ఉన్నట్లుండి గలాంబులాం అని అరుపులినిపిత్తే ఏమైందబ్బా అని సేతిలో పనిడిసి ఈదిలోకి పరిగెత్తినాను.అప్పటికే ఎక్కణ్ణుంచో వచ్చి సిన్నప్పట్నించి మా యింట్లోనే పెరిగి పెద్దదైన సంపూర్ణకు ఇషయం తెలిసిందేమో, మాకు సెప్పాలనే ఆత్రంలో గసబోసుకుంటా పడతా లేస్తా పరిగెత్తుకుంటూ వస్తావుంది.ఆ బిడ్ని సూడంగానే అంతకంటే ఆత్రంగా ‘‘ఏంది సంపూర్ణా ఆడ ఏడుపులు తూడుపులు’’ అని ఆ బిడ్డ సెప్పేదాకా వుండబట్లేక అడిగినాను.‘‘గోపాలం గాని కూతురు బాయిలో పడిపోయిందంటకా’’ అనింది ఒగుర్సుకుంటానే.ఆ బిడ్డ నోట్లో మాట నోట్లో వుండంగానే ‘‘అయ్యో కొడకా! ఏమయిందంటా. తెల్లారి గూడా మన బాయిలో నీళ్లు సేందుకోని బొయ్యిందే’’ అన్న్యా.‘‘మద్దేనం కాడ సంగటిదిని వాళ్లవ్వ, నాయిన కట్టేగాలవ కాడ గుడ్లుతకతా వుంటే వాళ్లకు సంగటి కూడా దీస్కొని బోయిందంటా. ఆడికిపోయిన బిడ్డ ఆణ్ణే వుండకుండా పెడాత్తం గాకపోతే కన్నమోల బాయికాడికి ఎందుకు బోవాల, వాళ్ల సెట్లో పూలెందుగ్గోయాల..’’ సంపూర్ణ మాటల్లో ‘అయ్యో! అంటా వుందా, తిడ్తావుందా’ అర్తం గాలా.‘‘ఇంతకూ ఆ బిడ్డ కిపడెట్లా వుంది’’ అని అడిగినాను.‘‘అయ్యో రామ. ఇంగా యాడుంది. సచ్చిపోయి పీనిగిని కూడా ఇంటికేసకొస్తే’’ అని సంపూర్ణ అనంగానే గోపాలం గానింటికి పరుగుబెట్న్యాను.నే బోయ్యేటప్పటికీ ఆడంతా ఆలగోడు బాలగోడుగా వుంది. వాళ్లమ్మ, అవ్వ పీనిగి మిందబడి లబోదిబోమని కొట్టుకుంటా వుండారు. గోపాలంగాడైతే ఆడదానికంటే కనాకష్టంగా పీనిగి మింద బడి యాడత్తా వుండాడు.ఇంతట్లోకి పక్కూర్లోనే వుండే వాళ్లత్తొచ్చింది. 

ఆయమ్మ గోపాలంగాని కంటే ఐదారేండ్లు పెద్దది. ఆయమ్మ రావడం సూడంగానే ఆడున్నోళ్లంతా గొల్లుమన్న్యారు. ఆ ఏడుపులిని యాడుండే వాళ్లూ అప్పటికే సూసిపోయినోళ్లు కూడా మళ్లీ పరిగెత్తుకొచ్చినారు. ఆయమ్మ కంటికి కడివెడుగా యాడత్తానే ‘‘ఏమొచ్చిందిరా మీకు సేటుగాలం. బంగారట్లా బిడ్ని బాయిపాల్జేసినారు’’ అని తమ్మున్ని, వాడి పెండ్లాన్ని దబాదబా బాది కడుపు మింద, తలమింద మొత్తుకుంటా తసుక్కున తలబట్టుకోని యాడస్తా నేలమింద కూలబడిపోయింది.గోపాలంగాని పెండ్లామైతే దుక్కాణ్ణి తట్టుకోలేక యాడత్తా వాళ్లాడబిడ్డి కాళ్లమింద బడిపోయింది. ఆయమ్మ కూడా తమ్ముని పెండ్లాన్ని వాటేసుకొని గట్టిగా పాడిపాడి యాడ్వబట్టింది. ఉన్నట్లుండి ఆడ ఏడుపులు ఎక్కువై పోయినాయి.‘‘ఓయమ్మో - ఓర్నాయినో నా బిడ్ని పోగొట్టుకోని నేనెట్లా బతికేదిరా దేముడో’’ అంటా కన్న కూతుర్ని ముద్దు బెట్టుకోని ఎంటికలు పెరుక్కోని, కడుపు మింద బాదుకోని, తలకాయి మింద మొత్తుకోని కన్నీరు మున్నీరుగా యాడత్తా వుండే గోపాలంగాని పెండ్లాన్ని జూసి కటినాత్ముల కండ్లలో కూడా నీళ్లు దిరిగినాయి.‘‘సేతికెదిగొచ్చిన సెట్టంత కూతురు సచ్చిపోతే ఆ బాదను తట్టుకోడం ఎవురికి మాత్తరం సాద్దెమవుతుందిలే’’ అని ఎగవింటోళ్ల కమలక్క కండ్లలో నీళ్లు బెట్టుకునింది. ఆడుండే వోళ్లంతా ఒకొకురొకొక మాట సెప్పడం మొదలు బెట్న్యారు.