నాకు నిన్ను చూడాలని వుంది. ఎప్పుడొస్తావు?’’ ఫోను తీయగానే అడిగింది పెద్దక్క.నా గుండె దడదడ కొట్టుకుంది. ఎందుకో గాభరాగా అనిపించింది. ‘ఏవైంది? ఎందుకిలా హఠాత్తుగా చూడాలని వుంది.. ఎప్పుడొస్తావు అనడుగుతూంది?’ మనసులో ప్రశ్నలు.‘‘నీ ఆరోగ్యం ఎలా వుందక్కా?’’ సాధ్యమైనంత వరకు మామూలుగా ధ్వనిం చాలని ప్రయత్నించాను.‘‘నాకేం? గుండ్రాయిలా వున్నాను‘‘ అంది ధీమాగా. అదే జవాబు పదిహేను సంవత్సరాలుగా చెబుతోంది. ఆమె ఆత్మస్థైర్యానికి ఆశ్చర్యమనిపిస్తుంది. కాస్త జలుబు చేసి, తలనొప్పి, జ్వరం వస్తేనే మిన్ను విరిగి మీద పడినట్టు హడావుడి చేస్తాను నేను. కానీ తను మాత్రం తొణకదు.‘‘నువ్వెలా వున్నావు? నడుము నొప్పి తగ్గిందా?’’ తనే అడిగింది.‘అయ్యో రామ! కాస్త వంగీ లేచీ పనిచేసానంటే ఎక్కడ లేని నొప్పీ చంపేస్తుంది’ అనబోయి బలవంతంగా నియంత్రించుకున్నాను. ‘తగ్గిందిలే.. రేపు శివరాత్రి కదా... ఉపవాసం... పూజ.. ఆయన సంగతి తెలుసుగా... పండగకాగానే బయల్దేరి వస్తాను’’ అన్నాను.‘‘నువ్వు రాకపోతే నేనే వస్తాను. నాకు నిన్ను చూడాలని వుంది’’ అంది మళ్ళీ.ఆ మాటల్లో ఎంత పట్టుదల? తనకి నడుము చుట్టూ ఎనిమిది అంగుళాల బెల్టు వేసారు. అడుగుతీసి అడుగు వేయడానికి కష్ట పడుతుంది. నేను అక్కను చూసి మూడు నెలలయిపోయింది. నాకూ చూడాలని మనసు పీకుతూనే వుంది. ఎప్పటికప్పుడు ఏవో అడ్డంకులు. ప్రయాణం కుదరలేదు. గట్టిగా అయిదు గంటలు ప్రయాణం కూడా లేదు. ఆవలి ఎల్లుండి ఆరు నూరైనా వెళ్ళి చూసి రావాలి. ఈ మధ్యన కాస్త పరాకు. మతిమరపు ఎక్కువగా వుందని అక్క కూతురు చెప్పింది.

అప్పుడే భోజనం చేసి వచ్చినా ‘అన్నం తిన్నావా?’ అనడిగితే ‘ఇంకా లేదు’ అంటుందిట. ఇప్పుడెలా వుందో’ అనుకున్నాను.‘‘అక్కా మొన్న ఒక పాట వింటుంటే రాగం గుర్తుకు రాలేదు. అదే... మల్లీశ్వరి సినిమాలో ‘పిలచినా బిగువటురా’ మన కిష్టం కదూ?’’ అన్నాను.‘‘బిళహరి కదా!’’ అంటూ ఆరోపణ అవరోహణ వినిపించింది ఫోనులోనే.‘‘హమ్మయ్య... ఫరవాలేదు. గొంతు గంటకొట్టినట్టు వినిపించినట్టే మెదడు పదునుగా పని చేస్తోంది ఇంకా... ఆ మరపు అవీ అప్పుడప్పుడు వస్తాయేమో.సంగీతం తనకు ప్రాణం. వీణ చేతబట్టితే అపర సరస్వతిలా వాయించగలదు. నాన్నగారి కెంత గర్వమో కూతురి విద్వత్తు చూసి. నాన్నగారు వున్నప్పుడు అక్క పుట్టింటికి వచ్చిందంటే మేమూ వెళ్ళాల్సిందే. ఎందుకంటే తనే మాకు తల్లి. అమ్మ పోయాక మా చదువులు పెళ్ళిళ్ళు అన్నీ తన చేతిమీదే జరిపించింది.రాత్రి భోజనాలయ్యాక తొమ్మిదింటికి ‘‘ఏమ్మా ఇక వీణ పట్టుకుంటావా?’’ అనే వారు నాన్న గారు. హంసధ్వని రాగంలో ‘వాతాపి గణపతిం భజే’తో మొదలు పెట్టి నాన్నగారి కిష్టమైన కీర్తనలన్నీ వాయించేది. కదన కుతూహల రాగంలో ‘రఘువంశ సుదాంభుది చంద్ర’ కీర్తన వాయించేటప్పుడు చిట్టిబాబు వీణ మీద చేసే చిత్ర విచిత్రమైన సాములన్నీ తనూ యథాతథంగా పలికించేది. ఆఖర్న ‘కొమ్మలో కోయిలా ‘కూ’ అన్నదే‘ అన్న లలితగీతం ఆ ‘కూ’ అన్న కోయిల స్వరం వినగానే ఎంత సంతోషమనిపించేదో....