ముంబైకి అనుకోకుండా మే నెలలో బదిలీ అయింది.‘ఏమండీ! ఓ నెలాగి ముంబైకి పోదాం. హైదరాబాదు వదిలి వెళ్ళాలంటే ఏదోలా ఉంది’ అన్నది శ్రీమతి.‘నెలా..అప్పటికి అడ్మిషన్లు అయిపోతాయి. పాప చదువుకి ఆటంకం కలుగుతుంది’ అన్నాను నేను.ఎక్కువ కాలం వృధా చేయకుండా వెంటనే ముంబైకి బయల్దేరాం. వచ్చిన తెల్లవారే జాయినింగు రిపోర్టు ఇచ్చాను. ఆఫీసులో ఉన్న మాటే గాని, పాప అడ్మిషను గురించే ఆలోచనలు బాధిస్తున్నాయి.‘నేనుండేది వర్లీలో. అక్కడేమైనా యూకేజీలో అడ్మిషన్లు ఇచ్చే స్కూల్లు ఉన్నాయా’ అని కబ్బేని అడిగాను.కబ్బే నా స్టెనో. అతను ఓ క్షణం ఆలోచించి.‘ఏమో సార్‌. తెలుసుకుందాం’ అన్నాడు.సాయంత్రం వరకీ ఓ రెండు స్కూళ్ళ అడ్రసు దొరికింది. ఫోను ద్వారా సంప్రదిస్తే అప్పటికే అడ్మిషన్లు పూర్తయాయని తెలిసింది.‘పేడర్‌ రోడ్‌లో ఓ మంచి స్కూలు ఉంది సార్‌. అక్కడ ప్రయత్నం చేస్తే బాగుంటుంది’ అన్నాడు కబ్బే.మరుసటి దినం అడ్రసు తీసుకుని పేడర్‌ రోడ్‌లోని స్కూలికి బయల్దేరాను.స్కూలు బిల్డింగ్‌ మెయిన్‌ రోడ్డుని ఆనుకుని ఉంది. స్కూలు గురించి చాలా బాగా విన్నాను. ‘అడ్మిషన్‌ దొరుకుతుందో లేదో’నన్న అనుమానాన్ని తొక్కివేసి స్కూలు మెయిన్‌ గేటు వైపు వెళ్ళాను. అది మూసి వేసుంది. తెరవటానికి ప్రయత్నించాను. ‘ఎవరు?’ అంటూ హూంకరిస్తూ వాచ్‌మేన్‌లా ఉన్న వ్యక్తి పెద్ద పె ద్ద అంగలు వేసుకుంటూ నా వైపు వచ్చాడు. ‘అడ్మిషన్‌ కోసం వచ్చాను’ అన్నాను హిందీలో. ఆ వ్యక్తి అక్కడున్న బోర్డు వైపు వేలుపెట్టి చూపించాడు. ‘అడ్మిషన్లు అయిపోయినవి’ అన్న అక్షరాలు చూసి నీరైపోయాను. ‘అయ్యో! ఎలాగా.కనీసం ప్రిన్సిపాల్‌ని కలిసి ప్రాధేయపడదాం’ అనుకుని వాచ్‌మెన్‌కీ విషయం చెప్పాను. 

‘‘లేదు...లేదు...కలవటానికి వీల్లేదు’ ఖచ్చితంగా జవాబిచ్చాడు వాచ్‌మెన్‌. ఎంతో బతిమాలితే సాయంత్రం నాలుగు గంటలకి ప్రిన్సిపాల్‌ని ‘కలిసే సమయం’ అంటూ అప్పుడు రమ్మన్నాడు. ‘హమ్మయ్య’ అనుకుని నుదుట చమట తుడుచుకొని ఆఫీసుకు బయల్దేరాను. సాయంత్రం నాలుగు గంటలు కాక ముందే స్కూలు మెయిన్‌ గేటు దగ్గరకి హాజరయ్యాను. వాచ్‌మెన్‌ నావైపు చూసి, ‘ఎవరు కావాలి?’ అడిగాడు. ‘ఉదయం వచ్చానుగా! మీరు నన్ను సాయంత్రం నాలుగు గంటలకి రమ్మన్నారు’ అన్నాను ఎంతో గౌరవంగా. ‘మంచిది. ప్రిన్సిపాల్‌ని క లవండి’ అనుమతి ఇచ్చాడు.అప్పటికే అరడజను మందికి పైగా ప్రిన్సిపాల్‌ను కలవడానికి ఉత్సాహ పడుతున్నారు. వాళ్ళ పిల్లలకు ఎలా మాట్లాడాలో చెబుతున్నారు. నా నుదుటిపై నున్న చమట బిందువులు నాలోని భావ సంచయాన్ని తెలియజేస్తున్నాయి. చివరకి నాకు పిలుపు వచ్చింది. ‘నేను లోపలకి రావొచ్చా మామ్‌’ వినయంగా అడిగాను తలుపు తట్టి. ‘కమిన్‌’ అన్నది ప్రిన్సిపాల్‌. నా ముఖంలో ఆందోళన నాట్యమాడుతోందని తెలిసి కూడా, బలవంతంగా చిరునవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. ‘పాపకి యూ.కేజిలో అడ్మిషన్‌ కావాలి. అనుకోకుండా ఉద్యోగ బదిలీ అయింది’ అంటూ మొదలు పెట్టాను. అడ్మిషన్లు మార్చిలోనే అయిపోయాయి’ సీరియస్‌గా జావాబిచ్చింది ఆమె. నేనేదో చెప్పబోతుంటే... ‘కూర్చోండి’ అంటూ కుర్చీ చూపించింది. ‘థాంక్యూ మామ్‌. మీరే ఎలాగైనా నాకు సహాయం చేయాలి. నేను ముంబైలో పని చేయటం ఇదే తొలిసారి’ మరో జాలి పూర్వకమైన చిరునవ్వుతో బ్రతిమలాడాను. ‘ఉహూ. కష్టం’ అన్నది ప్రిన్సిపాల్‌. ‘లేదు’ నుంచి ‘కష్టం’ వరకు వచ్చిందని లోలోన సంతోష పడుతూ...‘మీరే నాకు సహాయం చేయగలరు మామ్‌’ దృఢంగా పలికాను. ‘ఓకే. ఛైల్డ్‌ ఎక్కడ?’ అడిగింది. పిడుగు నా నెత్తిన పడ్డట్టయింది. ‘పాపను తీసుకు రాలేదు’ అన్నాను భయం భయంగా. ‘వాట్‌? ఊరికే వస్తే ఎలా? అడ్మిషన్‌ కోసం వచ్చామంటారు. పాపని మాత్రం తీసుకురారు. మిమ్మల్ని చూసి పాపకి సీటియ్యాలా?’ కోపం తెచ్చుకుంది.