జకరకర పొద్దుపొడిచి సరసర మెట్లమీద పాకుతోంది. ఏడింటికి ఏడు నిమిషాలు తక్కువుంది. ‘సెవెన్‌హిల్స్‌ హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌’ మెట్లను మూడు అంగల్లో ఎక్కేసి యాంత్రికంగా తాళాలు తీశాడు ఓనరు యాదగిరి. అది పెద్దబజారు. రోడ్డు గుండెల మీద జనసంచారం మొదలైంది.ఏడు గుర్రాల రథమ్మీద సూర్యుడెట్లా ఉరుకుతాడో ఏమో... అనుకుంటూ యాదగిరి తన వెంట లోపలికి చొచ్చుకొచ్చిన లేత కిరణాలను తన్మయంగా చూశాడు. ఏడు నిమిషాల్లో షాపునంతా ఊడ్చేసి, అద్దాలు - సీట్లు తుడుస్తుంటే - తానో గ్రాడ్యుయేటుననీ, బ్యాంకు అపతో షాపు ప్రారంభించానని గుర్తుకు రాలేదు. ఐదేళ్ల క్రితం సెవెన్‌హిల్స్‌ సెలూన్‌ను ఐదు సీట్లతో రంగరంగ వైభోగంగా ప్రారంభించాలనుకున్నాడు. కాని... అపరిమితమైన స్థలాభావం, పరిమితమైన ఆర్ధిక వనరులు ఎదురునిలిచి నాలుగు సీట్లతో సరిపెట్టుకొమ్మన్నాయి. రాజీ జీవితానికి రంది లేదన్నారు గదా!నలుగురు పనివాళ్లు, తోడుగా తాను.. నాలుగేళ్లలో బ్యాంకు అప తీరిపోయింది. కలిసొచ్చే అదృష్టానికి నడిచొచ్చే కొడుకు పుడతాడట... అంతా పైవాడి దయ. లేకపోతే.. ఉద్యోగం కోసం ఊరూరా తిరిగితే దొరికేదా! దొరికినా ‘గొర్రెతోక బెత్తెడే’ అన్నట్టు జానెడు జీతంతో మూరెడు జీవితం గడపాలి... బానిస బతుకులో ఎన్నో బాధలుంటాయిగోడగడియారం ఏడు గంటలు కొట్టింది.‘‘ఏం యాదగిరీ! పప్పన్నం ఎపడు పెట్టిస్తున్నవటా!’’ పాతగిరాకీదారు లోపలికొచ్చాడు. పెరిగిన గెడ్డాన్ని చూపిస్తూ అద్దం ముందు కుర్చీలో కూచున్నాడు.‘‘ఎపడంటే అపడే సార్‌. అయినా... నాకు నచ్చిన అమ్మాయి దొరకాలె గదా సార్‌!’’ నల్లని మీసంకట్టు కింద సన్నని చిరునవ్వు మెరిసింది. మెత్తని బ్రష్‌ గిరాకీదారు గెడ్డానికి చకచకా క్రీము దట్టిస్తోంది.

 అద్దంలోనే యాదగిరిని చూస్తూ‘‘అవునవును. పెళ్లంటే నూరేళ్ల పంటగదా! నీ వయసు పాతికేళ్లేగదా... పసందైన అమ్మాయినే చేస్కో’’ సర్దుక్కూచున్నాడు.మరో ఇద్దరు గిరాకీదారులొచ్చి వెయిటింగ్‌ బెంచీ మీద కూచున్నారు. ఒకరు దినపత్రిక, మరొకరు వారపత్రిక తిరగేస్తున్నారు. మధ్యలో సరదా కబుర్లు...ఎనిమిదికల్లా ముగ్గురు పనివాళ్లొచ్చారు. ఇంకొకరు రావాలి. ఆప్యాయత, స్నేహగుణం పనివాళ్లను అజమాయిషీ చేస్తాయని యాదగిరి నమ్మకం. విసుగూ విరామం లేకుండా తాను పనిచేస్తూ వాళ్లతో పనిచేయించడం అలవాటైంది. లోకాభిరామాయణానికి జోకాభిరామాయణం జోడించి గిరాకీదార్లకు మనోల్లాసం కలిగించడం అతని ఆప్యాయత.... అదొక హాబీ.