ఎండిపోయిన మాని మొజ్జు మీద లక్ష్యం రెక్కలల్లాడిస్తోంది. విలుకాడు విల్లుని సంధించాడు. నారిని మరింత బలంగా తనవైపుకి లాగి లక్ష్య దూరాన్ని అంచనా వేసేడు. దగ్గర్లోనే ఉంది.మబ్బు పట్టిన ఆకాశం... స్తంభించిన గాలి... ఊపిరాడనట్టు ఉక్కపోత. శిలావిగ్రహాల్లా చెట్లు, గుబురులో ఒకే ఒక ఆకు మాత్రం అదే పనిగా రెపరెపలాడుతోంది పిచ్చిపట్టినట్టు.విలుకాడి నుదుటి మీది చెమట బొట్టు ఎడమ కన్ను ప్రక్కగా చెంపమీదికి జారింది. అతని వెనుక చెట్టుకొమ్మ ఉయ్యాల్లోని పాప తల బయటికి పెట్టి విలుకాడి చేతులమీంచి లక్ష్యం వైపు చూస్తోంది.నిశ్శబ్దాన్ని నిండుకుండలో మోస్తున్నట్టు... అడవి.విలుకాడి చేతిలోంచి శిలకోల దూసుకుపోయింది. లక్ష్యం ఎగిరిపోయింది. శిలకోల ‘జువ్వ్‌వ్‌’ మని శబ్దం చేస్తూ మాని మొజ్జు మొదలుకి గుచ్చుకొంది. పిచ్చిపట్టిన ఆకు ఆగిపోయింది... వెక్కిరిస్తున్నట్టు.విలుకాడు నిర్ఘాంతపోయేడు. ఎగిరిపోతున్న లక్ష్యంవైపు బేలగా చూస్తూ...తప్పకూడని గురి... తప్పింది.విల్లు సంధించడానికీ, లక్ష్యం ఎగిరిపోవడానికీ నడుమ ఏదో జరిగింది. ఏమిటదీ?సమాధానంగా... విలుకాడి మొలలోంచి‘పంచదార కొమ్మా కొమ్మా... పట్టుకోవద్దనకమ్మా..’ సెల్‌ఫోన్‌ మోగుతోంది.విలుకాడి కంటే ముందే ప్రమాదాన్ని పసిగట్టిందేమో... లక్ష్యం తప్పించుకుంది.‘‘డాడీ... ఫోన్‌’’ అనడంతో ఈ లోకంలోకి వచ్చేడు సత్యం. జేబులో ఫోన్‌ రింగవుతోంది. ‘అంటే ఇంతదాకా మోగింది తన జేబులోంచా? మరి...ఓహ్‌... కలా...?నిజమే... గురి తప్పిన విలుకాడు.‘‘ఎక్కడున్నారు? పాపేమైనా అల్లరి చేస్తోందా?’’ శ్రీమతి అడుగుతోంది.‘‘లేదు, లేదు... ఇంకా అరగంట దూరంలో ఉన్నాం’’ సత్యం ఫోన్‌ పెట్టేసాడు.

బస్‌ వేగంగా కదులుతోంది. ఒక్కసారిగా గాలి తీవ్రత పెరిగింది. తేడా గమనించేడు సత్యం. కురుపాం దాటాక గాలి చల్లబడిపోతుంది. అంటే ఏజెన్సీలోకి ప్రవేశించామన్నమాటే. అంతదాకా కనపడని చెట్లూ... కొమ్మలు... తుప్పా... డొంకా... కొండా... కోనా... అన్నీ ఎదురై పలకరిస్తాయి. రోడ్డు సన్నబడిపోతుంది. కిటికీలోంచి కొమ్మలు, రెమ్మలు ముఖానికి తగులుతూ... ‘నీకోసమే... ఎదురుచూస్తున్నా’మన్నట్టుంటాయి.ఆ గాలి... పాతదే...ఆ చలి... పరిచయమైందే.కొత్తగా స్పృశిస్తూ... చెట్లూ... కొండలూ... వెనక్కి కదులుతున్నాయి.... వేగంగా... వెనక్కి.... వెనక్కి... వెనక్కి... కళ్ళముందే కన్నతండ్రి మంగులు కన్నుమూసినప్పటికి...

‘‘ఒరే మంగులూ... రేపు తెల్లార గట్ట లెగాల... బండి పుయ్యాల’’ ఇంటి మెట్లెక్కుతూ చెప్పేడు షావుకారి.