‘‘ఎక్కడికెళ్లారు ఇంతసేపూ?’’ఉరిమినట్లు వినిపించింది ఊర్మిళ గొంతు తలుపు తీస్తూ.పిల్లిలా అడుగుపెట్టబోతున్న భాస్కరం ఉలిక్కిపడ్డాడు.అనుకున్నంతా అయ్యింది. ఎంత శబ్దం చెయ్యకుండా వచ్చి పడుకుందామనుకున్నా కుదరలేదు. ఊర్మిళవి పాము చెవులు. అక్కడికీ ప్రొద్దున అమ్మకి చెప్పి వెళ్లాడు. హాల్లోపడుకుని, తను రాగానే తలుపు తీయమని చెప్పాడు. కానీఈవిడెలా ఎదురయ్యిందో?తన పిచ్చిగానీ, తననే నిలువనియ్యదు. అల్లాంటిది గంగిగోవులాంటి అమ్మ ఒక లెక్కా? అమ్మ హాల్లోపడుకోబోయినప్పుడే గ్రహించి వుంటుంది. అమ్మని కూడా ఏదోఅనే వుంటుంది. పాపం అమ్మ.‘‘మాట్లాడరేం? పిల్లల పరీక్షలు తొందరగా రమ్మని చెప్పానా? షికార్లు తగ్గించుకోమన్నానా? అయినా లెక్కలేదన్నమాట. స్టీరియోఫోనిక్‌ సౌండ్‌తో వీధరుగు మీద నుంచొని అడుగుతోంది.సభ్యత కోసం ఎవరూ బయటకి రాకున్నా, ఆ నిశ్శబ్ద వేళ ఆ మాటలు అందరికీ వినిపిస్తూనే వుంటాయని తనని గురించి అందరూ నవ్వుకోవడమో లేక జాలి పడడమో చేస్తుంటారని కూడా తెలుసు. కానీ ఏం చేస్తాడు? ‘‘పూజ కొద్దీ పురుషుడు’’ అన్న వాళ్లున్నారు కానీ, ‘‘పుణ్యం కొద్దీ పెళ్లాం’’ అని ఎవరూ అనలేదు కదా!‘‘లోపలకి రండి. ఎందుకా కొంగజపం?’’ మరోసారి ఉరుముతూ లోపలకి వచ్చింది.

‘‘అమ్మయ్య!’’ అనుకుంటూ లోపలకి వచ్చాడు భాస్కరం. కానీ ఇంతలోనే....‘‘నేను ఇంత అడిగినా మాట్లాడరేం? ఇంత సేపూ ఎక్కడ ఊరేగారు?’’ అంది మళ్లీ.‘‘ఆఫీసులోనే ఉన్నాను. పని..’’ అన్నాడు లోగొంతుకతో. భాస్కరానికి చిన్నగా మాట్లాడడం ఎంత అలవాటో, ఎంత ఇష్టమో....అంతకు పూర్తి వ్యతిరేకం ఊర్మిళ.‘‘నిజంగానేనా? నేనొక్కదాన్నే ఛావాలా అన్నీటికీ. ఇంటి పని, పిల్లల చదువులూ అన్నీ నా బాధ్యతలేనా?’’ ఆఫీసులో ఉన్నాననగానే కొంచెం శాంతించి, కంచం పెట్టింది. అయినా కొంచెం విసురుగానే.‘‘నే తింటాలే. అన్నీ ఇక్కడే వున్నాయిగా’’ అన్నాడు సాధ్యమైనంత మెల్లిగా. తల్లికి వినిపిస్తే అతో బాధ. ఆవిడ ఓర్చుకో లేక చిన్న మాట, ‘‘మగాడు, ఇంటికి రాగానే ఎందుకమ్మా‘‘అంటుంది అంతే.... అయిపోయిందే. ఇలా బాధ్యత లేకుండా పెంచినందుకు ఆవిడని నానా మాటలు అంటుంది. కన్న ప్రేమ వల్లా, భాస్కరం నెమ్మదితనం, మెతకతనం తెలియడం వల్ల తల్లి ఎప్పుడైనా అలా అంటుంది. ఆవిడకి భర్తని ఎదిరించడం అనేది మింగుడు పడని విషయం. అత్యంత ఆశ్చర్యకరం. ఇదైతే బాధాకరం కూడా.‘‘నువ్వెళ్లి పడుకో’’ అన్నాడు గొడవ అంతటితో సద్దుమణుగుతున్నందుకు ఆనందిస్తూ. ఖర్మ...దీని పేరు ఊర్మిళే గానీ, దీనికి నిద్రే రాదు. ఇంట్లో అందరూ పడుకున్నాకే దానికి నిద్ర వస్తుంది.‘‘ఇదేమిటి? రాత్రి అన్ని అబద్ధాలు చెప్పారు’’ ఇంకా నిద్ర మంచం మీంచి లేవలేదు భాస్కరం. ఉరుముల్లాంటి మాటలతో బలవంతంగా కళ్లు తెరిచాడు.ఇంటర్‌పోల్‌ ఏజెంటులా చేతిలో పేపరుతో గుడ్లురిమి చూస్తోంది.