యాపచెట్టు తొర్రలో వొదిగిన చిలకలు రెపరెపమని పైకి లేచినాయి.ముందుకు తూలి ఉలిక్కిపడి కండ్లు తెరిచింది గుడిసింటి దీపం.అది చూసి దీపాలన్నీ పకపకా నవ్వినాయి.‘‘రెప్పపాటులో ఏం నిద్దరొచ్చిందమ్మా! నాలుగుపుట్ల నిద్దర్ని నెత్తికెత్తుకున్నట్టు వున్నింది’’ అనింది కండ్లు నలుపుకుంటా.‘‘నిద్దరచోటు ఎరగదు. ఆకలి రుచి ఎరగదు. కామం భయమూ, లజ్జా ఎరగదు’’ అనింది మిద్దింటి దీపం.‘‘గాలీవానని ఆపగలమా? కష్టమో, సుఖమో అనుబోగించాలిగాని! కొంతమంది నీతులు చెప్పేదానికే పుడతారు. కొంతమంది నేతులు తాగేదానికే పుడతారు. కొంతమంది కష్టంచేసేదానికే పుడతారు గొర్రెలతాత మాదిరి’’ అనింది పెద్దింటి దీపం.‘‘నీతులు చెప్పేవాళ్ళు, నేతులు తాగేవాళ్ళు మనకెందుకు? గొర్రెలతాత గురించి చెప విందాం?’’ అని అడిగింది కప్పూరదీపం.‘‘పనిలో పరమాత్ముడ్ని వెతకబోతే, గొర్రెల తాత పనితనాన్ని చూసి పరమాత్ముడే సొయంగా వచ్చి తొలికిపట్టి చెనిగిచేన్లో గడ్డి తవ్వినాడంట!’’ అని చెప్పింది పెద్దింటి దీపం.‘‘గొర్రెలతాతా! అదేం పేరు? ఇచ్చిత్తరంగా వుండాదే!’’ అనింది గుడిసింటి దీపం.‘‘బొడ్డుకోసి వాళ్ళమ్మా, నాయనా పెట్టిన పేరు గోపిని నారాయణస్వామినాయుడు. ఆ పేరుకి బొడ్డుకోసి కొంతేగాలపు నాకొడుకు పెదబ్బ పెట్టిన పేరు గొర్రెలతాత. వాళ్ళకు దొడ్డెడు గొర్రెలుండేవి. గొర్రెలను మేపే తాత కాబట్టి గొర్రెలతాత అని పేరు పెట్టినాడు. ఆఖరికి ఆ పేరే ఖాయమైపొయింది’’‘‘గొర్రెలతాత అంతపొడుగూ కాదు. అంత పొట్టీగాదు. దిట్టమైన మనిషి. కండలు తిరిగుండేవి. ఎత్తయిన ఎదమింద ఏ ఆడదాని చూపైనా పడితే వొళ్ళు మరిచిపొయ్యి చూపు తిపకునేది గాదు’’.‘‘మీసం మెలేసి చూస్తే పులైనా తోకమడిసి, కాళ్ళు చాపి కూర్చోవాల్సిందే!’’‘‘ఆ చూపులో మెరుపులు మెరిసేవి’’.

చెనిగి చెట్లు పసుప్పచ్చని పూలు పూసినాయి.ఎండ సగించినట్టు కాస్తావుండాది.తూర్పు చేన్లో ఈతచెట్టు ఒగటి అడ్డంగా వుంటే రంపంతో మొదులు తెగ్గోస్తా వుండారు గొర్రెలతాత, పెదబ్బవాళ్ళ నాయన.ఆపొద్దు బడికి సెలవుకావడంతో పెదబ్బగూడా వాళ్ళతోపాటూ వచ్చి గొర్రెల్ని, గొడ్లను కటవన తోలి మేపతా వుండాడు.అది పచ్చిక కాలం.గానుగచింతగొల్లపల్లె, చెలంపల్లె, కళ్ళావాళ్ళపల్లెల నుంచి గూడా మేపేదానికి జీవాలను ఆ కటవకే తోలుకోని వచ్చినారు.