ఉదయం ఎనిమిది గంటలయింది.బస్టాండు రద్దీగా వుంది.కొన్ని బస్సులు అపడే వచ్చినందువల్ల ప్రయాణీకులు హడావిడిగా ఎక్కుతున్నారు.కొన్ని బస్సులు బయల్దేరేందుకు సిద్ధమవుతూ వున్నాయి.ఎంతకీరాని బస్సులకోసం ప్లాట్‌ఫాం మీద ఎదురుచూస్తున్న జనం దిక్కుతోచక అటూఇటూ తిరుగుతూ వున్నారు. వాళ్లలో చెంగావి రంగు చీరలో అదేరంగు జాకెట్టు వేసుకొని వున్న ఆవిడ పేరు కళ్యాణి. ఆమె మొహంలో కొంచెం విసుగు కనబడుతూ వుంది. మాటిమాటికీ వాచీని చూసుకుంటూ వుంది.ఆమె కొత్తపల్లి బస్సుకోసం ఎదురుచూస్తూ వుంది. ఈమధ్యనే ఆమె తూర్పుగోదావరి జిల్లా నుంచి అనంతపురం జిల్లాకు బదిలీ చేయించుకుని వచ్చింది. ఇపడు కొత్తపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్లో సోషల్‌ అసిస్టెంట్‌గా చేరడానికి వెళుతోంది.‘‘మొదటిరోజు కదా. నేనూ వస్తాను పద!’’ అన్నాడు తన భర్త పొద్దున. అతను మునిసిపల్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్లో టీచరు.‘‘ఎందుకు ప్రసాద్‌! నాకేం భయమా? ఇప్పటికే పది సెలవులు వాడేశావు. మళ్లీ ఇపడు సెలవు ఎందుకు పెట్టాలి?’’ అంటూ వారించింది తను.

‘‘నీకు ఉద్యోగం కొత్త కాకు న్నా, ఇక్కడి మనుషులూ, పరిసరాలు కొత్తకదా కళ్యాణీ!’’అన్నాడు ప్రసాద్‌.‘‘నేనేం దేశంకాని దేశానికి వెళ్ళడం లేదుగా! మా రాజమండ్రి అయినా ఈ అనంతపురమయినా తెలుగు ప్రాంతాలేగా! హాయిగా వెళ్తాను. అందులోనూ అలా కొత్త ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లాలన్నా, కొత్త వ్యక్తుల్ని కలవాలన్నా, వాళ్లతో పరిచయం చేసుకోవాలన్నా చాలా థ్రిల్‌గా వుంటుంది. నువ్వు వచ్చావనుకో, దాన్ని నేను మిస్‌ అవుతాను’’ అంది తను.‘‘నువ్వు ఎవరి మాటా వినవు కదా!’’ అన్నాడు ప్రసాద్‌ నవ్వుతూనే.‘‘నిజమే వినను. అలా వినేటట్టయితే మా జిల్లాలోనే నాకు బోలెడు సంబంధాలు వచ్చా యి. పెద్దపెద్ద ఉద్యోగాలు చేసేవాళ్లే అంతా. నేనొపకున్నానా? లేదే. మా చిన్నాన్న అనంతపురం నుంచీ మీ సంబంధం తెచ్చారు. నువ్వు నచ్చావు. ఒప్పేసుకున్నాను’’ అంది తనూ నవ్వుతూ.‘‘ఓకే అట్లనే కానీండి కళ్యాణి గారూ! బాగా థ్రిల్‌ ఫీల్‌కాండి!’’ అన్నాడు తన నెత్తిమీద సున్నితంగా మొట్టికాయ వేస్తూ.‘‘అదిగో కొత్తపల్లి బస్సు వచ్చింది’’ అని ఎవరో అంటే చూసింది కళ్యాణి.ఆలస్యం చేయకుండా బస్సులోకి ఎక్కి కిటికీ పక్కగా కూచుంది. దాదాపు ఇరవైమంది ప్రయాణీకులు ఎక్కారు.ఒకావిడ పక్కనే కూచుంది. వయసు నలభై ఏళ్లు వుండవచ్చు. మాసి వున్న ముదురాకుపచ్చ చీర కట్టుకుని, రంగు వెలసిన పసుపుపచ్చ రవిక వేసుకుని వుంది. చీరకు అక్కడక్కడా చిరుగులు కన్పిస్తూ వున్నాయి. మనిషి నల్లగా ఉంది. నుదుటి మీద కుంకుమ బొట్టు లేదు. రెండు మూడు రోజుల కిందట దువ్విన జుట్టు కొంత చింపిరిగా కన్పిస్తూ వుంది. కళ్యాణి ఒక్కసారి ఆమెను చూసింది. కూలీపనికి గానూ ఎక్కడికయినా వెళుతోందేమో అనుకుంది.