‘‘బూర్లె గంపలో పడ్డావ్‌!’’ అన్నాడు చందనమూర్తి.నేను అయోమయంగా చూస్తుంటే ‘‘అరె! నీకు కొండలక్ష్మీపురంలో పదో తరగతికి ఇన్విజిలేషన్‌ వేసారు’’ అన్నాడు.అందులో వింతేముందో అర్ధం కాలేదు. ప్రభుత్వ ఆదేశం ప్రకారం విధి నిర్వహణ తప్పదు. దాన్లో బూర్లెగంపలో పడేంత లాభం నాకేం కలుగుతుందో అర్ధం కాలేదు. ఈ మధ్యనే పాఠశాల సహాయకుడిగా పదోన్నతిపై వెళ్ళాను ఆ ప్రాంతానికి. నా స్వగ్రామానికి బహుదూరం. అయినా పదోన్నతి వదలుకోలేక విజయనగరంలో కాపురం పెట్టి నేనొక్కడినే ఉండి గడుపుకుంటున్నాను. పైగా ఇంతకాలం సెకండరీగ్రేడుగా అక్షరాలు దిద్దించిన నేను పదోతరగతి విద్యా ర్థులకు చెప్పడానికి సిలబస్‌ నాకు కొత్త. రెండు సెక్షన్లకి నేనే! సగానికిపైగా అక్షరాలు రాని బాపతులే! వాళ్ళని అమాంతం పై స్థాయికి తీసుకెళ్ళి చదు వులో అందెవేసిన చేతులుగా మార్చేయాలి. శతశాతం ఉత్తీర్ణత లక్ష్యం ప్రభుత్వానిది. పదో తరగతి గట్టెక్కినవాళ్ళంతా చదువులో సిద్ధహస్తులు. జ్ఞాన భాండాగారాలూను.ప్రభుత్వ లక్ష్యసాధనకు మేమంతా సమయపాలన పాటిస్తూ, ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, వాళ్ళకి రానందుకు మేం బాధ్యత వహిస్తూ, ఆకస్మికంగా వచ్చే అధికారులు తలవాచేలా చీవాట్లు పెడుతుంటే కాస్తూ, జవాబుదారీగా ఉంటున్నాం.కొందరు మాత్రం నన్ను ‘‘గురూగారూ! మీరేదో కిందమీదాపడి వీళ్ళను పండితులుగా చేయాలని చూడకండి. 

ప్యాసయితే చాలు. వీళ్ళకి చదు వొచ్చేసినట్లే! జ్ఞానవంతులైపోయినట్లే! కేవలం పాస్‌ మార్కులొచ్చేటట్లు చేయండి చాలు’’ అని సలహాలు పారేసారు.ఉన్నత పాఠశాలకు నేను కొత్త పూజారిని కాబట్టి పిల్లలతో ఢక్కా మొక్కీలు తింటున్నాను. సరిగ్గా అప్పుడే నాకు ఇన్విజిలేషన్‌ వేసినట్లుగా కబురు మోసుకొచ్చాడు చందనమూర్తి. నేనుండే ప్రాంతానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలక్ష్మీపురానికి వెళ్ళిరావడమంటే మాటలు కాదు. పక్కా మన్యప్రాంతం! ఆ చుట్టు పక్కల ఉండే గిరిజనుల కోసం స్థాపించబడిన ఏకైన ఉన్నత పాఠశాల అది. వాళ్ళందరికీ పదోతరగతి పరీక్షా కేంద్రంగా గత పదేళ్ళుగా కొనసాగుతోంది.నేను ప్రతిరోజూ తిరగలేనన్న సంగతి చెప్పి నా ఆర్డర్‌ రద్దు చేసుకోడానికి ప్రయత్నించిన నన్ను చూసి అంతా నవ్వారు. ‘‘నీకేమైనా పిచ్చా! అక్కడ డ్యూటీ వేయించుకోడానికి అంతా క్యూ కడతారు తెల్సా!’’ అన్నాడు సహోద్యోగి తులసీ రావు.