వాళ్లింట్లో చాయ్‌ తప్ప కాఫీ తాగరు. ఆవిడకు కాఫీ అంటే చచ్చే ప్రాణం. ఆవేళ అయేసరికి నాలిక పీకేస్తుంది కాబోలు. ఏదో వంకన సుమతి వాళ్ల ఫ్లాట్‌కు వచ్చేస్తుంది. ఇది అర్ధం చేసుకోవడానికి సుమతికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఆవిడ లేనపడు ఆమె పేరు కాఫీ ఆంటీ. ఎదురుగా వుంటే మేడమీది ఆంటీ. వాళ్లు సుమతీ వాళ్ల పైఫ్లోర్‌లో వుంటారు. కొడుకు కోడలుతో వుంటుంది. వాళ్లకి యిద్దరు పిల్లలు. ఇద్దరూ వుద్యోగాలు చేస్తారు కాబట్టి వాళ్ల పిల్లల్ని చూసుకోవాలి. అందుకో సొంతమనిషి కావాలి. ఆంటీ వాళ్లకి నమ్మకమైన ఆయా. ఏభైకి కొంచెం పైబడినా యింకా వోపిక వున్న మనిషి. ఆవిడకు ఆసరా కావాలి. రెండుపూటలా భోజనం, గూడూ తోడూ కావాలి. చాలామంది జీవితం లాంటిదే ఆవిడ జీవితం.సుమతికి అపడపడు కాలక్షేపం. మధ్యాహ్నం తను కాఫీ తాగే వేళకు వస్తుంది. తగని మొహమాటస్తురాలు. వచ్చేటపడు వొట్టి చేతులతో రాదు. చిన్న పూలచెండో, చిన్న కపలో పచ్చడో తెస్తుంది. ఏవో ఆ కబుర్లు యీ కబుర్లు చెప్పి కాఫీ తాగి వెళ్తుంది.ఆరోజు పింగాణి సాసర్లో రుబ్బిన గోరింటాకు ముద్దతో వచ్చింది. దానిని చూడగానే సుమతికి ప్రాణం లేచివచ్చింది.

 నిజంగా అట్లా ఆకు రుబ్బిన గోరింట ముద్దని చూసి ఎన్నాళ్లు అయిందో? సిటీకి వచ్చాక ఆల్టాలు, మెహందీ కోన్‌లూ తప్ప నిజం గోరింటాకు పెట్టుకుని ఎన్నేళ్లు అయిందో? తెగ మురిసిపోయింది సుమతి.‘‘థాంక్యూ ఆంటీ... థాంక్యూ...’’ అని ప్రత్యేకంగా లోపలికి ఆహ్వానించింది.‘‘ప్రీజ్‌లో పెడితే ఏమీ అవదు కదా...’’ అని ఆత్రుతగా అందుకుంటూ అడిగింది సుమతి.‘‘ఎందుకూ... నేను యిపడు నీ చేతులకు పెట్టేస్తా. గంటలో నీ అరచేతులు మందారాలు అయిపోతాయంటే నమ్ము’’ అన్నది కాఫీ ఆంటీ వుత్సాహంగా.‘‘అయితే ఓ నిమిషం. మనిద్దరికీ చెరో కప కాఫీ తెస్తా. ఆ తర్వాత దీని సంగతి చూద్దాం’’ అన్నది సుమతి.క్షణంలో రెండు కాఫీ కపలతో వచ్చేసింది. ఆంటీ కాఫీ తాగుతూ గోరింటాకు ముచ్చట్లు బోలెడు చెప్పింది. వాళ్ల వూళ్లో ఆకు రుబ్బేటపడు ఏడు యిళ్ల తాటాకులు వేసేవాళ్లుట. పుట్టగొడుగులా వుండే కాకిబొడ్డు వేస్తే బాగా పండుతుందిట. కరణం గారి చెట్టు ఆకు ఫస్టుక్లాసుగా పండేదిట. కొద్దిగా నిమ్మరసం పిండితే శ్రేష్టంట.‘‘ఇంతకు యీ ఆకు ఎక్కడ సంపాదించారు ఆంటీ’’ అని అడిగాను. రోజూ ఆకు కూరలు తెచ్చే అమ్మాయిని అడుగుతోందిట ఎప్పటినుంచో. ఆ అమ్మాయి సిటీ చివర ఎక్కడో వుంటుంది. వొక పూజ పునస్కారం లేని దేవాలయం పక్కన గోరింట పొద వుందిట. ఆ అమ్మాయి అడగ్గా అడగ్గా తెచ్చిపెట్టిందిట. కాఫీలు తాగడం పూర్తయింది.