హఠాత్తుగా ఎదురుపడ్డ ఆమెను చూసి ఉల్కిపడ్డాడు శశాంక్‌. బ్రేకును బలంగా నొక్కాడు. అడుగు దూరంలో కారు కీసుమని ఆగిపోయింది. ఆ శబ్దానికి అందరూ అటువైపు చూసారు.శశాంక్‌ మాత్రం ఆశ్చర్యంగా ఆమెనే చూస్తున్నాడు.‘వసంత టీచర్‌’ అతడి పెదాలు అస్పష్టంగా పలికాయి.ఆమె కారుకు అడుగు దూరంలోనే ఉంది. రోడ్డును క్రాస్‌ చేసి పక్క సందులోకి పోబోతుంది. ఒక్కక్షణం ఆలస్యం జరిగినా కారు ఆమెను డీ కొట్టేదే. ఆ కుదుపునకు వెనకసీట్లో కునికిపాట్లు పడుతున్న జయమ్మ తూలి పడబోయి నిలదొక్కుకుంది. ఏం జరిగిందని భయంగా ముందుకు చూసింది. చుట్టుపక్కల వాళ్లు ఆసక్తిగా చూసారు. వెళ్లిపోతున్న ఆమె వైపు అవునా కాదా అన్నట్టు చూసాడు శశాంక్‌.టక్కున కిందికి దిగాడు శశాంక్‌. పిలుద్దామనుకున్నాడు. కాళ్లకు చెప్పులు లేవు. మురికిగా బట్టలు. జడలు గట్టుకుపోయిన జుట్టు. తెలిసున్న మొహం కాబట్టి సరిపోయింది. లేకుంటే శశాంక్‌ కూడా పిచ్చిది అనుకునే రూపం. ఆ రూపమే శశాంక్‌ గొంతును నొక్కింది.సంది మలుపు తిరిగి మెయిన్‌రోడ్‌ ఎక్కిన వసంత జనంలో కలిసి పోయింది. ఆమె కనుమరుగయ్యేవరకు అతడి చూపు స్టీరింగ్‌ వైపు తిరగలేదు. 

కారు అద్దాలు దించి అటూ ఇటూ చూసిన జయమ్మ ‘శశీ.. ఏమయిందిరా...’ అని అడిగింది.గేరు మారుస్తున్న శశాంక్‌ క్షణం ఆగి తల్లివైపు చూసాడు. తల్లి అతడి మొహంలో అమితమైన ఉద్వేగాన్ని చూసింది. అదే ఉద్వేగంతో ‘అమ్మా... వసంత టీచర్‌ ఇలా అయిపోయిందేంటీ...’ అంటూ వివరాలు చెప్పాడు.‘వసంత’ అన్న పేరు మాత్రమే వినిపించింది తల్లికి. ‘వసంతా... ఎక్కడా...’ అంటూ బయటకు చూసింది. వసంత కనిపించలేదు.కారు ముందుకు పోతుంది. శశాంక్‌ కళ్లల్లో వసంత రూపమే కదులుతుంది. ఇరవై ఏళ్ల కింది మాట. అప్పుడు శశాంక్‌ పదవ తరగతి. సోషల్‌కు కొత్త టీచర్‌ వచ్చిందంటే ఆసక్తి. ఎలా ఆటపట్టించ వచ్చనే ఆలోచన. అప్పటికి శశాంక్‌ ఆకతాయి తనం మీద ప్రిన్సిపల్‌కు ఎన్నో ఫిర్యాదులు. తల్లిదండ్రులను పిలిపించాడు కూడా. శశాంక్‌కు చదువురాదని వారు ఎప్పుడో నిర్ధారించుకున్నారు. టెంత్‌ పూర్తయితే ఏ మెకానిక్‌ పనో నేర్పి ఓ షెడ్డును పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రిన్సిపల్‌కు ఏదో ఒకటి నచ్చ చెపుతున్నారు.సన్నజాజి పరిమళంలా వచ్చింది వసంత టీచర్‌. వయసు ఇరువైకి అటు ఇటూ ఉంటుంది. పిల్లల్లో కలిసిపోయింది. శశాంక్‌ మంత్ర ముగ్థుడై పోయాడు. ఆమెను మరి మరీ చూడాలనిపించేది. ఆమెతో మాట్లాడాలనిపించేది. ఆమె పొగిడితే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేది. తిడితే ఎక్కడలేని నీరసం వచ్చేది. చదువుకోడానికి ఇంటికి రమ్మనేది. ఆమె ఎదురు పడినప్పుడల్లా ఏదో తెలియని ఉద్వేగం. పాఠం చెబుతుంటే ఆమెను చూడాలనిపించేది. అందం. అందాన్ని మించిన ఆకర్షణ. ప్రిన్సిపల్‌ ఎప్పుడూ ఆమె వెంటే తిరిగే వాడు. అతడిని చూస్తే కోపంగా ఉండేది.