‘‘ఛీ-బ్లడీ షిట్‌’’ అంటూ నేలని తన్ని, కోపంతో కొంగలాఅడుగులు ఎత్తెత్తివేస్తూ, చిందులేస్తూన్న కుమార రత్నాన్ని న్యూసు పేపరు చాటుగా వెగటు చూపు చూసాడు శ్రీనివాసులు.కోపాన్ని కంటిన్యూ చేసాడు వంశోద్ధారకుడు ‘‘ఓ సెపరేట్‌ రూమూ లేదు పాడూ లేదు. అందుకనే ఒక్క ఫ్రెండు కూడా రాడుమనింటికి. ఇలా బజార్లోలా అందరూ ఎడాపెడా తిరుగుతూ, మాట్లాడుకుంటూ, టివిలు చూస్తూంటే చదువూ బుర్రకెక్కదు’’వెంటనే అందుకుంది సుపుత్రికారత్నం ‘‘సర్లె లైౖట్‌ దీస్కో, నాకు డ్రెస్‌ ఛేంజ్‌ చేసుకోడానికి సెపరేట్‌ రూం లేదని బిసి నుంచీ నేను గోలపెడ్తూంటే దిక్కులేదు గానీ దొరగారికి స్టడీ రూం కావాల్ట’’వెంటనే వంటింట్లోంచి కేకలు ‘‘నోరుముయ్యండర్రా. అక్కడికి నా కోసం మీ నాన్నేదో సెపరేట్‌ రూం యిచ్చేసినట్లు! ఇరవై నాలుగ్గంటలూ వంటతో, చాకిరీతో ఛస్తూన్నా నాకు కాసేపు ఒంటరిగా ఏకాంతంలో మనసారా తనివితీరా ఏడ్చే అదృష్టం కూడా లేదు ఈ యింట్లో భార్యామణి చేతిలోని స్టీలు గిన్నె కొబ్బరికాయలు కొట్టే పొత్రం రాయిమీద ఖంగుమని, క్రికెట్‌ బాల్‌లా ఒంపులు తింటూ దొర్లుతోంది.ముగ్గురి విసుర్ల డైరెక్షనూ తన వైపే అని తెలుసు శ్రీనివాసులికి. తెలియక పోవడమేం, తన ముప్ఫయి సంవత్సరాల అనుభవంతో అత్తగారు గత వినాయక చవితికి తయారు చేసి కడప బాంబుల్లాంటి ఉండ్రాళ్ళ లాంటి వాళ్ళ మాటలు సూటిగా గుండెలకి తగుల్తూంటే?లాభం లేదిక దొంగతనం చేసయినా, బాగా విశాలమయిన త్రీ బెడ్‌రూం ఫ్లాట్‌ ఒకటి కొనిపడేయాల్సిందే! గత జన్మ శతృవులు ముగ్గురికీ మూడు రూంలు తగలేసి, చక్కగా న్యూసెన్సు లేకుండా న్యూస్‌ పేపర్తో తను హాల్లో సెటిలయిపోవచ్చని కాన్ఫిడెంట్‌గా డిసైడై పోయాడు శ్రీనివాసులు. తన బడ్జెట్‌కి ఒకట్రొండు లకారాలు ఎక్కువయినా, విశాలమయిన త్రీ బెడ్రూం ఫ్లాట్‌ గురించి శ్రీనివాసులు చెప్పని మనిషి ఈ భూప్రపంచం మీద మిగల్లేదు. తిరగెయ్యని పేపరూ లేదు.