ఇంటికొచ్చేసరికి అమ్మ రుసరుసలాడుతూ ఉంది. నన్ను చూసీ చూడగానే తన అసహనాన్ని అక్కడున్న వస్తువుల మీద చూపించింది. అకారణంగా కోపం తెచ్చుకోవడం అమ్మల సహజ లక్షణం అనుకుంటాను. నాకేమీ అర్థం కాలేదు. ఏమీ పట్టనట్లు మేడమీద నా గదివైపుగా వెళ్లాను. బ్యాక్‌ పాక్‌ పక్కనబెట్టి తలుపేద్దామని చూస్తే అక్కడ అమ్మ నిలబడుంది. ఏమయిందన్నట్లు కళ్లెగరేసాను.‘‘నువ్వు సీనియర్‌ నైట్‌ పార్టీకి సైనప్‌ చేసావా?’’ మాటలు మెల్లగా ఉన్నా కళ్లల్లో కోపం లావాలా ఉప్పొంగింది. అవునన్నట్లు తలాడించాను.‘‘నాతో చెప్పలేదేం?’’ ఈసారి గొంతు పెరిగింది. ఆశ్చర్యంగా చూసాను. నా నుండి జవాబు రాకపోయేసరికి ఉక్రోషంగా మళ్లీ అదే అడిగింది.‘‘అమ్మా! ఇది ఆర్నెల్లక్రితం స్కూల్‌ నోటీసులో ఉంది. డాడ్‌ చెక్కు రాసిస్తేనే కట్టాను. అయినా ఇప్పుడెందుకిదంతా...?’’‘‘నువు వెళ్లడం లేదు...’’ అరిచినట్లుగా అంది. ఏం? అన్నట్లు కళ్లు చిట్లించి, ఆశ్చర్యంగా చూసాను.

‘‘ఆ సీనియర్‌ నైట్‌ పార్టీలో డాన్సులూ, ముద్దులూ ఉంటాయట కదా? నీరూ వాళ్లమ్మ చెప్పింది!’’‘‘అమ్మా అది ఒక హైస్కూల్‌ ఇయర్‌ ఎండ్‌ పార్టీ! మా స్కూల్‌ టీచర్లందరూ ఉంటారు!’’‘‘‘ఈ సీనియర్‌ నైట్‌ ప్రామ్‌ గురించి నెట్‌లో అంతా చదివాను. నువ్వు వెళ్లడం లేదంతే!’’‘‘అమ్మా....! డాడ్‌...’’ అని చెప్పబోతుండగానే నా మాటలు వినిపించుకోకుండా ‘‘డాడ్‌ కాదు. నేను చెబుతున్నాను. వచ్చాక ఆయనే చెబుతారు నీకు...’’ అనేసి విసురుగా వెళ్లిపోయింది.ఒక క్షణం తలదిమ్ముగా అయింది. ఆలోచిస్తే అర్థమయ్యింది. ఇదంతా నీరూ చేసిన పనే! ఐ హేట్‌ నీరూ!ఫఫఫమూడువారాల నుండి అమ్మ నాతో విచిత్రంగా ప్రవర్తిస్తోంది. అయినదానికీ కానిదానికీ చిర్రుబుర్రులాడుతోంది నా మీద.

సరిగ్గా రెండు వారాల క్రితం ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. కర్టిసీ నీరూ! ఆ రోజు స్కూలు నుండి రాగానే అమ్మ అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. యుద్ధం మొదలు పెట్టింది.‘‘ఏంటి? ఫేస్‌బుక్కులో వాడెవడినో హగ్‌ చేస్తూ ఆ ఫోటో! తీసెయ్యి. పరువు తీస్తున్నావు కదే? మన ఇంటా వంటా లేవ ఇలాంటి పనులు...’’నా గదికి వెళ్లినా, వెనకాలే వచ్చి, మళ్లీ అదే గోల. చెప్పిందే చెప్పడం! ఇంతకీ నేను చేసిన నేరం ఏమిటంటే నా క్లాస్మేట్‌ విలియంని హగ్‌ చేసుకోవడం. ఆ ఫోటోను నా ఫేస్‌బుక్‌లో ఇంకో స్నేహితురాలు పోస్ట్‌ చేసింది.వీకెండ్‌ స్కూల్‌ టీమ్‌ టెన్నిస్‌ మ్యాచ్‌ గెలిచాక విలియం అభినందిస్తూ హగ్‌ ఇచ్చాడు. నా ఫ్రెండ్‌ వికా దాన్ని ఇవాళ ఉదయమే ఫ్రెండ్స్‌ అందరికీ షేర్‌ చేసింది. అప్పుడే అమ్మకెలా తెలిసిపోయింది? అర్థమయింది. ఇది నీరూ చేసిన పనే! నాన్న వచ్చి సర్ది చెప్పినా అమ్మ చల్లబడలేదు. నేను ఫేస్‌బుక్‌లో లాగిన్‌ అయ్యి ఆ ఫోటో తీసేసేవరకూ సతాయిస్తూనే ఉంది.