ఆ పొద్దు మాపటేల రెండు పదున్ల వాన పడింది. కొండలూ గుట్టలూ, చెట్టూ పుట్టా వానలో స్నానమాడినాయి. నేల చెమ్మగిల్లింది. పులుగూ బూసీ బొక్కల్లో నుంచి బయటకొచ్చి చల్లనిగాలికి మైమరిచినాయి. చీకటి పడగానే మా ఇంటెనక నుండే సుంకేసిరి చెట్టుని మిలమిలా మిణగర బూసులు ముసురుకున్నాయి. సుంకేసిరి చెట్టు చుక్కల్ని పూసినట్టుంది.మాయమ్మ పచ్చిపేడని ముద్దచేసి, చెట్టునుంచి కోసిన ఆముదం ఆకులో పెట్టి, ఆ ముద్ద మీద మట్టి పమిదిని గుచ్చింది. పమిదలో ఆముదం పోసి, వత్తివేసి పెద్దింటి (దేవునిల్లు) దీగూట్లో పెట్టి దీపం వెలిగించింది. పెద్దిళ్ళంతా వెలుగుతో నిండిపోయింది.దీపానికి పసుపు కుంకమ పెట్టి, దేవునికి దండం పెట్టుకునింది మాయమ్మ.నేను, పీరుగోడు కిరసనాయిలు బుడ్డీ దెగ్గిర కూర్చోని చదువుకుంటా వుండాము. మా గొర్రెల తాత పొయ్యికాడ కూర్చోని పుల్లలు ఏగేస్తా వుండాడు. వెనకనించి రెండు చేతులతో మా తాత మెడని బిగదీసి, చెవులో ఏదో గొణగతా ముదిగారం పడతా వుండాది మా చెల్లి వసంత. గొడ్లు గడ్డిమేస్తా వుండాయి. మా చిన్నవ్వ పెద్దావు ముందు కుర్చోని పిడుదులు ఏరతావుంటే, ఆవు గడ్డి మేయకుండా మూతిని ముందుకు సాపి, సగించినట్టు కళ్ళు మూసుకునింది. మా నాయన నీళ్ళు కట్టేదానికి మడికాడికి పోయినాడు.

పొయ్యిమీద వొట్టి చేపల కూర కుతకుతా వుడకతా వుండాది. ఇంకెక్కడ సదవతాను నేను. ఆ చేపల కూర వాసనకి మతి తపంటే! మా పీరుగోడు పెద్దగా నోరెత్తి ‘‘అశోకుడు చెట్లు నాటిం చెను. శ్రీకృష్ణదేవరాయలు చెరువులు తవ్వించెను’’ అని అరస్తా చదవతా వుంటే, నేను కిరసనాయిలు బుడ్డీ నీడతో ఆట్లాడుకుంటా వుండాను. మాయమ్మ దీపం పెట్టి పెద్దింట్లోనుంచి వచ్చింది.‘‘అమా నాకు ఆకలేస్తా వుండాది. సంగటి పెట్టు’’ అన్నేను.‘‘ఇస్కూలు నుంచి వస్తానే, ఇంత ... ఉలవముద్ద చించితివే, అపడే ఆకలా నీకు? నీకంటే చిన్నోడు వాడు. ఎంత నిష్టగా చదవతా వుండాడో చూడు. వాడు నా బిడ్డంటే! అంతా నా వాటం. నువ్వు అంతా మీ నాయన వాటం. ముద్దలు తిని ఎద్దులు మేపే రకం’’ అనింది పెగ్గిపడతా.