‘‘గోల్డ్‌ లోను తీసుకోవడానికికొచ్చిందెవరు?’’బ్యాంకులో ప్యూను పెద్దగా అరిచేసరికి పరువుపోయినట్లు ఫీలయ్యాను. వేగంగా లేచి ఎవరైనా తెలిసిన వాళ్లున్నారేమోనని,చుట్టూ చూసి, ధబాల్న మెడలో వున్నచెయిన్‌ అయిష్టంగా తీసి, అరచేతిలోపట్టుకుని మెల్లగా మేనేజరుగదిలోకి నడిచాను.తలుపు తీసిన శబ్దం విని ‘ఎస్‌’ అని తలెత్తిన మేనేజర్ని చూసి నోట మాట రాలేదు. యూనివర్శిటిలో నా క్లాస్‌మేట్‌ దివ్య. కళ్లు నమ్మలేని నిజాన్ని చూస్తున్నట్లు రెప్పవాల్చడం మరిచి పోయాను. నా కాళ్లు కొద్దిగా తడబడ్డాయి.‘‘భూమి గుండ్రంగా వుందంటారు. కానీ.... మరీ ఇంత చిన్నదా?’’ అనుకున్నాను. ఇంత త్వరగా ఆమెని కలుస్తానని అనుకోలేదు.పెళ్లికి ముందు దివ్య రాసిన చివరి ఉత్తరంలో...‘‘భూమి గుండ్రంగా వుంటుంది భాస్కర్‌! మళ్లీ మనం తప్పక కలుస్తాం. ఆ నమ్మకం నాకుంది’’ అన్నది.భూమి గుండ్రంగా వుంటుందన్న విషయం ఈ విధంగా నిరూపించబడనక్కర్లేదనిపించింది.ఎవరో అనుకొని కాస్త ఆలస్యంగా తెలెత్తిన దివ్య నన్ను చూసిన ఆశ్చర్యంలో సీట్లో నుంచి లేచి నిలుచుంది. ఆమె నోటి నుంచి మాట రాలేదు. ప్రయత్నం మీద ‘భాస్కర్‌....’ అంది పొడిగా....నాకూ నోటి నుంచి మాట పెగలడం లేదు.కాలింగ్‌ బెల్‌ శబ్దమవడంతో ‘కూచో భాస్కర్‌’ అని, వచ్చిన వాళ్లని పంపించింది.నేనింకా ఏదో భ్రమలోనే ఉన్నట్టుగానే అనుకుంటూ, ఆమె ఎదురుగా వున్న కుర్చీలో కూచున్నాను.

‘‘దివ్యా! నువ్విక్కడే.. వుంటున్నావా?’’ అన్నాను.‘‘లేదు... ఈ బ్రాంచి మేనేజరు పదిరోజుల లీవులో వెళ్లాడు. డిప్యూటేషన్‌ మీద వేశారు నన్ను. మళ్లీ ఇంత త్వరగా నిన్ను కలుస్తానని అనుకోలేదు. ఈజ్‌ ఇట్‌ రియల్‌?’’అంది కూచుంటూ.‘‘నాకూ నమ్మశక్యంగా లేదు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ కోపరేటివ్‌ బ్యాంకులో ఈ గదిలో ఇలా ఇద్దరం... అచ్చం సినిమాలోలా లేదూ..’’ అన్నాను.‘‘నువ్విక్కడే రైల్వేలో ఉద్యోగం చేస్తున్నావని జ్యోతి చెప్పింది.’’‘‘అవునిక్కడే... రైల్నిలయంలో’’‘‘పెళ్లి...’’‘‘ఊ..హూ..’’‘‘ఇంకా మీ ఇంటి ప్రాబ్లమ్స్‌ తీరలేదా?’’‘‘ప్చ్‌....’’‘‘గోల్డ్‌ లోన్‌ కోసం వచ్చిందీ....’’‘‘నేనే.... మా అవనిజ డెలివరీ.... హాస్పిటల్‌ బిల్లు కట్టాలి. ’’‘‘వస్తువేది?’’సంకోచిస్తూనే... నా చేతిలో వున్న గోల్డ్‌ చెయిన్‌ ఆమె ముందుంచాను. దాన్ని చూస్తూనే దివ్య మొహంలో రంగులు మారడం గమనించి....‘‘వేరే సోర్స్‌ లేక...’’ అనేసరికి, దివ్య తలొంచు కుంది. మా ఇద్దరి ఫ్రెండ్‌షిప్‌ వృద్ధయ్యే రోజుల్లో... పిజి ఫస్టియర్‌లో నేను యూనివర్శిటీ సెకండ్‌ వచ్చినందుకు దివ్య నాకిచ్చిన గిఫ్ట్‌ ఈ గోల్డ్‌చెయిన్‌.‘‘దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ తియ్య కూడదు’’ అని కండీషన్‌ కూడా పెట్టింది.ఆ క్షణంలోనే నా వేలికున్న గోల్డ్‌ రింగ్‌ తీసి ఆమె వేలికి తొడిగాను. అది ఇప్పటికీ ఆమె వేలికుంది. అది నేను చూడాలని చేతి వేళ్లని నా ముందకు చాపింది.