పావురాలు గుంపుగా వచ్చి బియ్యం లారీపై వాలుతూ ఉంటే - నింగి నుండి నీలిమేఘం నిదానంగా కిందికి దిగుతున్నట్లుగా ఉంది. ఆ లారీ పిఠాపురం రోడ్డు మీద నుండి కాకినాడ సిటీ వైపు వెళుతోంది. అది చూసి ‘నాక్కూడా రెక్కలుంటే ఎంత బావున్ను. ఓ పూటకి సరిపడా గింజల్ని మూటకట్టుకొని వచ్చేవోన్నీ’ అనుకున్నాడు చంటి.ఏళ్ల తరబడి వాడి శరీరంలో ఎదుగుదల లేకపోవడంతో, వాడికప్పుడే పదమూడేళ్లు నిండాయంటే - నమ్మడం కష్టమే! రాగిరంగులోకి మారిన జుట్టూ, గరుకుతేలిన చర్మం, ఎండి బీటలు వారిన పెదాలు, టీ మరకలతో అట్టలు కట్టిన నిక్కరూ, చొక్కాతో - కొత్త బంగళా ముందు నిలబెట్టిన దిష్టిబొమ్మలా ఉన్నాడు వాడు.నాగమల్లి తోట పరిసరాలలో రోజూ టీ అమ్ముకుంటూ కనిపించే చంటిని చూసిన అక్కడి కూలీలంతా - వాడు పుట్టినపుడే చేతిలో టీ - ప్లాస్కుతో పుట్టి ఉంటాడనుకుంటారు. ‘చింగల్‌ టీ’ పేరుతో చిన్ని చిన్ని ప్లాస్టిక్‌ గ్లాసులలో వాడు నింపేది ఉషారేనని వాళ్ళ నమ్మకం. అమాయకంగా ఉండే వాడి మొహం చూస్తే - టీ తాగే అలవాటు లేనివాడికైనా, ఓ కప్పు టీ తాగి, వాడి చేతిలో ఇన్ని చిల్లర డబ్బులు పెట్టాలనిపిస్తుంది.అలవాటు ప్రకారం వాడి కళ్లు గిడ్డంగి వైపు దారితీసేయి. కుడి చేతిలోంచి ఫ్లాస్కుని ఎడంచేతిలోకి మార్చుకున్నాడు. ఎండ చుర్రుమంటోందంటే- పదిగంటలు దాటే ఉంటుందనిపించింది. ‘పొద్దిటే గిడ్డంగిలో కెళ్లిన లారీల్లోని మూటలన్నీ దింపేసి, ఈపాటికల్లా మేస్తిరిలంతా బయటకొచ్చేసుంటారు’ అనుకున్నాడు.

గిడ్డంగి - ప్రహారీ గోడ నానుకుని నడుస్తూ ఉంటే, ఉచ్చల కంపుతో వాడి ముక్కుపుటాలదిరిపోతున్నాయి. పాల సైకిళ్లతో, పళ్ల సైకిళ్లతో, టిఫిన్ల సైకళ్లతో, తోపుడు బళ్లతో, అడ్డా కూలీలతో ఆ రోడ్డంతా గజిబిజిగా ఉంది.చంటి గిడ్డంగి దగ్గరకి చేరుకునే సరికి - ఫుల్‌లోడ్‌తో ఉన్న అయిదారు లారీలు వరసగా మెయిన్‌గేటు ముందు ఆగి ఉన్నాయి. వాటిని చూడగానే మంచి గిరాకీ దొరుకుతుందన్న ఆశ చంటి కళ్లలో మెదిలింది.చంటి నెమ్మదిగా మెయిన్‌ గేటు దగ్గర నిలబడిన వాచ్‌మెన్‌ సూర్యారావు దగ్గరకి వెళ్లేడు. అప్పటికే ఏడుపదుల జీవితం - రోడ్డు రోలరులా అతనిపై నుండి నడుచుకుని పోవడంతో, సూర్యారావు బాగా ఒడిలిపోయేడు. అతని ముఖం - ఏళ్ల తరబడి వర్షాలు కురవక, బీటలు వారిన బీడుభూమిలా ఉంది. తన వాళ్లంటూ ఎవరూ లేకపోవడంతో, అతనక్కడే ఉన్న సెక్యూరిటీ రూమ్‌లో ఇంత ఉడకబెట్టుకుని తింటుంటాడు.‘‘సూర్రావు తాతా! ఓ చింగల్‌ టీ ఏసేవంటే - మహేష్‌బాబులా టెప్పులేసేత్తావు తెలుసా! డొబ్బులొద్దులే!’’ అన్నాడు చంటి.