‘‘ముబారక్‌హో సలీంభాయ్‌’’ఆర్టీసీ బస్‌డిపోలో అడుగుపెట్టానో లేదో మిత్రుడు బ్రహ్మం ఎదురొచ్చి నన్ను సంబరంగా గుండెలకు హత్తుకున్నాడు.మిగతా సహోద్యోగులూ వచ్చి అభినందనలతో ముంచెత్తారు. వారి ప్రేమాభిమానాలలో తడిసి ముద్దవుతూ మిఠాయిలు పంచాను.‘‘తల్లీ బిడ్డా బావున్నారు కదా!’’ అడిగారొకరు.‘‘చక్కగా ఉన్నారు. కడప అమీన్‌పీర్‌ దర్గా దర్శించి వచ్చాం. మా ముంతాజ్‌ కడుపు పండింది. పండంటి మగ బిడ్డ పుట్టాడు’’ అక్షరాలా గాలిలో తేలిపోతూ వివరంగా చెప్పాను.నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను.నాకు పెళ్లై పదకొండేళ్ళయ్యింది. ఇక పిల్లలు పుట్టరనే అనుకున్నాం. ఇన్నేళ్ళూ దిగులు దిగ మింగుతూ వస్తున్నాం. మా ఊరెళ్ళినప్పుడల్లా ఇంకో నిఖా చేసుకోమని అమ్మీజాన్‌ గోల చేసేది. ‘‘ఈ జన్మకి ముంతాజ్‌ ఒక్కతే’’ అని తెగేసి చెప్పే వాణ్ణి.అసలు ముంతాజ్‌ని ముందుగా చూడ కుండానే కేవలం పేరు వినే షాదీకి ఒప్పుకున్నా. ‘‘సలీం ముంతాజ్‌ని గాక ఇంకెవర్ని పెళ్లి చేసు కుంటాడు’’ అని నవ్వారు కజిన్స్‌.ఆర్టీసీ డ్రైవర్ని అయినా నన్నో హీరోగా భావిస్తూ ఉంటుంది నా బేగమ్‌.

 నా మీద ఈగని కూడా వాలనివ్వదు. నాకు తలనొప్పి వస్తే నాకన్నా ముందుగా తనకి తెలిసిపోతుంది. జండూ బామ్‌తో ప్రత్యక్షమవుతుంది.ఏమైతేనేం మా తపన, తపస్సు ఇన్నేళ్ళకి ఫలిం చాయి. నిన్న ఆసుపత్రిలో బిడ్డనీ నన్నూ హత్తు కుని ముంతాజ్‌ ఎన్ని కడవల ఆనందబాష్పాలు రాల్చిందో చెప్పలేను!‘‘నీ కొడుకు గురించి ఊహలల్లుకుంటూ కూర్చుంటే కాదు, మాకు దావత్‌ ఇవ్వాల్సిందే’’ అన్నాడు బ్రహ్మం.‘‘మేమిద్దరం తరచూ 27వ నెంబరు రూట్‌కి డ్రైవరూ కండక్టర్లుగా వెళ్తుంటాం.‘‘ఏం కావాలో చెప్పు భాయ్‌, అరేంజ్‌ చేసేస్తా’’.‘‘రంజాన్‌ మాసంలో హలీం తినిపించు’’ అన్నాడు కళ్ళు చికిలించి నవ్వుతూ.

‘‘నువ్వు తినాలిగాని రోజూ తెచ్చిపెట్టనూ! ఈ మధ్య వెజిటేరియన్‌ హలీం తయారుచేస్తున్నారు. ఈసారి తినిపిస్తాలే’’నా మాటలకు ఖుష్‌ అయిపోయాడు. ‘‘ఆ మాట చాలు. తినేసినంత హ్యాపీగా ఉంది సలీం’’.‘‘డ్యూటీకి టైమవుతోంది పద..’’ఇద్దరం 27వ నెంబరు బస్సెక్కాం.బస్‌స్టేజిల దగ్గర యాంత్రికంగా బ్రేకు వేస్తు న్నాను. మళ్ళీ ముందుకు దూకిస్తున్నాను. నా మనసంతా ఆసుపత్రిలో ఉన్న ముంతాజ్‌ మీదా, జాండీస్‌ వచ్చిందని చెప్పి ప్రత్యేక కేర్‌లో ఉంచిన నా చిన్నారి బిడ్డ మీదా ఉంది.