‘‘కుడికాలితో ఆ బియ్యం కలశాన్ని తన్ని, ఇంట్లోకి కుడికాలు ముందు పెట్టి ప్రవేశించు’’ అనిపురోహితుడు కొత్తకోడలికి చెబుతున్నాడు.‘‘ఇద్దరూ పేర్లు చెప్పి లోపలికెళ్లాలి’ అని ముత్తైదువలు కొంగు ముడి వేసుకున్న కొత్త దంపతుల్ని బలవంతపెడుతున్నారు.కాళ్లకు పారాణి, గొలుసులు, పట్టుచీర, నడుంకి బంగారు వొడ్డాణం, భుజాలకు వొంకీలు, మ్యాచింగ్‌ బ్లౌజ్‌, మెరిసిపోతున్న నెక్లెస్‌, పచ్చతాడులో మెరిసే మాంగల్యాలు, పాపిడిబిళ్ల,బుగ్గ చుక్కతో పెళ్లికూతురు రాధ చూడ ముచ్చటగా వుంది.

‘మా అన్నయ్య పేరు చెప్పు’ అని ఆడపడుచులు నిలదీశారు.‘అల్లుడుగారు ముందు అమ్మాయి పేరు చెప్పాలి’ అన్నారు పెళ్లికూతురు తరపు స్త్రీలు.‘బాధ!’ అన్నాడు పెళ్లికొడుకు ‘రాధ’ అనకుండా అందరూ ఫకాలున నవ్వారు.పెళ్లికూతురు ముఖం చిన్నబుచ్చుకుంది.‘రాధాదేవి, నేను కలిసి వచ్చాం!’ అన్నాడు పెళ్లికొడుకు.‘ఇప్పుడు వదినెవంతు’ అంది ఆడబడుచు.‘వేణు...’ మాటలు గొణిగింది.‘గట్టిగా చెప్పు! నోటి ముత్యాలు రాలవు!’ అంది ఓ ముసలావిడ.‘వేణుగోపాలకృష్ణమూర్తి’ అంది సిగ్గుగా.పట్టుచీర అంచులు కొద్దిగా పైకి పట్టుకొంది.కాళ్లకు పూసిన గోరింట పారాణి బాగా పండి ఎర్రగా మెరుస్తోంది.బియ్యం కలశాన్ని తన్ని, కుడికాలు ముందు పెట్టింది వధువు.అలా నూత్న దంపతులు గృహ ప్రవేశం చేశారు.

వేణూరాధల సంసారం - మూడుపువ్వులు - ఆరుకాయలు రీతిలో సాగి సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి పండంటి మగబిడ్డను ప్రసవించింది రాధ.ఉద్యోగరీత్యా నెల్లూర్లో కాపురం పెట్టాడు వేణు.బారసాల కాగానే పుట్టింటి నుంచి మగబిడ్డతో వచ్చింది రాధ.బాలాజీనగర్లో ఓ ఫ్లాట్‌లో కాపురం.కమర్షియల్‌ టాక్స్‌ డిపార్టుమెంటులో వేణు సీనియర్‌ అసిస్టెంట్‌.బిడ్డ పుట్టిన వేళావిశేషం - సూపరింటెండెంట్‌ ప్రమోషన్‌ మీద ఒంగోలు ట్రాన్స్‌ఫర్‌.ప్రమోషన్‌ కాబట్టి వెళ్లక తప్పలేదు.ఫఫఫరాధ, వేణుల సంసార నావ సాఫీగా సాగిపోతోంది.ఐదేళ్ల సంసార జీవితానికి సాక్ష్యంగా ముగ్గురు బిడ్డలు.రెండోది ఆడపిల్ల. మగపిల్లాడి కోసం మూడోసారి ప్రయత్నం.మూడో పిల్లాడిని కడుపుతో వుండగా సీమంతానికి రాధను తయారుచేశారు. రాధ తనకిష్టమైన గోరింటాకును కష్టపడి రెండు చేతులకూ పెట్టుకొంది.రాత్రి వేళ పనులన్నీ పూర్తిచేసి తీరికగా కూచొంది.‘కాళ్ళకు కూడా పెట్టుకోక పొయ్యావా!’ అన్నాడు వేణు, గృహ ప్రవేశం నాటి రాధ గుర్తుకొచ్చి.‘మీ సరసం చాలు’ అంది రాఽధ సిగ్గులొలికిస్తూ.