గుమ్మంలో ఆమెను చూసిన వెంటనే ఆశ్చర్యపోయాడు సుబ్రమణ్యం. ‘మరీ ఇంత పోలికా’ అనుకున్నాడు.‘‘నా పేరు జానకి. పని మనిషి కావాలన్నారటగా’’ అంది.అవునన్నట్టు తలూపాడు. లోపలికి వచ్చి ఎదురుగా నిలబడింది. అమాయకంగా కనిపించే పని మనిషిలా లేదు. తెలివైన మనిషిలా కనపడింది.‘ముఖతీరులో కొంచెం తేడా ఉంది కానీ శరీరాకృతి మాత్రం అచ్చం అదే’ అనుకున్నాడు.‘‘ఏ ఏ పనులుంటాయి.... ఇంట్లో ఎంత మంది?’’ అనడిగింది.సుబ్రమణ్యం ఆలోచన గతంలోకి, పద్మమీదకి వెళ్ళింది. ‘పద్మ కళ్ళ కన్నా ఈమె కళ్ళు పెద్దవి. ముఖం కొంచెం గుండ్రన. అదే నొక్కుల జుత్తు’ జానకి ముఖంలోకే చూస్తూ పోలికలు సరి చూసుకుంటున్నాడు.‘‘పనులేం చెయ్యాలంటే, మాట్లాడకుండా అలా చూస్తారేం’’ అంది కొంచెం గట్టిగా జానకి.ఉలిక్కిపడ్డాడు సుబ్రమణ్యం. పరిస్థితి మీద అతనికి అదుపు పోయింది. 

‘‘ఆ... అదే... అన్ని పనులూ... ఇంట్లో నేను ఒక్కణ్ణే ఉంటాను’’ అన్నాడు కొంచెం తొట్రుపాటుగా. ఫక్కుమని నవ్వింది జానకి.... నవ్వి.. ‘‘భలే వారే... ఆ కంగారేంటి’’ అంది.ఆ తర్వాత పనుల వివరాలు ఒక్కొక్కటీ తనే అడుగుతూ వచ్చింది. సుబ్రమణ్యం చెప్పాడు. వంటతో కలిపి నెలకు నాలుగువేలు ఇమ్మంది. మరోమాట మాట్లాడకుండా ‘సరే’ అనేశాడు సుబ్రమణ్యం.

మర్నాటి నుంచి పనిలోకి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది.పొద్దున్నే పనిలోకి వచ్చింది జానకి. చొరవగా ఇల్లంతా తిరుగుతూ, ఒక పని వెంట మరో పనిచేస్తూ, రెండు గంటల్లో పనంతా చేసేసింది. మళ్ళీ సాయంత్రం వచ్చి వంట చేసింది. పని చాలా శుభ్రంగా, నీట్‌గా ఉంది. వంట రుచిగా ఉంది. రెండు రోజులు గడిచే లోపే సుబ్రమణ్యం జానకి దొరకటం అదృష్టం అనుకున్నాడు.జానకిలో ఓ రకం తెగువ, ధైర్యం, మొండితనంతో పాటు మంచి మాటకారితనం గమనించాడు సుబ్రమణ్యం. ఉన్నంతసేపూ గలగల మాట్లాడుతోంది. అలా మాట్లాడటం, ఆ మాటలూ సుబ్రమణ్యానికి బావున్నాయి. జానకి ఇంట్లో తిరుగుతున్నంత సేపు అతని చూపులు ఆమెపైనే ఉండేవి.తనూ గమనించిందేమో. ‘‘ఎందుకండీ ఊరికే అలా నా వైపే చూస్తుంటారు?’’ అని అడగనే అడిగింది.