లాస్ట్‌ బస్సు ఊళ్లోకి పొయ్యి మల్లా పీలేరుకి తిరుక్కోని పోతా వుండాది. బురదన గుట్ట ఎక్కతా వుంటే మోరుపు వినిపించింది.ఆకాశంలో చుక్కలు మిలమిలా మెరుస్తా వుండాయి.యాప చెట్టు కింద దీపాలూ మిలమిలా మెరస్తా వుండాయి.‘‘గోపినింటిదీపం వచ్చేసుంటే ఈపాటికి చుక్కలకొండ ఎక్కతా వున్నిందిము!’’ అనింది నగిరింటి దీపం.నగిరిలో ఈ దీపాన్ని సంపెంగి నూనెతో వెలిగిస్తారట! ఎపడూ సంపెంగి పువ్వు వాసనతో పలవరిస్తా వుంటింది. దొరలూ, దొరసానులూ దీపం కొండెక్కించి పడుకుంటారు గదా! పమిదలో వొత్తి పొగచూరి, రాత్తిరంతా వూదొత్తి మాదిరి పలవరిస్తానే వుంటింది.‘‘ఎవరైనా ఇంగొక కత చెప్పండి. ఇంకొంచెం పొద్దు గడుస్తుంది’’ అనింది రాశింటి దీపం.‘‘ఎవురో ఎందుకు? నువ్వే కవిగట్టి ఒగకత చెప’’ అనింది నగిరింటి దీపం.‘‘కవిగడితే యాడన్నా కతలొస్తాయా! తొలికి తీసుకోని బతుకుని తవ్వుకుంటా పోతే ముడికతలు బయటపడతాయి. వాటిని కవిగడితే మేలిమి బంగారం మాదిరి మెరుస్తాయి’’ అనింది రాశింటి దీపం.‘‘ఎంత చక్కటి మాట చెప్పినావే రాశింటిదానా! కతంటే మనంగాదు మన నీడ. వెలుగునిచ్చి మనము కొండెక్కుతామా! నిద్దరపొయ్యేటపడు మన నీడ లోకాన్ని తిరిగొస్తింది. చెందమామని తీసి చేతిలోపెట్టినట్టు, బతుకుని కవిగట్టి ఒక కత చెప’’ అని అడిగింది పెద్దింటి దీపం.

గొంతుని సరిచేసుకుని కతనెత్తుకునింది రాశింటి దీపం.ఉత్తీత తొలి గుడ్డుని పగలగొట్టి సంజీవిని పుల్లతో రైతుని పుట్టించింది.అపడు దేవలోకంలో దేవుడు బసవడ్ని పిలిచి, ‘‘ఒరే బసవా! భూలోకంలో రైతు పుట్టేసినాడు. నువ్వు పొయ్యి రైతుకి ఏం చెప్తావంటే, రోజుకి ఒగపూట భోజనం, వారానికి ఒగపూట స్నానం, రాత్తిరి పూట రెండు జాముల నిద్దర అని చెప్పేసి రాపో!’’ అన్నేడు దేవుడు.బసవడు కొమ్ములూపుకుంటా భూలోకంలో దిగి, నేరుగా రైతు దెగ్గిరికొచ్చి, ‘‘యోవ్‌ రైతా... నీకోమాట చెప్పమని దేవుడు నన్ను పంపించినాడు. నువ్వు రోజుకి మూడు పూటల భోజనం, ఒగపూట స్నానం, రాత్తిరిపూట నాలుగు జాముల నిద్దర పోవాలంట’’ అని తోక ఇసురుకుంటా, దేవుడు చెప్పింది మరిచిపొయ్యి తన నోటికొచ్చింది చెప్పేసినాడు.‘‘నీ వాక్కే దేవుని వాక్కుగా భావించి, దేవుడు చెప్పినట్టే నడుచుకుంటాను’’ అన్నేడు రైతు వినయంగా తలవంచి.