నేను రిటైరయ్యి రెండు సంవత్సరాలైంది. నా ముప్పయిమూడు సంవత్సరాల సర్వీసులో కల్యాణదుర్గంలో పనిచేసిన రోజులు నాకు అత్యంత ఇష్టమయినవి. ఇప్పటికీ అక్కడి స్నేహితులూ, పెద్దవారూ ఫోన్‌చేస్తూనే వుంటారు. అక్కడ పనిచేసిన నాలుగు సంవత్సరాలూ నాలుగు రోజుల్లా గడచిపోయాయి.సరిగ్గా ఈ రోజుతో నేను కల్యాణదుర్గం వదలి పదమూడు సంవత్సరాలయింది. ఈ మధ్యకాలంలో ఓ రెండు మూడు సార్లు కల్యాణదుర్గం వెళ్ళి వుంటాను. పనుల ఒత్తిడి కారణంగానూ, ఆఫీసు వ్యవహారాల మూలంగానూ కల్యాణదుర్గం, ఆ చుట్టుప్రక్కల పరిచయస్తుల్ని తర్వాత కలుసుకోలేక పోయాను.ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను. రెండు మూడు రోజులు కల్యాణదుర్గంలో వుండి, అందర్నీ పలకరించి రావాలనుకున్నాను. బ్యాగులో బట్టలు సర్దమని శ్రీమతికి చెప్పాను. రేపు ఉదయం ఆరుగంటలకు నా ప్రయాణం. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడు కిరణ్‌, కాలిఫోర్నియాలో వుంటున్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు. వాడు కాలిఫోర్నియాకు వెళ్ళి దాదాపు తొమ్మిది సంవత్సరాలైంది. ఈ తొమ్మిది సంవత్సరాల్లో చావులకు మాత్రమే వాడు ఇండియాకు వచ్చాడు. వాళ్ళ అమ్మ ఎప్పుడైనా వాడితో మాట్లాడాలనిపించి ఫోన్‌ చేస్తే ‘బిజీగా వున్నాను, తరువాత నేను చేస్తానులే’ అంటాడు. మళ్ళీ ఫోన్‌ చేసినా పలకడు.గూడు వదలి ఎగిరిపోయాడు. తిరిగి వాడు ఈ గూడు చేరుతాడనే ఆశలు లేవు.రెండోది పల్లవి. ఆమె హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ కొలీగ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 పెళ్ళయిన తరువాత తీరిగ్గా మాకు ఆ సంగతి చెప్పింది. ఈ కాలం పిల్లలు వాళ్ళు. వాళ్ళిష్ట ప్రకారం నడుస్తున్నారు. రోజులు అలా ఉన్నాయి. ఏం చేస్తాం? లండన్‌లో సెటిల్‌ అయిందామె. ఫోన్‌ పలకరింపే తప్ప, ఇంటికి వచ్చి రెండు రోజులు ఉండే అవకాశం లేదు.పాతరోజులు గుర్తుకొస్తే బాధగా ఉంటోంది. పిల్లల్ని కనుపాపల్లో పెట్టుకొని పెంచాం. వాళ్ళతోడిదే లోకం అనుకున్నాం. ఇప్పుడు ఆ లోకాలేవీ వాళ్ళకు అక్కర్లేదు. తల్లిదండ్రుల ఆప్యాయతానురాగాలు చాదస్తమేమో! చాదస్తమనే కొట్టిపారేస్తున్నారు పిల్లలు. బాధగా ఉంది. ఉదయం ఏడు గంటలకే కల్యాణదుర్గం చేరుకున్నాను. తెలిసిన ఒకరిద్దరు మిత్రులను పలకరించి, నేను ఉద్యోగం చేసిన రోజుల్లో నాటిన పచ్చని చెట్లను పరామర్శించేందుకు కంబదూరు రోడ్డుకు వచ్చాను. ఊరి బయటికి రాగానే చాలా సంతోషం కలిగింది. రోడ్డుకు ఇరువైపుల అప్పట్లో నాటిన మొక్కలు చెట్లయినాయి. రోడ్డుకు అటూ, ఇటూ చెట్లు శాఖోపశాఖలుగా పెరిగి ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. సూర్యకాంతి చెట్టుకొమ్మలను దాటి నేలపై పడడం లేదు. గొడుగుపట్టినట్టుగా ఉంది. రోడ్డంతా అలాగే వుంది.పదమూడు సంవత్సరాల క్రింద నాటిన మొక్కలు ఇంత ఏపుగా పెరుగుతాయని కలలో కూడా ఊహించలేదు. బాధలనూ, కష్టాలనూ మరపించే సువాసనలు ఈ చెట్లకు ఉన్నాయి. ప్రతిచెట్టుకీ చెంపలు ఆనించాను. ముద్దుపెట్టుకున్నాను. వెలుగు ఆకుల్లో వడపోతవుతోంది. నేల మీద పల్చగా పడుతోంది.