నాఇద్దేబ్బేసము మొత్తంలో నాకు ఖనాకష్టం అన్పించిన తర్గతి మేత్తీస్‌ అయ్యోరు తర్గతి. ఈ అయ్యోరంటే బళ్ళోండే పిలకాయల్కందరికీ అడల్‌. ఈయన తన్నే తన్నులు, ఇచ్చే సిచ్చలు అంత భయానకంగా వుంటాయి. చింత మెల్లెల్తో తన్నడం మొదలెడ్తే ఈనాతి ఈనం అయిదు, ఆరు దెబ్బల్కి తక్కువ తన్నడు.గుంజిల్లు పది, ఇరవైకి తక్కువ తీనీడు. ఇంక గోడకుర్చీలు, మోకాళ్ళమీద నడ్పించడాలు అబ్బో ఒహటి కాదులెండి, జెవిన్లల్లో ఖయిదీలకి ఆ మాదిరిగా సిచ్చలేత్తారని మా బల్లో పిలకాయలు అన్కుంటుంటారు. ఏమాటకామాటే చెపకోవాలి, పిలకాయల్కి బాగా సదువొచ్చేది కూడా ఆ తర్గతిలోనేనంట. నేను మేత్తీస్‌ అయ్యోరు తర్గతి కెళ్తుండానని అయిదు సదివే నా యక్క చుగాబిని నాకు శానాశానా జాగ్గర్తలు చెప్పింది.ఓ పొడుగాటి రేకుల షెడ్‌లో సాయిబులయ్యోరమ్మ తర్గతి, ఆ పక్కనే మేత్తీస్‌ అయ్యోరు తర్గతి, ఆ పక్కనే శారమ్మయ్యో రమ్మ తర్గతి వర్సనే వుంటాయి. ఈ షెడ్డును ఆనుకుని ఉన్న గదిలోనే గుడ్డి వంట్రాజు బళ్ళో పిలకాయల్కి మద్దేనం అన్నం వండుతుంటాడు. 

ఈ షెడ్‌లో వున్న తర్గతులలో చదివే పిలకాయల్కి కూర్సునే దానికి ముడ్డికింద ఏమీ వుండవు. వట్టి గచ్చుమీదనే కూర్చోవాలి. నా మట్టుకు నాకు గచ్చుమీద కూర్సున్నంత సవుక్కిరంగా మళ్ళీ ఆ పై తర్గతుల్లో బెంచీల మీద కుర్సున్నపడు లేదు. బెంచీల మీదంటే ఒకే తీర్గ కూర్సోవాల. అదే గచ్చుమీదైతే మనిట్టం ఎట్టాగైనా కూర్సోవచ్చు. కావలిస్తే పండుకోవచ్చు కూడా. నేనైతే మా అయ్యోరట్ట కునుకు తీస్తానే నేలమీద ఎల్లకిలా పడుకొని కాలుమీద కాలేస్కొని, నెత్తికింద చేతుల్బెట్టుకుని, రేకుల కింద గూడు పెట్కున్న పిచ్చుకలెంక చూస్తా వుంటా. ఒకేళ మా అయ్యోరు చెప్పే పాటం నచ్చలేదనుకోండి, ఆ పక్కనున్న శారమ్మయ్యోరమ్మ చెప్పే పాటమో లేకపోతే ఈ పక్కనున్న సాయిబులయ్యోరమ్మ ఆడ్పించే ఆటలో చూత్తూ నేను ఆ తర్గతులు సదివిన రోజుల్ని గెవనం జేస్కుంటా వుంటా. ఇసుగొచ్చిందనుకోండి, పైకిలేచి, చెయ్యి నా మొహం వరకు లేపి, మా మేత్తీస్‌ అయ్యోరు చూచేటట్టు ఒక్కేలో, రెండేళ్ళో పైకి లేచి నిల్చుంటా. అపడు అయ్యోరు నన్ను బయటికెళ్ళమంటాడు. ఇట్టాగా నేను రోజుకి అయిదారుసార్లు బయటికెళ్ళి అటు, ఇటు తిరిగి, వచ్చేటపడు వంట్రాజును ఎచ్చరించుకొని వత్తా వుంటా.