చిన్న పట్టణంలో న్యాయవాదిగా పనిచేస్తున్న పరే్‌షకు ముందూవెనుకా ఎవరూ లేరు. అతనికి చిన్నతనంలోనే గౌరితో వివాహమైంది. సంపన్న కుటుంబంలో సుకుమారంగా పెరిగిన గౌరి చాలా నెమ్మదస్తురాలు. ఆత్మాభిమానం కలది. యుక్తవయసు రావడంతో ఆమెను కాపురానికి పంపక తప్పలేదు గౌరి తల్లిదండ్రులకు!స్వయంకృషితో ఇప్పుడిప్పుడే సమాజంలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంటున్న పరేష్‌ ఆలోచనలు ఎప్పుడూ గౌరి చుట్టూనే తిరుగుతుండేవి. తన భార్యగా గౌరిని పరేష్‌ ఎప్పుడూ పూర్తిగా విశ్వసించలేదు. కొన్నిసార్లు అతను కోర్టు సమయం అయిపోకముందే ఇంటికి వచ్చేస్తుండేవాడు. పరేష్‌ అకస్మాత్తుగా ఎందుకు ఇంటికి వస్తున్నాడో గౌరికి అర్థమయ్యేది కాదు. పనివాళ్ళను కూడా ఎలాంటి కారణం లేకుండా తీసేస్తుండేవాడు. అతనింట్లో ఎక్కువ కాలం ఎవరూ పనిచేయలేకపోయేవారు. ఎవరైనా పనివాడు బాగా పని చేస్తున్నాడని, సహాయంగా ఉంటున్నాడని గౌరి అంటే చాలు అతన్ని వెంటనే పనిలోంచి తీసేసేవాడు. ఎంతో హుందాగా, గంభీరంగా ఉండే గౌరికి ఇలాంటి పనుల మూలంగా అభిమానం దెబ్బతిన్నట్టు అయ్యేది. అయితే ఆమె కోపానికి కానీ, అసంతృప్తికి కానీ ఏ మాత్రం ఫలితం ఉండేది కాదు. పరేష్‌ ఇంకా మొండితనంగా వ్యవహరించేవాడు.

రానురాను పరే్‌షలో గౌరిపట్ల ఉన్న అపనమ్మకం కాస్తా అనుమానంగా మారింది. పనమ్మాయిని గౌరి గురించి రహస్యంగా ఆరాలు అడగడం మొదలుపెట్టాడు. ఇదంతా గౌరి చెవిన పడింది. భరించలేకపోయింది. ఆమె అభిమానం దెబ్బతింది. తనలో తను కుమిలి పోయింది. ఫలితంగా భార్యాభర్తల మధ్య దూరం ఇంకా ఎక్కువయింది. తన ఉద్దేశం ఏమిటో గౌరి గ్రహించిందని అర్థం అయిన తర్వాత పరేష్‌ ఇంకా రెచ్చిపోయాడు. కప్పుకున్న ముసుగును తీసివేసి ఆమె మొహం మీదే దుర్భాషలాడడం మొదలుపెట్టాడు.

అయినా ఆమె మౌనంగా సహిస్తూ వచ్చింది. ఆమె మౌనం అతడికి భరించలేనిదిగా తయారైంది. ఆమెపై కోపం, అనుమానం మరింత పెరగనారంభించాయి.వైవాహిక జీవితంలో ఆనందం లోపించడంతో పిల్లలు లేని గౌరి ఓదార్పు కోసం భక్తిమార్గాన్ని ఆశ్రయించింది. ఆమె పరమానందస్వామిని తన ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించింది. తనకు భగవద్గీత బోధించవలసిందిగా గౌరి ఆయన్ని కోరింది. తన హృదయంలో పొంగి పొరలుతున్న స్త్రీ సహజ ప్రేమాభిమానాలన్నిటినీ ఆమె గురువు పాదాల చెంత గుమ్మరించింది.