‘‘గుండె గొంతుక లోన కొట్టాడుతాది’’ అంటోంది రేడియోలో ఎంకి. నండూరి వారి ఎంకి ఏమైనా అంటుంది.ఆమె గారి పరిస్థితి అది.కానీ- నా గుండెకు... ఆ అదృష్టం లేదు. ఎందుకంటే... నా గుండె బేలన్సు తప్పి కొట్టుకుంటోంది. డాక్టరుగారు చెప్పిన విషయానికి తన్నుకుంటోంది. కుజదోషంలో వున్న మా అమ్మాయి పెళ్లి విషయంలో కొట్టుకుంటోంది. ఎటొచ్చి అది కొట్టుకుంటోందన్న ఆనందమేకానీ ఎన్నాళ్లు కొట్టు కుంటుందో, ఎప్పుడు కొట్టుకుపోతుందో అన్న భయం వల్ల నా గుండె గుండెలా లేదు. గుండెల్లో కుంపటిలా వుంది.పదిహేను రోజుల క్రితం.పేద్ద బోర్డు, పేద్ద పేరు, అంతకంటే పేద్ద ఫీజు తీసుకునే డాక్టరు గారు చెప్పేశారు.మా ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది.పెళ్లయ్యేదాకా మా నాన్నను కాపాడమని దేవుడికి దండం పెట్టుకుంది... మా అమ్మాయి...ఎందుకు-?ఆపరేషను చేయకపోతే నా గుండె గల శరీరానికి రేషను అుుపోతుందట.‘‘తప్పదా డాక్టర్‌’’.‘‘రక్త నాళాల్లో కొవ్వు చేరింది. బైపాస్‌ తప్పదు’’‘‘చెయ్యకపోతే’’.‘‘చస్తావు’’ అన్నట్లు చూశారు డాక్టరు.‘‘మార్గం లేదా’’‘‘వుంది’’.‘‘ఏమిటది’’‘‘భగవద్గీత చదువుకో’’‘‘ఎందుకు’’‘‘పెద్ద డాక్టరు కాపాడతాడేమో’’‘‘ఆయనెరవు’’‘‘ఇంకెవరు - దేవుడు-’’డాక్టరు గారి పేరు ముళ్లపూడి వెంకటరమణ కాదు, జోకులు పేల్చడానికి.

బాపూ గారి మధ్య తరగతి వాడి కార్టూన్‌ లాంటి నా ముఖం చూస్తే ఎవరైనా జోకులు.. వేస్తారు.‘‘ఎంత ఖర్చయినా ఆపరేషన్‌ చేయించుకోండి’’ ఖర్చు లేని కన్నీళ్లు కారుస్తూ అంది నా భార్య.‘‘నాన్నా’’ అంటూ నా గుండెలను చేతులతో రుద్దింది పెళ్లికాని నా కూతురు... వురఫ్‌ గుండెల మీద కుంపటి.‘‘నా పసుపు కుంకాలకైనా మీరు-’’‘‘పావలా పారేస్తే వచ్చే నీ పసుపు కుంకాల కోసం, లక్షలు తగలేసి ఆపరేషన్‌ చేయించుకు చావాలా’’సిన్మాల్లో భార్యల్లా ఆమె తాళి కళ్ల కద్దుకోలేదు. ఎందుకంటే ఏడుపు ఎక్కువై కన్నీళ్లు తుడుచు కోవడంలో చేతులు ఖాళీగా లేవు కాబట్టి.‘‘అమ్మా ఏడవద్దే. నా కట్నం కోసం దాచిన సొమ్ముందిగా. అది పెట్టి నాన్నకు ఆపరేషను-’’ఏం త్యాగం.ప్రపంచంలోని త్యాగం మొత్తం నా కూతురు శరీరాన్ని ఆక్రమించుకుందా!కానీ - నిజమైన త్యాగం చేసే వారికంటే, త్యాగం రంగు పూసుకుని నటించే వారిని గుర్తించడం చాలా కష్టం.నా కూతురు నటిస్తోందా!అనుమానం అనేది మనిషికి వయసుతో పాటు పెరుగుతుంది.నాకూ అంతేనా! దెబ్బతిన్న గుండెలకు కొత్త గుండెలు రేషను కార్డుల మీద ఇచ్చే రోజులు ఎప్పుడు వస్తాయి.‘‘ఎప్పటికీ రావు’’పార్కులో శీనయ్య సీరియస్‌గా అన్నాడు.శీనయ్యకు ఈ మధ్యనే బైపాస్‌ చేశారు. తన అనుభవాలను చెప్పి ఎదుటివాడి ముందు తన తెలివిని చాలామంది ప్రదర్శిస్తారు. చెప్పేవాడికి వినే వాడు లోకువ.‘‘ఎందుకు ఆలోచన. మూడు లక్షలు పారేస్తే కోసి అవతల పారేస్తార్రా సుబ్బిగా’’