నగరంలోకెల్లా ఖరీదైన బట్టల షాపుల్లో అది ఒకటి. మూడు అంతస్తుల్లో పట్టుచీరలు, పురుషులకి సూటింగ్స్‌, షర్టింగ్స్‌, పిల్లలకి రెడీమేడ్‌ దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, కాస్మెటిక్స్‌, కృత్రిమ నగలు వీటన్నింటితో, విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకృతమయిన దుకాణం అది.అక్కయ్య ఉమ పెళ్ళి సందర్భంగా మేం ఇంటిల్లిపాదీ షాపింగ్‌కోసం వచ్చాం. నేను, అన్నయ్య ఆనందమూర్తి, వదిన కనకలకి్క్ష, పెళ్ళికూతురు ఉమక్క అందరం వచ్చాం.నాలుగు గంటలు దాటింది షాపింగ్‌ మొదలుపెట్టి.షాపువాళ్ళు టీలు ఆఫర్‌ చేశారు. వాళ్ళ దగ్గర వున్న పట్టుచీరలు, మైసూర్‌ సిల్క్‌ చీరలు, కాటన్‌లో వెంకటగిరి, గద్వాల్‌ వంటి చేనేత చీరలు, ఇలా చూపిస్తూనే వున్నారు. ఉమక్క, వదిన చీరలు అలమరాల్లోంచి తీయించి చూస్తూనే వున్నారు. ఉమక్క పెళ్ళి పట్టుచీరెలు నాలుగు, ఇంకా గద్వాల్‌ చీరలు, వెంకటగిరి చీరలు, పెట్టుబడికి వేరే చేనేత, షిఫాన్‌ చీరలు ఇట్లా ఒక యాభై, అరవైకి పైగా చీరలు కొన్నారు.ఉమక్క పట్టుచీరల సెలక్షనే గంటన్నర, రెండు గంటలు పట్టిది. రెండు ప్రక్కలా అంచుండాలి, వీలైతే రెండురంగుల అంచు ఉండాలి, సిల్క్‌ ప్యూర్‌ది అయి వుండాలి, గాడీగా వుండకూడదు, గ్రాండ్‌గా కనబడాలి, హంసల బోర్డరు, నెమళ్ళ బోర్డరు చిలకల బోర్డరు, మామిడి పిందెల బోర్డరు - ఇలా రకరకాలు వెతికారు. 

పైటకొంగుకి గ్రాండ్‌గా జరీ వుండాలి. వెండి జరీ అయి వుండాలి - టెస్టెడ్‌ జరీ పనికిరాదు. ఖరీదు ఎంతైనా సరే. పసుపుకి ఎర్రబోర్డరు ఇదివరకే వున్నదని, పసుపుకి గ్రీన్‌ బోర్డరు అందరూ కొనుక్కుంటున్నారని, పసుపుకి నీలం బార్డరు ముదురుగా వున్నదని తిరగకొట్టారు.సీకో చీరలు అందరూ పదిహేనేళ్ళుగా కడుతూనే వున్నారు - వద్దు - అన్నారు. పోచంపల్లిలో పెద్ద బోర్డరు రావడం లేదు, మధ్యరకం బోర్డరు కూడా రావడం లేదు. చిన్న బోర్డరు నచ్చలేదు. అసలు పోచంపల్లిలో పూర్వపు రంగులు, అంచులు, ఆ కాంబినేషన్‌లు లేవు. అందువల్ల నచ్చలేదు. చెక్స్‌ బోర్డరు కొత్తగా వస్తోంది కాని గాడీగా (ఆర్భాటంగా) ఉన్నదని ఉమక్క వద్దన్నది. ముదురు రంగులు బాగోవు. అలాగని మరీ పేస్టల్‌ కలర్స్‌ అయితే రాత్రిపూట రిసెప్షన్‌లో బాగా మెరుస్తూ కనిపించవు. ఆ చీరలు చూసి అందరూ ఇంత మామూలుగా వున్న చీర అంత ఖరీదా?! అంటారుట.చివరికి యాభై చీరలు చూసి నాలుగు చీరలు ఎన్నిక చేశారు. పెళ్ళి చీరలు కదా, ఖరీదయినవి, జీవితాంతం వుండేవి, ఆమాత్రం రంగులు, అంచులు, మన్నిక, నాణ్యత, వైవిధ్యం చూసుకోకుండా కొంటామా - అన్నారు.వాళ్ళ చీరల ఎంపిక అయ్యేలోగా నేనూ, అన్నయ్యా మార్నింగ్‌షో సినిమా చూసి వచ్చినా బావుండేది అనుకున్నాం.