వింధ్యకి దక్షిణాన్న ఒక పెద్ద నేరేడు చెట్టు. దాని మీద ఓ చిన్న వానరుడు. హాయిగా పండ్లు తింటూ పళ్లికిలిస్తూ కూర్చుని ఉన్నాడు. ఇంతలో వాళ్ల నాన్న ‘‘వాలకా ఎక్కడున్నావురా?’’ అంటూ వెతుక్కుంటూ వచ్చాడు. వాలకుడు జవాబు చెప్పలేదు. వాడికి నచ్చే ఆటల్లో తండ్రితో ఆడే దొంగాట ముందుంటుంది. ఆకుల చాటున దాక్కున్నాడు. కాని తండ్రికి కనిపించిపోయాడు.తండ్రి ‘‘నేనోడిపోయాన్రా! ఏ చెట్టు మీదున్నావో దిగరా!’’ అంటూ చూడనట్టు బతిమాలాడు. వాలకుడు నవ్వుతూ దూకాడు.‘‘ఏమిటి నాన్నా!’’ అని అడిగాడు.‘‘ఎప్పుడూ చిరుతిళ్లేనా? నాలుగు అరటిపి పళ్లు తెచ్చాను. తిందువుగాని రా. పిల్లలు బలమైన తిండి తినాలి.’’‘‘నాకు బలం వస్తే ఈసారి రాక్షసులతో యుద్ధానికి నన్ను తీసుకొని వెళ్తావా?’’‘‘ఓ అల్లాగే!’’వాలకుడు గబగబా ఆ పళ్లు తినేసి మిగిలిన వానర బాలకులతో ఆడుకోడానికి వెళ్లిపోయాడు. తండ్రి రాజుగారి కొలువుకు వెళ్లాడు. అక్కడ చాలా హాడావిడిగా ఉంది. సుగ్రీవ మహరాజు, దేశం నలుమూలల నుంచి వానరులు, జాంబవులు తను రావణాసురుడితో చేయబోయే యుద్ధానికి సహాయంగా రావలసిందిగా కబురు పెట్టాడుట.

 సమయం లేదు. వెంటనే బయల్దేరాలి!వాలకుడి తండ్రికి బెంగ పట్టుకుంది. సుగ్రీవాజ్ఞను మీరడానికి లేదు. తను బయల్దేర్తే వాలకుడు వెంట బయల్దేరక మానడు. తల్లి వాలకుడిని కంటూనే చనిపోవడంతో, వాడ్ని తను చాలా గారాబంగా, తన ప్రాణం కంటే మిన్నగా పెంచుకున్నాడు. ఇలా ఆలోచిస్తుంటే అతని రాజు ‘‘రానియ్యి! ఫర్వాలేదు. అగ్ని కొడుకు నీలుడు వస్తున్నాడు. వాడూ అల్లరి చిల్లరి వాడే. వాలి కొడుకు అంగదుడు వస్తున్నాడు. వాడికిప్పుడే కాస్త బుద్ధి కుదురు వస్తోంది. కాని పూర్తిగా ఆటకోతితనం పోలేదు. విశ్వకర్మ కొడుకు నలుడు తండ్రిలాగా మంచి సేతుశిల్పి అయ్యాడట. అతనికి వాలకుడిని సహాయంగా పెడ్దాం!’’ అని ధైర్యం చెప్పాడు.అరటి పళ్లు తిన్న వెంటనే ఫలితం కనిపించినందుకు వాలకుడు సతోషించాడు. వానరమూక బయల్దేరింది. దారి పొడుగునా మరో ప్రాంతం నుంచి వస్తున్న మూకలు కలిశాయి.వాలకుడికి మంచి సరదాగా ఉంది. అందరూ నడుస్తూ, మధ్య మధ్యలో ‘రాముడికి జై’, ‘సుగ్రీవుడికి జై’ అని అరుస్తూంటే తనూ గెంతుతూ ఉత్సాహంగా అరవసాగాడు. నెమ్మదిగా వానరసందోహం కిష్కింద చేరింది.ఎత్తుగా ఉన్న ఆసనం మీద కూర్చున్నవాడు లేచి, ‘‘రేపు మనం లంకకి బయల్దేరబోతున్నాం’’ అని చెప్పాడు. వాలకుడు ‘‘అతను ఎవరు నాన్నా?’’ అని తండ్రినడిగాడు.‘‘ఆయనే సుగ్రీవుడు. మనందరికి మహారాజు’’ అన్నాడు.అప్పుడు వాలకుడు ‘‘సుగ్రీవ మహరాజుకీ జై’’ అని అరిచాడు. అందరూ జై అని వంత పలికారు. తనకంత మంది వంత పలుకుతుంటే వాలకుడు రెచ్చిపోయి మరో రెండు సార్లు జయజయలు చెప్పించాడు.