ఒకప్పుడు అంతర్లీనంగా నాకు చాలా కోరికలుండేవి. వాటన్నింటిలో గుర్తింపు కోసం తాపత్రయపడడం ఎక్కువైంది (దీన్నే ఐడెంటిటీ క్రైసిస్‌ అంటారట). ఈ తపన తీర్చుకోవడానికి పనీపాటా లేకుండా ఇంట్లో వాళ్ల సంపాదనపై బతుకుతూ ఫోజులు కొట్టే ఆవారాగాళ్లను నా చుట్టూ తిప్పుకోవడం ప్రారంభించాను. నా దగ్గర కాస్త డబ్బుండడంతో వాళ్లూ నన్ను లీడర్‌గా యాక్సెప్ట్‌ చేశారు.మా ఊళ్లో నేను ఒక మోస్తరు గుర్తింపు(???) తెచ్చుకుంటున్న రోజులవి. ఆయితే నాకు పోటీగా ఊళ్లో మరో లీడర్‌ పుట్టుకొచ్చాడు. నాదగ్గర డబ్బుంటే, వాడి దగ్గర బలముంది. నేను డబ్బులు ఖర్చు పెట్టి గౌరవం పొందుతుంటే, వాడు కాణీ ఖర్చు లేకుండా దౌర్జన్యంతో మర్యాదలందుకుంటున్నాడు. జనాలకి డబ్బు అవసరమే కానీ, దానికన్నా ప్రాణాలపై తీపి చాలా గొప్పదని అర్ధమైంది. చెప్పొద్దూ, నాకు చాలా అసూయగా ఉంది. ఊర్లో నాకొక్కడికే గుర్తింపు ఉండాలి. అందుకు ఏం చేయాలా? అని ఒకటే ఆలోచ న.... వాడితో రాజీ చేసుకుందామనిపించింది. అయితే దాని వల్ల నాకు దక్కేదేంటి?? మరి ఎలా? నాలో వివేకం నశించింది. వాణ్ని లేపేస్తేనే నాకు మనుగడ అని డిసైడయ్యా. మనసులో ఎక్కడో ఇదేంటి మృగంలా మారుతున్నాను అనిపించింది. అయితే గుర్తింపు లేనప్పుడు మనిషిగా ఉంటే ఏంటి? మృగంలా మరితే ఏంటి? అనుకొని వాణ్ణి తప్పించాలని నిర్ణయించుకున్నా.... 

అయితే వేరెవరితోనో వాణ్ణి లేపిస్తే నేననుకున్న ప్రయోజనం ఉండదు. ఎవరో వాణ్ని చంపితే, చంపినోడిని చూసే జనాలు భయపడతారు కానీ, నాకెందుకు జైకొడతారు. ఓకె. మరి నేనే చంపితే... వామ్మో! నాకంత సీన్‌ లేదని నాకు తెలుసు (కాకపోతే బయటకు తెలియకుండా జాగ్రత్త పడతాను). వాడు సామాన్యుడు కాడు, నన్ను, నాలాంటోడిని ఇంకొకడిని కలిపి చంపేలా ఉంటాడు. మనం ఫిజికల్‌గా వీక్‌. ఇంత వీక్‌ అయితే ఈ కోరికలెందుకు అని అడగొచ్చు. బలవంతుడికి నిరూపించుకోవాల్సిన పనిలేదు. నాలాంటోడికే గుర్తింపు తపన ఎక్కువ.సరే. ఏం చేద్దాం..... మళ్లీ ఆలోచనలు. నాకు కుడిభుజం అని నేననుకునే నా స్నేహితుడొకడితో చర్చించా. ‘‘అన్నా, కిరాయి మనుషులతో చంపిద్దాం, ఆ సమయంలో మనం కూడా అక్కడ ఉండేలా చూసుకుందాం. వాడు చస్తే బయటికొద్దాం, లేదంటే అట్నించటే పారిపోదాం’’ అన్నాడు వాడు. ఈ ప్లాన్‌ నచ్చింది. కాకుంటే ప్లాన్‌ ఎంతవరకు వర్కవుటవుద్దని కాస్త టెన్షన్‌ ఉంది. మనుష్యుల్ని మావాడే ఏర్పాటు చేశాడు. మీరు నమ్మరు కానీ, వాళ్లను చూసాక కిరాయి హంతకులంటే నాకున్న అభిప్రాయం మారిపోయింది. వాళ్లలో ఒకడికి 16-17 ఏళ్లుంటాయి. ‘‘అరే, నీవెందుకువచ్చావురా’’ అని అడిగా. ‘‘జైలుకెళ్లి వస్తే మనమంటే జనాల్లో భయం పెరిగిద్ది’’ అన్నాడు. శభాష్‌, చిన్నవయసులోనే ఐడెంటిటీ క్రైసిస్‌.... కానీ వీడేం మర్డర్‌ చేయగలడు?? నాకు డౌటే....