయిన కాడికి అప్పులు తెచ్చి, అదికాస్తా పురుగు మందులకు, ఎరువులకు బోస్తే ఏ మాత్రం ఫలసాయం చేతికొచ్చింది!దిగుబడున్న రోజు రేటు పలకదు. 

రేటున్న రోజు దిగుబడి అంతంత మాత్రం! రైతు ఆశపడటమే గాని రెండు రకాలుగా కలిసొచ్చి బాగుపడ్డది ఎప్పుడు? వ్యవసాయం కూలి పాటన్నా గిట్టక పోతుండె! రైతన్న వాడు రేయింబవళ్ళు పంటపొలాల్లో సాగుజేసి శోకాన్ని పండిస్తున్నట్టు అయిపోయింది. క్వింటాళ్ళు, క్వింటాళ్ళు దరిద్రాన్ని దిగుబడి చేసుకొంటున్నట్లు కనిపిస్తుంది.పుట్టినచోటల్లా అప్పులు తేనూ, పెట్టుబడి పెట్టనూ, ఆ వచ్చిందంతా తిరిగి వడ్డీలకు గట్టనూ! ఈ నాలుగేండ్లలో మూడెకరాలు ముదనష్టమై పోయింది. మిగిలింది రెండెకరాలు. అదీ అమ్ముకొని ఏమయిపోవాలి?బాణమ్మ కళ్ళు తడిమళ్ళు అయినాయి.‘‘ఏందయ్యా! పొలం బేరానికి పెట్టావా?’’ లోపలకు వచ్చిన భర్తను దీనంగా అడిగింది.కోటేశ్వరరావు బీడి ముట్టించుకుంటూ ఆమె ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేదు. రెండు దమ్ములు గట్టిగా పీల్చాడు. అగ్గిపెట్టె భార్య చేతికిస్తూ కళ్లల్లోకి చూశాడు. తడి కనిపించింది.‘‘అవసరానికి ఏదోటి... అప్పులోళ్లని ఎన్ని పంటలకని ఆపుతాం. మాట దక్కించుకోలేక పోతే మంచినీళ్ళు పుడతయ్యేంటే!’’ పంచలోకి నడిచాడు.‘నిజమే! అప్పులవాళ్ళు ఇంటిమీదకు ఎగబడి అల్లరిపెడ్తున్నారు. అంత కంటే అప్పుదీరే దారి ఏం వుంది గనక!’ కంటి తడి ధారలు కట్టి బుగ్గల మీదకు జారకుండా పమిట చెంగుతో కళ్ళు అద్దుకుంది బాణమ్మ.