‘‘అబ్బా... ఈ హరిత ఇంకా రాదేం?’’ ఎంతసేపట్నుంచో మనసులో రేగుతున్న తహ తహ పెదాల గడియతోసుకొని బైటకు రానే వొచ్చింది.ఎంతదూరం పిట్టిగుంట? వడిగా అడుగులేస్తే ఇరవై నిమిషాలు. టైంకి బయల్దేరి వుంటే ఈ పాటికి ఎప్పుడో రావాల్సింది.ఈరోజు కూడా రాదేమో... ఇంట్లో ఏమన్నా పనుందేమో...వస్తూ దారి మధ్యలో కాని ఉందా? ఎంతదూరం వచ్చుంటుంది? సగిలేరు దాటి ఉండదూ?....ఉండబట్టలేక ఆఫీస్‌రూమ్‌ లోంచి బైటికొచ్చా. చూపు అప్రయత్నంగా గేటు వైపు మళ్ళింది. తన రాకను తెలిపే సూచన ఏదీ గోచరమవలేదు.చెవులు సుపరిచితమైన ఆ సైకిల్‌ బెల్‌ కోసం శోధించాయి.గాల్లో ఏ గణగణలూ తేలి రాలేదు.అలా గేటుదాకా వెళ్ళి రోడ్డు చివరికంటా చూద్దామా - అన్న కోరికను బలవంతంగా అణచుకొంటూ గ్రౌండ్‌లోకి నడిచాను.వేసవి సెలవులు ముగిసి రెండు రోజులవుతోంది. క్లాసుల రొటీన్‌ మొదలవడానికి ఇంకో రెండు రోజులు పట్టేట్టుంది.తరగతులన్నీ కోలాహలంగా ఉన్నాయ్‌. పిల్లల మొహాల్లో పొంగి పొరలుతూ కొత్త క్లాసుల ఆనందం, వాళ్ళ బ్యాగుల్లోంచి ఉబికుబికి వస్తూ కొత్త పుస్తకాల పరిమళం....అటు తిరిగి ఇటు తిరిగి ఆఫీస్‌లోకే వచ్చి నిన్నటి పేపర్నే మల్లొకసారి అందుకున్నా. పేపర్‌కాస్త వణికినట్లనిపించింది. ‘నలిపింది చాల్లేదా సామీ’ అన్నట్లు దీనంగా చూసింది.జిల్లా ఎడిషన్‌ నిండా అభినందనల వెల్లువ. చిన్నప్ప తడిసి ముద్దై పోయుంటాడేమో....ఇలాంటి సాహితీమూర్తులు పుట్టినగడ్డకు వన్నె తెస్తారని పెద్దల పొగడ్తలు, రచయితల్లో చిన్నప్పది ప్రత్యేక గొంతు అని సాహిత్య విమర్శకులు, అలాంటి వాడు మా వాడు కావడం గర్వకారణమని ఉపాధ్యాయ లోకం...బాగా అసూయ కలిగింది.

 జారగిలబడి కళ్ళు మూసుకొని అతని స్థానంలో నన్ను ఊహించుకునే ప్రయత్నం చేశాను ‘గ్లోబల్‌ తెలుగు అసోసియేషన్‌’ నవలల పోటీలో నాకే లక్ష రూపాయల బహుమతి వచ్చినట్లు, రవీంద్రభారతిలో, కళాక్షేత్రంలో నాకే సన్మానాలు జరుగుతున్నట్టు, తోటి రచయితల్నుండి, అభిమానుల్నుండి అసంఖ్యాకంగా అభినందన సందేశాలు అందుతున్నట్లూ....ఊహూఁ.... సాధ్యం కాలేదు.అంతఇదిగా ఊహించడానిక్కూడా చేతగాకుండా ఉంది. అలాంటి గొప్ప రచయిత అవ్వాలంటే ఎన్నో అర్హతలుండాలనిపిస్తోంది.ఎంతో కమిట్‌మెంట్‌, ఎంతో పరిశీలన, ఎంతో అధ్యయనం, ఎంతో సామాజిక స్పృహ, ఎంతో సృజనశీలత, మరెంతో గొప్ప హృదయం....ప్చ్‌... వాటన్నిట్లోనూ నాదింకా విద్యార్థి దశే....ఇలా ఇంకెన్నాళ్ళు సాహిత్యాభిమానిగా పాతుకొని ఉండిపోవాలో... లోపల్నుంచి ఏదో ఆక్రోశం....వీల్లేదు. పెంకుగట్టిన ఈ నిస్తేజాన్ని పగుల గొట్టుకొని పిల్లగానైనా బైట పడాలి. చిన్నదో చితకదో ఏదో ఒక కథ రాసి యువ రచయితల జాబితాలో అర్జంటుగా చేరిపోవాలి.అందుకు నాకొక తోడ్పాటుకావాలి. ఒక మార్గదర్శి దొరకాలి. కాసింత ‘గురుత్వం‘ చేయూతనందించాలి.అదెవరో కాదు. చిన్నప్పే. తను నాకు గొంతెత్తి, పిలిస్తే పలికేంత దగ్గర్లోనే ఉన్నాడు.