అయిదొందల గడప ఉండే అగ్రహారంలో నిన్న మొన్నటి వరకు శేషగిరి టిఫెన్ హోటల్, ప్రేవమ్మ భోజనం హోటల్ మాత్రమే ఉండేవి.కర్నూలు రోడ్డులో చుట్టుపక్కల ఏడెనిమిది గ్రామాలకి కూడలి ప్రాంతంగా ఉన్న అగ్రహారానికి పదిమైళ్ళ దూరంలో టౌన్ ఉండడంతో సినిమాలకీ, ఇతర పనులకీ వెళ్ళే గ్రామాల ప్రజలు తప్పనిసరిగా అగ్రహారం సెంటర్లో రోడ్డు పక్కన కాసేపు ఆగి పైనించి వచ్చే బస్సుల్లో టౌన్‌కి వెళ్తుంటారు.మొయిన్ రోడ్డులో కాకుండా రామమందిరం వీధిలో మెడికల్ డిస్పెన్సరీ దగ్గర మూడు రోడ్ల కూడలిలోని పెంకుటింట్లో కోమటి శేషగిరి హోటల్. ప్రొద్దుట ఇడ్లీలు, కొబ్బరి, సెనగపప పచ్చడి, ధనియాలకారం, ఉల్లిగడ్డ-పచ్చిమిరపకాయలు-చింతపండుతో కచ్చాపచ్చాగా నీళ్లచెట్ని. ఊకపొయ్యి పెనం మీద అటు మందంగా, ఇటు పల్చగా కాకుండా మధ్యస్తంగా అక్కడక్కడ చిల్లుల్తో లోపలివైౖపు ఉల్లి, మిర్చి ముక్కలు వేసి ఓ వైపు మాత్రమే ముదురు ఎరుపుగాకాల్చే మినపట్లు.
మధ్యాహ్నం మూడు తర్వాత ప్రొద్దుట మిగిలిపోయిన దోశపిండి, ఇడ్లీపిండిలో ఉల్లిపాయ, మిర్చి ముక్కలు కలిపి నూనెలో దేవిన పునుగులు, ఉల్లిపకోడి, టీలు, కాఫీలూ. ఇలా శేషగిరి హోటల్ పర్మినెంట్ మెనూకి అగ్రహారం ప్రజలు కూడా ఇన్నాళ్ళూ బాగా అలవాటు పడిపోయారు.ఆదివారాలు, సెలవరోజుల్లోనైతే కోటంశెట్టి మనవడు శేషగిరీ, పోస్ట్‌మేన్ సూర్యనారాయణ కొడుకు ప్రభు, డాక్టరుగారిబాబు, ఆయిల్‌మిల్లు గురవయ్యగారి ఆఖరి కొడుకు కన్నయ్, చాక్లెట్ పంతులు చిన్నపిల్ల సుబ్బమ్మతో సహా చాలామంది స్కూలు పిల్లలు ఉదయాన్నే శేషగిరి హోటల్‌కి వైరుబుట్టతో వచ్చి మరీ ఇడ్లీలు, దోశలు పార్సెల్ చేసి తీసుకెళ్లేవాళ్ళు.సరిగ్గా ఇలాంటి సమయంలో టౌన్‌కి వెళ్ళే కర్నూలు రోడ్డులో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు ఆగే రామారావు బట్టలకొట్టుకి పది ఇళ్ళ తర్వాత ఎడమపక్కనున్న పాతకాలపు పెంకుటింట్లోకి ఓ మధ్యాహ్నంపూట మినీ లారీలో అయ్యరు కుటుంబం దిగబడిపోయింది.రంగూన్ టేకుతో చేసినట్లున్న నల్లటి చెక్కబల్లలు, వాటిమీద పాలరాతిలాంటి ఏకరాయిని బిగించినవి. అచ్చంగా అలాంటివే ఓ పది కుర్చీలు. పెద్ద రోలు, అల్యూమినియం గిన్నెలు, జగ్గులు, స్టీలుగ్లాసులు. ఇంకా ఏమిటేమిటో అన్నీ ఆ మినీలారీలోంచి దింపుకున్నారు. అయ్యరు, భార్యా, పెళ్ళికి ఎదిగి చాలారోజులయినట్లుగా నందివర్థనం లాంటి కూతురూ, పొట్టిగిత్తలాగా నిక్కరులోకి చొక్కాని టక్‌చేసి స్టైల్ కొట్టే కొడుకూ.