నేను చిన్నగున్నపడు మా ఊర్లె జట్కలుండేటియి.వాడకట్టుకు మూడు మైల్ల దూరంల రేల్‌టేషన్‌ ఉన్నది. టేషన్‌ కాడ్కి జట్కలనేబోయెటోల్లం. నెలకొకపారిఏ ఊరికన్న బోతె బాగుండునని అనుకునేటోన్ని. గని ఎండకాలం తాతీలల్లనే మా నాయినమమ్ములను పట్నందీస్కబోయేటోడు. పట్నంలమా కాక ఉన్నడు. నాకుదినాం జట్క ఎక్కాలని ఉన్నా ఊరికి బోయెటపడే జట్క ఎక్కేమోక దొరికేది. మా ఊరి దవకాన కాడికెల్లి రేల్‌టేషన్‌ దాంక డాంబర్‌ తొవ్వ వుండేది. గా తొవ్వ మీద జట్కబోతుంటె టక్‌టక్‌ మని సపడు వొచ్చేది.మా బంగ్ల ఎన్క కాలి మైదానం వుండేది. గా మైదాన్ల పచ్చగడ్డి మొలిసేది. గాదాన్ల గుర్రాలను ఇడ్సెటోల్లు. పచ్చగడ్డి తినుకుంట గుర్రాలు మైదాన్ల దిర్గేటియి. రాజుల సిన్మ జూసినప్పటి సంది నాకు గుర్రం ఎక్కాలని వుండేది. గని నేనెంత మొత్తుకున్నా ఎవ్వరు నన్ను గుర్రం ఎక్కిపియ్యలేదు. గుర్రం ఎక్కాలంటె ఏం జెయ్యాలని ఒకపారి ఒక్క తీర్గ సోచాయించిన. ఎవ్వరో ఎక్కిపిచ్చేది ఏంది? ఎట్లన్న జేసి నేనే గుర్రం ఎక్కితె బాగుంటుందని అనుకున్న.

అనుకోని ఒక అయితారం మా బంగ్ల ఎన్క ఉన్న మైదాన్లకు బోయిన. గా మైదానంల రెండు మూడు గుర్రాలు పచ్చగడ్డి దినుకుంట ఉన్నయి. గుర్రం తోక బట్కోని మెల్లగ గుర్రం మీదికి ఎక్కుదామనుకున్న. సపడు జెయ్యకుంట బోయి ఒక గుర్రం తోక బట్టుకొని యాలాడిన. తోక బట్టుకోంగనే ఎన్కకాలుతోని నా మూతి మీదగా గుర్రం పెక్కున తన్నింది. గుర్రం తన్నంగనే నేను ఎల్లెంకల బడ్డ. గుర్రం తన్నుడుకు నా మూతి బల్గింది. ముంగటి రెండు పండ్లు ఊసినయి.లేసి నిలబడి ఏడ్సుకుంట ఇంటికి బోయిన. నెత్తురు తోని నా అంగి అంత ఎర్రగైంది. నన్ను సూడంగనే మా అమ్మ ఒక్కతీర్గ మొత్తుకున్నది.‘‘ఏమైందిరా?’’ అని అడిగింది.‘‘బజార్ల బోతుంటె కుక్క ఎంబడి బడ్డది. గది యాడ కరుస్తదోనని ఉర్కిన. ఉర్కుతుంటె రాయిదాకి బడ్డ’’ అని మా అమ్మకు అబద్దం జెప్పిన.నిజం జెబ్తె మా అమ్మ గూడ రెండీక్తది.