డప్పులతో హోరెత్తిపోయింది ఆ ప్రాంతం:ఉలిక్కిపడి ఎక్కడి పనులు అక్కడ ఆపేసి గబగబా యిళ్ళల్లోంచి బయటకు వచ్చారు ఆ వీధిలోని జనం.కొంచెం దూరంలో దాదాపు వందమంది జనం ఊరేగింపుగా వస్తున్నారు. టపాకాయలు పేలుతున్నాయి. రంగులు గాలిలో కలిసిపోతున్నాయి. కొంతమంది త్రాగేసి డప్పులకి లయబద్ధంగా విజిల్స్‌ వేస్తూ పూనకం వచ్చినట్టుగా డాన్సులు చేస్తున్నారు.ఒక్కసారిగా కోలాహలంగా మారిపోయింది అక్కడి వాతావరణం. అర్ధంకాక అయోమయంగా తిలకిస్తున్న అక్కడి ప్రజల సందేహన్ని నివృత్తి చెయ్యడంకోసం, ఊరేగింపుగా వస్తున్న జనంలోంచి వున్నట్టుండి ఒక మనిషిని భుజాలమీద అమాంతంగా పైకి లేపారు.అందరూ తలలు పైకెత్తి ఆ మనిషిని చూశారు. పైకి ఎత్తబడ్డ వ్యక్తి తనవైపే చూస్తున్న వాళ్ళకి దణ్ణం పెడుతూ, నవ్వుతూ చేతులు వూపుతున్నాడు.అదే వీధి మొదట్లో బడ్డికొట్లో వున్న ముసలమ్మ, తన ముందునుంచి వెళ్తున్న గుంపులోని వెనకాల వ్యక్తిని ఆపి ‘‘ఏరా.. రాముడు? ఏవైంది మన సింహాద్రిగాడికి? మోసుకువెళ్తున్నారు పాపం వాడ్ని’’ అడిగింది.రాముడు పెద్దగా నవ్వాడు ‘‘మోసుకు రావడం ఏందే అవ్వ?... బ్రహ్మరథం. మన సింహాద్రి గాడికి వచ్చే ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చెయ్యడానికి టికెట్టిచ్చారు.’’ అన్నాడు.‘‘ఆ.... ’’ బుగ్గ నొక్కుకుంది అవ్వ.ఒక్క అవ్వకే కాదు, ఆ ప్రాంతంలోనే కాదు, ఆ వూరి ప్రజలకు ఒక జులాయిగా, త్రాగుబోతుగా, రౌడీగా సింహాద్రి సుపరిచితుడే. అలాంటివాడికి టికెట్టా?‘‘ఒరే... ఆగాగు. ఇంతకీ ఏ పార్టీ యిచ్చింది వాడికి టికెట్టు?’’‘‘మన రూలింగ్‌ పార్టీ తరుపునే వాడు పోటీ చేసేది.

 ఇక మన వార్డు బాగుపడినట్టే...’’ అని పరుగులాంటి నడకతో గుంపులో కలిసిపోయాడు రాముడు.వెళ్ళిపోతున్న ఊరేగింపుని చూస్తూ నిట్టూర్చి ‘‘ఆ..... బాగుపడినట్టే?’ కసిగా అనుకుంది.వీధి చివర వుండే తన యింటి ముందుకు రాగానే ఆపమన్నట్టు చేతులు పైకెత్తాడు సింహాద్రి. డప్పులు ఆగిపోయాయి.సింహాద్రి క్రిందకి దిగి మెడలో వున్న దండలతోనే తలుపులు త్రోసి లోపలకి వెళ్ళాడు.లోపల చిరిగిపోయిన చాపమీద కూర్చుని గోడకి ఆనుకుని వుంది సింహాద్రి భార్య దుర్గ. ప్రక్కనే ఆమె ఆరేళ్ళ కొడుకు పడుకుని వున్నాడు.దండలు తీసి ముఖం మీద పడ్డ రంగుల్ని తుడుచుకుంటూ గర్వంగా అన్నాడు ‘‘నీ మొగుడు కాబోయే కౌన్సిలరే... సంబరాలు వినబడట్లేదా? బయటకు రాకుండా ఏం చేస్తున్నావ్‌?’’ఏం మాట్లాడలేదు దుర్గ. అతని వైపు ఒకసారి తలతిప్పి, మళ్ళీ ఎప్పటిలానే గాజు కళ్ళతో శూన్యంలోకి చూస్తూ వుండిపోయింది. ఆమె చెయ్యి నిద్రపోతున్న కొడుకు తల నిమురుతూ వుంది.్‌్‌్‌‘‘నువ్వెన్నయినా చెప్పు. నువ్వు చేసింది నాకు నచ్చలేదయ్యా’’ అలుగుతున్నట్లుగా అన్నాడు సాంబుడు.‘‘ఏం చేశాన్రా?’’ ఉయ్యాల బల్ల మీద వూగుతూ అడిగాడు మాధవరావు. అతను ఆ వూరి ఎమ్మెల్యే.