‘‘అబ్బా... ఎట్లయితేనేం మూడు రోజులు అయిపోగొట్టుకున్నాం. యింకొక్క రెండు రోజులు బరిస్తే చాలు... వూరికి పోవచ్చు’’ నైటీ మడత పెడ్తూ మాధురీ వైపు చూశాను. పరుపు మీద పడుకొని కాలు మీద కాలు వేసుకొని, కుడికాలు నెమ్మదిగా వూపుతోంది. జీన్స్‌ ప్యాంట్‌, టాప్‌... నలుగుతాయని బెంగ లేదు.‘‘ఏం, ధ్యాస ఇంటి మీదికి పోయిందా? నాకు అప్పుడే మూడు రోజులు గడిచిపోయాయే అని అనిపిస్తోంది. ఇంటి గురించిన చింత లేకుండా హాయిగా వున్నాను. రోజు ప్రొద్దున్నే వుండే వురుకులు లేవు. ఫ్రిజ్జులో ఏం కాయగూరలు వున్నాయో ఏం వండుకోవాలో అనే దిగులు లేదు. నింపాదిగా స్నానం... తిండి కూడా మింగకుండా నమిలి తింటున్నాను’’‘‘మీ సంగతి ఏమో కాని... నాకు మాత్రం ట్రైనింగ్‌ నిర్భందించినట్టుంది. చెవులు మూసి చావగొట్టడం అంటే ఇప్పుడు తెలుస్తోంది...’’గట్టిగా నవ్వేశాను.‘‘భలేదానిని మాధురీ... సెకండ్‌ క్లాస్‌ ఏ.సి. చార్జెస్‌ ఇచ్చి ఫైవ్‌ స్టార్‌ హోటల్లో అకామిడేషన్‌ ఇచ్చిండేది ఎందుకనుకున్నావు... యూ.జి.సి వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. ఇంతకింతకు రాబడ్తారు. మనల్ని వుతికి ఆరేసి ఇస్ర్తీ చేసి కాని పంపరు...’’నవ్వుకుంటూ రూమ్‌ లాక్‌ చేసి, బ్రేక్‌ఫాస్ట్‌ హాల్‌ వైపు కదిలాం.

ఫైవ్‌ స్టార్‌ హోటల్లో బస చేసినందుకు టిఫిన్‌ కూపన్స్‌ ఫ్రీగా ఇచ్చారు. నూట యాభై రూపాయల కూపన్‌ అది. దానికి తగ్గ టిఫినే ఏర్పాటు చేస్తారు. ఈ రోజు కూడా ఇరవై రకాలకు తక్కువ లేకుండా ఉన్నాయి. ఉత్తరాది, దక్షిణాది టిఫిన్సే కాకుండా అమెరికన్‌ టిఫిన్స్‌ అన్నీ నోరూరిస్తున్నాయి. వాటికి తోడు రెండు రకాల స్వీట్సు, వుడకబెట్టిన కోడిగ్రుడ్లు, ఆమ్లెట్స్‌, మొలకెత్తిన గింజలు, కోసిపెట్టిన నాలుగు రకాల పండ్ల ముక్కలు, రెండు రకాల పండ్ల రసాలు యింకా పాలు, కాఫీ, టీ...నామటుకు నాకు వొకటి అనిపించింది. ఒక నెల రోజుల్లో మా ఇంట్లో ఎన్ని రకాల టిఫిన్స్‌ చేసుకుంటామో అవన్నీ ఒకేసారి నాకళ్ళ ముందు వున్నాయి. ఎంత ఆకలి గొన్న వారైనా ఎంత తిండికి ముఖం వాచిన వాళ్ళైనా వాటినన్నింటినీ రుచి చూడటం అసంభవం... తినాలని ఆశ వుంది. కాని శరీరం, పొట్ట అందుకు వొప్పుకోవద్దూ? ప్రతిదాన్నీ కాస్త అయినా రుచి చూడాలి అంటే కనీసం రెండు గంటలు పడుతుంది. ఇన్నిరకాల టిఫిన్స్‌ మధ్య రాగి రొట్టె, జొన్న రొట్టెల జాడ అయితే లేదు. ఫైవ్‌ స్టార్‌ హోటల్లో వీటికి చోటెక్కడ? దిష్టిచుక్కల మాదిరిగా ఇవి ఎందుకు అనుకుంటారేమో?మొదటి రోజు ట్రైనింగ్‌ అయిపోయాక రోజారమణికి ఫోన్‌ చేసి కేవలం టిఫిన్‌ గురించే పది నిమిషాలు చెప్పాను. అంతా విని, చివర్లో ‘‘యూ ఆర్‌ ఎంజాయింగ్‌ ద ట్యాక్స్‌ పేయర్స్‌ మనీ... సొమ్ము జనాలది... అనుభవిస్తుండేది మీరు... అఘోరిస్తోండేదేమో జనాలు’’