దట్టంగా మేఘాలుండడంతో, సాయంకాలం అయిదే అయినా చీకటిగా ఉంది.తాతబ్బాయి తన యింటి అరుగు మీదున్న బెంచిమీద కూచున్నాడు. అక్కడే ఉన్న రెండు కుర్చీల్లో పురుషోత్తమ శంకరం, డూప్లే, ఓ కాలు పైకి, ఓ కాలు నేల మీద పెట్టి కూచున్నారు. డూప్లే అసలు పేరు శ్రీరామ్మూర్తి. తాతగారి పేరు. ఆ తాతగారు, ఆ రోజుల్లో కాకినాడలో కాకుండా, చెన్నపట్నంలో ఇంగ్లీషు చదువుకున్న మనిషి, దబ్బపండు ఛాయ గిరజాల జుట్టు, మధ్యపాపిడి. రెండో కర్నాటక యుద్ధాన్ని ఇంగ్లీషు వారికి ఎదురు నిలిచి, ఓడించి ఫ్రెంచి వాళ్ళని గెలిపించిన ఫ్రెంచి గవర్నర్‌ జనరల్‌ లాగా అనిపిస్తాడని ఆయనకా పేరు పెట్టారు ఊళ్ళో వాళ్ళు. ఆయన మనవడికి, అసలు పేరు అలియాస్‌ కూడా సంక్రమించింది.పురుషోత్తమ శంకరానికి కూడా పేరులో చరిత్ర ఉంది. ఆ అగ్రహారంలో అరడజను శంకరాలున్నారు. మేడా శంకరం, మార్వాడీ (పిసినికొట్టు) శంకరం, చక్రవర్తి శంకరం (తన పొలం కాకుండా, మరో నలుగురి పొలాల్ని చూస్తూ చక్రం తిప్పుతుంటాడని) (నల్లగా ఉన్నాడని) నల్ల శంకరం, వీణ బాగా వాయిస్తాడని వీణశంకరం... ప్రస్తుతం తాతబ్బాయి అరుగు మీదున్న శంకరానికి ప్రిఫిక్స్‌ పురుషోత్తమ. పద్యాలు పాటలు ముఖ్యంగా ముక్కోటి ఏకాదశికి దశావతారాలు, లక్ష్మణ మూర్ఛ చాలా బాగా పాడ్తుంటాడు. 

అంతేకాకుండా, ఎక్కడైనా బోయినాలు, సమారాధాన, సంతర్పణ ఉందంటే, విస్తళ్ళు యిలా వేయడం మొద లెట్టగానే, అలా భగవద్గీతలోని పదిహేనో అధ్యాయం. పురుషోత్తం ప్రాప్తి యోగం ఊర్ద్వ, మూల మదశ్శాఖమ్‌... అంటూ మొదలెట్టి ‘అహం వైశ్యానరో భూత్వా’ని రెండు సార్లు అని ఆ తర్వాత మిగతాది పూర్తి చేస్తాడు. ఈ లోపల వడ్డన అయిపోతుంది. కాస్పేపయ్యాక ‘నిత్యా నందకరీ... అంటూ అన్నపూర్ణాష్టకం. చేతులు కడుక్కునే వరకూ అన్నపూర్ణాష్టకం అవుతూంటుంది. శంకరం మొగుడు కాబట్టి పురుషోత్తమ అన్నది ముందుచేర్చి, కన్‌ఫ్యూజన్‌ లేకుండా చేసుకున్నారు అక్కడి వాళ్ళు.‘‘గాలీవాన వచ్చేట్టుంది. మనం వెళ్తూందాం వేంటి? నారాయణ శివాలయాని కొచ్చేస్తాన్నాడు కదా! ఈ వెయిటింగ్‌ దేనికీ....?’’ అన్నాడు శంకరం.