సాక్షికి జంఘాలుడు నమస్కారములు.ప్రస్తుత కాలములో అందరూ గ్రాంథికాంధ్రములో కాక వ్యావహారిక తెలుగులోనే రచనలు చేస్తూండడం వల్ల నా లేఖను వ్యవహారభాషలో పంపిస్తున్నాను.నాలుగు రోజుల క్రింద రాష్ట్ర రాజధానీ నగరంలో హేతువాద సభ ప్రత్యేకంగా స్త్రీలకోసం ఏర్పాటు చేశారు. హేతువాదమంటే ఏమిటి, ప్రపంచంలో నిర్హేతుకంగా ఏమైనా ఉంటుందా అన్న విషయం తెలుసుకునేందుకు సభకు వెళ్లేను. సభా ప్రాంగణం ఎక్కువగా స్త్రీలతో నిండిపోయింది. పట్టు చీరలూ, సింథటిక్‌ చీరలూ, నూలు చీరలూ, సల్వార్‌ కమీజులూ, పాంటు షర్టులూ, ఇంకా ఎన్నో కొత్తరకాల డ్రెస్సులతో ఉన్న మహిళలతో రంగురంగుల పూలతో ఉన్న వనంలా సభాప్రాంగణం మెరిసిపోయింది. సభానిర్వాహకులు మాత్రం పురుషులే. స్త్రీలు తమకు వ్యతిరేకంగా ఏం మాట్లాడతారోనన్న కుతూహలంతో కాబోలు పురుషులు కూడా చాలామందే సభకు వచ్చారు.సాక్షీ, ఇతర మత ధర్మాలతో నాకు పూర్తి పరిచయం లేకపోవడం వల్ల నేను అందరు మహిళలు మాట్లాడిన విషయాలూ మన సభ్యులకోసం వ్రాయలేకపోతున్నాను. 

అందరికన్నా చివరగా హిందూ మతంలో స్త్రీలకు జరిగిన అన్యాయాల గురించి ఒక మానిని ఉపన్యసించారు. ఆ ఉపన్యాస సారాంశం ఈ లేఖ ద్వారా తెలియ చేస్తున్నాను.‘‘సోదరీమణులారా, ఇంతవరకూ మాట్లాడిన మహిళలు తమతమ మతాలలో స్త్రీలకు జరిగిన అన్యాయాల గురించి ప్రసంగించారు. కానీ హిందూమతంలో స్త్రీలకు జరిగిన అన్యాయం ఏ మతంలోనూ జరగలేదని ఘంటాపథంగా చెప్పగలను. అన్నిటికన్నా పెద్ద అన్యాయం ముందుగా వినండి’’:‘‘నస్త్రీ స్వాతంత్య్రమర్హతి’’ అన్నారు. ఏస్త్రీకీ స్వాతంత్ర్యానికి అర్హత లేదట. అంటే అర్థమేమిటి? స్త్రీ కట్టుబానిసలా పడి ఉండాలనే కదా. స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు పురుషుడి హక్కు. స్త్రీ స్వేచ్ఛగా ఉండకూడదు. పురుషుడి ఆజ్ఞానుసారం నడుచుకోవాలి. అంతే కదా.అక్కడతో ఆగారా? ఉద్యోగం పురుష లక్షణమన్నారు. దాని అర్థమేమిటి? మగవాళ్ళు మాత్రమే ఉద్యోగాలు చెయ్యాలి. ఆడది ఇంటిపనీ, వంటపనీ చేస్తూ వంటింటి కుందేల్లా పడి ఉండాలి. ఆమె ఉద్యోగం చేసి డబ్బు సంపాదించకూడదు. ఆమె డబ్బుకోసం మగవాణ్ణి దేవిరించాలి. అతను కరుణించి నాలుగు రాళ్లు విదిలిస్తే సంతోషించాలి. అంతేకదా ఆమెకు ఆర్థిక స్వాతంత్య్రం అవసరం లేదని ఎపడో ఈ మగవాళ్ళు నిర్ణయించేశారు. ఒకవేళ ఆమె కాదు కూడదని డబ్బు సంపాదిస్తే ఏమవుతుంది. స్త్రీ విత్త అథమాథమం అంటూ ఆమె సంపాదనని హీనంగా చిత్రీకరించారు.పోనీ ఇంట్లో పడున్నా ఈ మగవాళ్ళు ఊరుకున్నారా? లేదే. అందరూ భగవంతుడని కొలుస్తున్న రాముడేం చేశాడు? భార్యను అనుమానించాడు. ఆమె శీలాన్ని శంకించాడు.

నిర్దాక్షిణ్యంగా నిండుగర్భిణిని అడవిలో వదిలేశాడు.ఇలా ఉంది హిందూమతం....ఆమె ఈవిధంగా చాలాసేపు ప్రసంగించింది. కరతాళఽధ్వనులు మిన్ను ముట్టాయి. చివరగా అధ్యక్షుల వారు సభకు వచ్చిన వారిలో ఎవరైనా తమ అభిప్రాయాల్ని చెప్పవచ్చును, కానీ అయిదు నిముషాలకాన్నా ప్రసంగించకూడదన్నారు. నేను వెళ్ళి మైకు అందుకున్నాను. మగవాడిని కాబట్టో, సనాతన సంప్రదాయాన్ని ఎక్కువగా విశ్వసించేవాడిలా కనబడ్డానో, మరి ఏకారణమో కానీ అఽధ్యక్షులు ‘‘స్త్రీలను కించపరిచేలా మాట్లాడకూడదు’’ అన్నారు. నేను అంగీకారసూచకంగా తల ఊపి ప్రసంగం ప్రారంభించాను. కంచుకంఠం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు చెపకున్నాను. అందరూ నిశ్శబ్దంగా వినసాగారు.