‘‘ఇదే కత్తులబావి!’’ కనబడుతున్న బావిని చూపిస్తూ చెప్పాడు కొండారెడ్డి. రాజారావు ఆసక్తిగా అటువైపు చూశాడు. వాళ్ళిద్దరూ బావి వైపు నడిచారు. మేమందరం గుంటూరు జిల్లాలో గల కొండవీడుకోట ఉన్న కొండపైకి వెళ్ళే మార్గంలో ఉన్నాం. మేమంటే నేను, రాజారావు, కొండారెడ్డి ఇంకా మాకు సాయంగా ఆహార పదార్ధాలు, పానీయాలు (అంటే బీర్లు) మోసుకుంటూ కుర్రవాళ్ళు ఇద్దరు. బావిలోకి చూస్తూ రాజారావుతో బావిగురించి చెప్తున్నాడు కొండారెడ్డి. ‘‘పూర్వం కొండవీడుని రెడ్డిరాజులు పరిపాలించేటప్పుడు, చుట్టుపక్కల గ్రామాల్లో డెబ్భయి రెండు మంది పాళెగాళ్ళు ఊరికే తిరుగుబాట్లు చేస్తూ గ్రామాల్లో అలజడి సృష్టిస్తూ ఉండేవారట. వారిని అణచటానికి రాజు ఒక ఉపాయం చేశాడట.
ఈ బావిని తవ్వించి అందులో కత్తులను నాటించాడట. తరువాత ఒక ఉత్సవము ప్రకటించి, పాళెగాళ్ళందరినీ ఆహ్వానించి రహస్యముగా వారిని ఈ బావిలోకి తోయించి చంపించి రాజ్యంలో శాంతి భద్రతలను పునరుద్ధరించాడని కథ. అందుకనే దీనికి కత్తులబావి అని పేరు వచ్చింది అని ఇక్కడివాళ్ళు చెబుతారు’’. కొండారెడ్డి చెప్పాడు.‘‘పేరు బాగానేవుంది కానీ కత్తులేవీ, కనబడవేం!’’ రాజారావు సందేహం వెలిబుచ్చాడు. నాకు నవ్వొచ్చింది. దేనినీ తొందరగా ఒప్పుకోకుండా వాదనచేయడం అతనికో సరదా. ‘‘ఒరేయ్! నీ పరధ్యానంతో చస్తున్నాము, ఇటువచ్చి చూడరా బాబూ!’’ అన్న రాజారావు పిలుపుతో నిరాసక్తంగా బావికేసి కదిలాను. ‘‘సతీదేవి మరణించినప్పుడు శివుడు కూడా విరహంతో ఇంత పరధ్యానంగా ఉండి ఉంటాడని అనుకోను. ఏరా, ఈ లోకంలో నీకొక్కడికి పెళ్ళాం ఉందిటరా! నిజమే, నీకు కొత్తగా పెళ్లయింది. కానీ నువ్వు హైదరాబాదులో, నీ భార్యేమో ట్రైనింగ్ కోసమని బెంగుళూరులో ఉన్నంత మాత్రాన ఇంత విరహవేదన పడాలా! నన్ను చూడు మా ఆవిడ దగ్గర లేకపోతే ఎంత ఫ్రీగా ఉంటానో! నీ పరధ్యానాన్ని తగ్గించి, మనం ఇక్కడికి ఎందుకువచ్చామో గుర్తు తెచ్చుకొని, చుట్టుపక్కల ప్రదేశాలు చూడరాబాబూ!’’ నన్ను చూస్తూ రాజారావు కామెంట్ చేశాడు.రాజారావు మాటలతో నా ఆలోచనలు కిరణ్మయి మీదకి మళ్ళాయి.
మా ఇద్దరికి పెళ్ళయి సంవత్సరం కూడా కాలేదు. నిజానికి పెళ్ళయిన కొత్తలో జీవితం ఎంతహేపీగా ఉండాలి. కానీ, నాకే ఎందుకిలా? రాజారావు చెప్పినట్టు, కిరణ్మయి బెంగుళూరు ట్రైనింగ్ కోసమని వెళ్ళిందా లేక నాకు దూరంగా ఉందామని వెళ్ళిందా! నిజమేమిటో నాకే తెలుసు. పెళ్లయిన కొత్తలో బాగానే ఉంది. కానీ తర్వాత ఎందుకో తెలీకుండా ఇద్దరి మధ్య గొడవలు. కీచులాటలు. ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. కిరణ్మయి అభిమానం గల యువతిఅని పెళ్ళయిన మొదట్లోనే గ్రహించాడు తను. తన తప్పులేకపోతే సర్దుకు పోవడానికి ఎంత మాత్రం ఒప్పుకోదు. తను భర్త కదా, ఆ అధికారంతో ఏదైనా చెప్పబోతే మేల్ ఛావనిజం అంటూ కొట్టి పారేస్తుంది. ఆ రోజు బండి చెడిపోయిందని, తన కొలీగ్ బైక్ మీద కిరణ్మయి వచ్చినప్పుడు మరీ పెద్ద గొడవైపోయింది. ‘‘నాకు ఫోన్ చేయవచ్చు కదా, కొలీగ్ బైక్‌మీద రావడమెందుకు’’ అని అడిగాడు తను. ‘‘నీకు ఫోన్ చేశాను. నీ సెల్ ఆఫ్ చేసి వుంది’’ అంటుంది కిరణ్మయి. ‘‘నా సెల్ ఆఫ్ చేసి లేదు’’ అని చాలాసేపు వాదించాడు తను. దానితో ఊరుకోకుండా ఏదేదో మాట్లాడేశాడు. వెంటనే తన పుట్టింటికి వెళ్ళిపోయింది. రెండురోజుల తర్వాత వచ్చి బెంగుళూరుకి ట్రైనింగ్‌కి వెళ్తున్నానని ముభావంగా చెప్పి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయింది. ఇప్పటికి నెలైంది. ఒక ఫోన్ లేదు. మెస్సేజ్ లేదు. గొడవ సంగతి నేను మా పెద్దవాళ్ళకి చెప్పలేదు. బాధ పడతారని. కిరణ్ కూడా చెప్పినట్టులేదు. వాళ్ళందరూ మేమిద్దరం సఖ్యంగానే ఉన్నామని అనుకుంటున్నారు. మేమిద్దరం దూరంగా ఉన్నందుకు సానుభూతి చూపిస్తుంటారు. ఏవో మాటలు చెప్పి నెట్టుకొస్తున్నాను. నిజానికి తనతో గొడవైన తర్వాత నేను సెల్ ఫోన్ చూసుకుంటే నిజంగానే ఆఫ్ అయి వుంది. అంత గొడవైన తర్వాత నా తప్పు వొప్పుకోవటానికి అహం అడ్డు వచ్చింది. సరే, తనైనా సర్దుకుపోవచ్చు కదా. ఆడదానికి అంత పంతమా, చూద్దాం లెమ్మని నేను కూడా ఊరుకున్నాను.