అర్థం చేసుకుంటే అహంకార విమోచనం కోసమే సంకల్పం! నేల మీద పరమాణువు లాంటి నువ్వేమిటో, నీ ఉనికి ఏపాటిదో చెబుతుంది సంకల్పం. తర్వాత దోసిట్లో నీరు నింపుకుని మూడుసార్లు మంత్రం చదువుతూ అర్ఘ్యం వదిలాడు చిదంబరశాస్త్రి.చిదంబర శాస్త్రి దబ్బపండు ఛాయ. ఉదయసంధ్యలో లేలేత కిరణాల్లో అతని దేహచ్ఛాయ చమక్కుమని మెరుస్తోంది. నున్నగా గుండు..చెవులకు మకర కుండలాలు...మెడలో రుద్రాక్షలు...నడుముకు బిగించిన ఉత్తరీయం...నిలువెత్తు పవిత్రతకూ భక్తి భావానికీ దర్పణంలా ఉన్నాడు.నెమ్మదిగా ఒక్కో అడుగు వేసుకుంటూ గోదావరిలోకి దిగాడు. అత్యంత శ్రద్ధగా మూడు మునకలు మునిగాడు, ముక్కు మూసుకుని. శాస్త్రి చుట్టూ వలయాలుగా స్వచ్ఛ గోదావరి తరంగాలు.సరిగ్గా అదే సమయంలో ఒడ్డున ఉన్న నలుగురు బ్రాహ్మణులు మాట్లాడుకుంటున్నారు. చిదంబర శాస్త్రికి వీళ్ళ మాటలు వినబడవు. మాటలు అందనంత దూరం.

‘చదువు ఒంటబట్టక సగంలో వదిలేసినవాడు... వేదమంత్రాలు ఎంత స్పష్టంగా పలుకుతున్నాడో... గొప్ప ఘనాపాఠిలా!’‘ఎవరైనా ఊహించారా?... ఎలా మారిపోయాడో.... అంతా భగవంతుని రాత’‘వీణ్ణి మరో నిగమశర్మ అనుకున్నాం’‘పదేళ్ళక్రితం వాడి అలవాట్లూ, చేష్టలూ... బ్రాహ్మణ పుట్టుకకే తలవంపులు...అపచారం...అగ్రహారం చూస్తూ ఊరుకుంటూ భరించాలా, దేవుడా... అని బ్రాహ్మణ్యం మథనపడింది కదా...’‘ఊరి నుంచి పారిపోవడమే మేలైంది. ఏ మహానుభావుడు చేరదీశాడో...మనిషిని చేశాడు. ముఖ్యంగా పరిపూర్ణ బ్రాహ్మణుడిలా మలిచాడు.

’‘అవ్వ... ఆరోజుల్లో చిదంబరశాస్త్రి చేసిన పనులు అన్నీ ఇన్నీనా? చీట్లపేక, సిగరెట్టు దమ్ములు, ఒట్టిదో నిజమో చెడు తిరుగుళ్ళు...అన్నట్టు వటువుగా వేసుకున్న జందెం తెంపి పారేసినప్పుడే కదా ఇంట్లో రభస... ఆ మర్నాడే అతీగతీ లేకుండా పరారయ్యాడు. ధర్మానుష్ఠాన పథంలోకి తిరిగి రావడం ఎవరైనా ఊహించారా?’గోదావరి పుష్కరాలు మునుపెన్నడూ లేనంత ఘనంగా జరిగేట్టున్నాయి. ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రజల మనోభావాలకనుగుణంగా పెద్దమొత్తంలో సొమ్ము కేటాయించింది. పైగా నూటనలభై నాలుగేళ్ళకొకసారి వచ్చే పుష్కరాలుగా ప్రచారం చేస్తున్నారు. గోదావరి ఒడ్డున ఉన్న యానాం కూడా హడావిడి చేస్తున్నది.చిదంబరశాస్త్రి పుష్కరాలకు రెండు నెలలు ముందుగానే యానాం వచ్చేశాడు. అతని రాక అందర్నీ ఆశ్చర్యపరిచింది. సంప్రదాయబద్ధమైన వేషధారణ, ఆహార్యం, సంభాషణ తీరు, లయబద్ధమైన మంత్రోచ్ఛాటన, ఖంగున మోగే కంఠస్వరం... అతనిలోని గాంభీర్యానికి అందరూ విస్తుపోతున్నారు.