‘అయ్యో కాఫీ అన్నా తాగకుండా ఇంత పొద్దుటే ఎక్కడికండీ ఆ పరుగు?’ కామేశ్వరమ్మ మొగుడు శంకర్రావుని నిలదీసింది.ఆవిడకి ఈ మధ్య శంకర్రావుగారి ధోరణి బొత్తిగా అంతుపట్టకుండా పోయింది. రిటైర్మెంటు దగ్గర పడుతున్నకొద్దీ ఈపెద్దమనిషి ప్రవర్తన విచిత్రంగా అనిపిస్తోంది ఆవిడకి.రోజూ ఏడున్నరకి లేచి గ్లాసుడు చిక్కని కాఫీ తాగనిదే మంచం దిగని భర్తగారు ఇలా తెల్లారకుండానే నిద్రలేచి కొత్తగా కొనుక్కు తెచ్చుకున్న తెల్లని మల్లెపువ్వు లాంటి వాకింగ్‌ డ్రెస్సు, బూట్లు వేసుకుని పచ్చిమంచినీళ్లన్నా తాగకుండా పరుగుతియ్యడానికి ఉరకలు వేస్తూ వెళ్లడం... అరడజనుకి తక్కువ కాకుండా రోజుకో వెరైటీ దోసెలు, పెసరట్లు, ఇడ్లీలు లాగించేసే మనిషి ఈ మధ్య వాకింగ్‌కెళ్లి తిరిగొచ్చాక మేకపోతులా పచ్చి కూరగాయ ముక్కలు నమిలేసి కాసింత పలచని మజ్జిగ తాగేసి ఆఫీసుకు పరిగెత్తడం... మళ్లీ సాయంకాలం రాగానే ‘హాహూ’ అంటూ మేడమీద బస్కీలు తియ్యడం... రాత్రిళ్లు ఇదివరకు రెండు కూరలు, పచ్చడి, కమ్మని పెరుగుతో కంచెడు అన్నం లాగించేసే మనిషి రెండు పుల్కాలతో సరిపెట్టుకోవడం... అద్దం ముందు గంటల తరబడి నిలబడి గుప్పెడు వెంట్రుకలు దువ్వుకోవడం మొహాన్ని అటూ ఇటూ మార్చి చూసుకోవడం... ఆయనకి మతిగానీ పోలేదుకదా అనిపిస్తోందావిడకి.ఇదివరకు నిద్రవచ్చేవరకు తనతో పెళ్లినాటి నుంచి కూతురిని అత్తారింటికి పంపే వరకు ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పేమనిషి మూగనోము పట్టినట్టు ‘వయసును దాచే చిట్కాలు’ పుస్తకం పట్టుకుని చదువుతూ అలాగే గుండెల మీద పెట్టుకుని నిద్రపోవడం ఆవిడకి విసుగు తెప్పిస్తోంది. అందుకే ఇవాళ బయటికెళ్తోంటే మొగుడి విషయం అటో ఇటో తేల్చుకోవాలనే నిలదీసిందావిడ.

శంకర్రావుగారు పెళ్లాం ప్రశ్నకి సీమ టపాకాయలా ఎగిరాడు. ‘అడిగావూ అపశకునంలా...! మగాడిని బయట సవాలక్ష పనులుంటాయి. అవన్నీ నీకు చెప్పే చెయ్యాలా?’‘అయ్యోరామ! ఇప్పుడు నేనేమన్నానని అంతకోపం? రిటైర్మెంటుకి దగ్గరవుతున్న కొద్దీ మీ చాదస్తం ఇలా పెరిగిపోతోందేమిటి చెప్మా’ అందావిడ మూతి విరుస్తూ.‘అదిగో... పదే పదే ఆ రిటైర్మెంటు మాటే ఎత్తవద్దంటున్నాను. అక్కడికీ నేనేదో మూడు కాళ్ల ముసలినయిపోయినట్లు దేనికీ పనికి రానట్టు... ఆ మాటలేంటి? అయినా ముందే ఇలా అంటున్నావు. రిటైరయ్యాక ముసుగేసి నన్ను ఓ మూల కూర్చోబెట్టినా ఆశ్చర్యం లేదు’. ఆయనకి కోపం నసాళానికంటింది. ఆవిడకి కళ్లలో నీళ్లు తిరిగాయి. నేరకపోయి ఆ విషయం ఎత్తాను భగవంతుడా అని... ‘ఛ... అవేం మాటలండీ! అయినా మీరెక్కడికెళ్తే నాకెందుకు? మీ కిష్టమయిన చోటికే వెళ్లండి బాబూ!’ఈ మధ్య కాలంలో శంకర్రావు గారు మరో రెండు నెలల్లో రిటైరవబోతున్నారని తెలిసి ఇరుగూ పొరుగూ... స్నేహితులు బంధువులు, కొడుకులు, కూతుళ్లు... కావాలని కాకపోయినా ఏదో సందర్భంగా ఆ ప్రస్తావన తెస్తూండేసరికి ఆయన ఆవేదనతో అతలాకుతలం అయిపోతున్నారు. ఒకరోజు... కొడుకు పద్మనాభం సాయంత్రం ఆఫీసునుంచి వచ్చేటప్పుడే ఆయాసపడుతూ సంచీడు కూరలు మోసుకు తెచ్చాడు. ... ఎప్పుడూ ఆదివారం రైతుబజారుకెళ్లి వారానికి సరిపడా నవనవలాడే కూరలు ఎంచి తేవడం శంకర్రావుగారికి అలవాటేమో.... కొడుకు మీద ఎగిరిపడ్డాడు.